నా కొడుకుని ఏమీ అనవద్దు... విజయ్ మాల్యా
తను చేసిన తప్పులకు తన బిడ్డను నిందించవద్దంటూ విజయ్‌మాల్యా ట్విట్టర్‌లో కోరాడు. 28 ఏళ్ల సిద్ధార్థ మాల్యా కూడా తన తండ్రిలాగానే మంచి జల్సారాయుడని పేరు. అరకొర దుస్తులు ఉన్న మోడల్స్‌తో సిద్ధార్థ మాల్యా దిగిన ఫొటోలు బాగానే ప్రచారం పొందేవి. ఇక దీపికా పదుకొనేతో సిద్ధార్థ సాగించిన స్నేహం కూడా చాలారోజులు వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం లండన్‌లోని డ్రామా స్కూల్‌లో చదువుతున్న సిద్ధార్థ, గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో తన తండ్రిని వెనకేసుకు వస్తూ కనిపించేవాడు. అందుకు జనం సిద్ధార్థను కూడా తిట్టడం మొదలుపెట్టారు. దీంతో ఇప్పడు విజయ్ మాల్యా తన బిడ్డను రక్షించేందుకు పూనుకున్నారు. ‘మీరు నన్ను ఎంతగా ద్వేషించినా ఫర్వాలేదనీ, కానీ అభంశుభం తెలియన తన బిడ్డ జోలికి మాత్రం వెళ్లవద్దని’ ట్విట్టర్ సాక్షిగా కోరాడు. దీనికి సిద్ధార్థ బదులిస్తూ, తనకు వస్తున్న పది ట్విట్టర్ సందేశాలలో ఒకటి మాత్రమే సానుకూలంగా ఉంటోందనీ, మిగతా తొమ్మిదీ తనను తిడుతున్నవే అని వాపోయాడు. ఈ తండ్రీకొడుకుల సెంటిమెంటకు జనం పెద్దగా ప్రభావితం అయినట్లు కనిపించడం లేదు. తండ్రి నుంచి వారసత్వంగా దొంగ సొమ్ముని కనుక తీసుకోకపోతే, తాము సిద్ధార్థని క్షమించేందుకు సిద్ధంగా ఉన్నామని కొందరు ప్రకటించారు కూడా! మరికొందరేమో ముందు బిడ్డను వెనకేసుకు రావడం మానేసి, అప్పులు చెల్లించమని మాల్యాను నేరుగా విమర్శించారు.