వరల్డ్ టి 20 : భారత్ ను ఓడించి ఫైనల్ కు చేరిన వెస్టిండీస్
సెమీస్ కు చేరాలంటే పోరాడాల్సిన గేమ్ లో భారత్ చేతులెత్తేసింది. ఇన్నాళ్లూ కష్టపెట్టిన బ్యాటింగ్ ఈ మ్యాచ్ తో గాడిలో పడితే, ఇప్పటి వరకూ కాపాడుతూ వచ్చిన బౌలింగ్ తేలిపోయింది. వెస్టిండీస్ బాదుడుకు భారత బౌలర్లు దిక్కులు చూడాల్సిన పరిస్థితి. వరల్డ్ క్లాస్ బౌలర్ గా పేరున్న అశ్విన్ కేవలం రెండే ఓవర్లు వేసి 20 పరుగులు సమర్పించుకున్నాడు. నెహ్రా తప్పితే మిగిలిన రెగులర్ బౌలర్లందరూ 10 పైనే రన్ రేట్ తో పరుగులు ఇచ్చేశారు. విరాట్ కోహ్లీ ఒకటిన్నర ఓవర్ వేసి ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ కోసం తన సర్వ శక్తులూ ఒడ్డిన కోహ్లీ, ఒక్కడి ఎఫర్ట్ గెలిపించడానికి సరిపోలేదు. అదృష్టం కూడా వెస్టీండీస్ వెంటే ఉంది. అశ్విన్ బౌలింగ్ లో సిమ్మన్స్ బుమ్రా పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అవుటైనా అది నోబాల్ అని తేలింది. 15వ ఓవర్లో ఇదే సిమ్మన్స్, పాండ్యా బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చాడు. అది కూడా నోబాలే. బుమ్రా బౌలింగ్ లో జడేజా బౌండరీలో క్యాచ్ పట్టి, బ్యాలెన్స్ తప్పి రోప్ ను తొక్కేశాడు. అది కూడా సిమ్మన్స్ అదృష్టమే. ఇన్ని లైఫ్ ల తర్వాత 82 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ను గెలిపించాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ వచ్చిన వాళ్లు వచ్చినట్టు అడ్డంగా బ్యాట్ ఊపేస్తుండటంతో, ఫీల్డింగ్ కరెక్ట్ గా పెట్టే అవకాశం ధోనికి లేకపోయింది. ప్రమాదకర గేల్, సామ్యూల్స్ లను ముందే అవుట్ చేసినా, వెస్టిండీస్ పవర్ హిట్టర్ల ముందు ఇండియా బౌలింగ్ నిలవలేకపోయింది. ఇంకో రెండు బంతులు మిగిలుండగానే రస్సెల్ కొట్టిన సిక్స్ తో వెస్టిండీస్ ను ఫైనల్ కు చేరింది.
స్కోర్లు:
ఇండియా - 192/2 ( రోహిత్ - 43, రహానే - 40, కోహ్లీ - 89, ధోనీ - 15) (రస్సెల్ 1 - 47, బద్రీ 1 - 26)
వెస్టిండీస్ - 196/3 (ఛార్ల్స్- 52, గేల్ - 5, శామ్యూల్స్ - 8, సిమ్మన్స్ - 82, ఆండ్రీ రస్సెల్ - 43 ) (నెహ్రా 1 - 24, బుమ్రా 1 - 42, కోహ్లీ 1 - 15 )