భారత్ పరాజయం.. బంగ్లా కేప్టెన్‌కు పట్టరాని ఆనందం
ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ ఓడిపోయినంత మాత్రాన, అవతలి జట్టు మీద కసి పెంచుకోవడం ఎంతవరకు సంస్కారం! తమను ఓడించిన ఇండియా, వెస్టిండీస్ చేతిలో భంగపడినందుకు... ఓ బంగ్లా ఆటగాడి ప్రతిస్పందన చూస్తే విషయం మనకే అర్థమవుతుంది. ముష్‌ఫికుర్ రహ్మాన్ బంగ్లా వికెట్‌కీపరే కాదు, టెస్టు క్రికెట్‌లో ఆ జట్టుకి నాయకుడు కూడా! గత వారం భారత్ చేతిలో బంగ్లా జట్టు తృటిలో ఓడిపోవడంతో, రహ్మాన్ మనసు గాయపడినట్లుంది. అందుకే నిన్న వెస్టిండీస్ చేతిలో భారత్ పరాజయం కావడం చూసి రహ్మాన్‌కు పట్టలేని సంతోషం వేసింది. ‘ఇండియా ఓడిపోయింది. ఈ ఆనందం పట్టలేకపోతున్నాను’ అంటూ మ్యాచ్ ముగిసిన వెంటనే రహ్మాన్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
వెంటనే విమర్శల వెల్లువ మొదలైంది. ప్రత్యర్థులను గౌరవించడమే ఆటగాడి వ్యక్తిత్వానికి నిదర్శనం అని ఒకరంటే, అసలు బుర్ర పనిచేస్తోంద అంటూ మరొకరు మండిపడ్డారు. దీంతో రెహ్మాన్ చేసిన చిమ్టా పనికి క్షమాపణ చెప్పక తప్పలేదు. తన మాటలు నొప్పించి ఉంటే క్షమించమనీ, తాను వెస్టిండీస్ జట్టు మీద అభిమానంతోనే ఇలాంటి ట్విట్టర్‌ను పోస్టు చేశానని నీళ్లు నమిలాడు. అయినా కూడా భారతీయ అభిమానులు ఊరుకుంటారా! ఇప్పటికిప్పుడు వెస్టిండీస్ జట్టు మీద అభిమానం ఎలా పొంగుకు వచ్చిందని దులిపిపారేశారు. భారతీయ అభిమానులను రెచ్చగొడితే ఏం జరుగుతుందో రెహ్మాన్‌కు ఈ దెబ్బతో తెలిసి వచ్చి ఉంటుంది.