బీహార్లో జరిగిందే రిపీట్ అవుతుందీ... రాహుల్
అసోంలో ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ బడాబడా నేతలంతా ప్రచారంలో మునిగిపోయారు. మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసోంలో పర్యటిస్తే, ప్రస్తుతం రాహుల్‌గాంధి ప్రచారాన్ని అందిపుచ్చుకుంటున్నారు. అసోంలో గత పదిహేనేళ్లుగా ఉన్న తరుణ్ గొగోయ్ ప్రభుత్వాన్ని ఈసారి కూడా గెలిపించాలని రాహుల్ పట్టుదలగా ఉన్నారు. అందుకే అక్కడి ప్రచారంలో దూకుడుగా కనిపిస్తున్నారు. బీజేపీని కనుక అసోం ప్రజలు ఎన్నుకుంటే, ఆరెస్సెస్ భావజాలం రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని అన్నారు రాహుల్. ఆరెస్సెస్ అక్కడి భాష, చరిత్ర, సంస్కృతులను తనకు అనుగుణంగా మార్చివేస్తుందని హెచ్చరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశానికి చేసింది ఏమీ లేదని. నల్లధనాన్ని రాబడతానని చెప్పి మాల్యా వంటి అవినీతిపరులను తప్పించారని విమర్శించారు. అరుణ్ జైట్లీ నల్లధనాన్ని పోగు చేసిన వారు తప్పించుకునే పథకాలను ప్రవేశపెట్టారని మండిపడ్డారు. రాహుల్ ప్రసంగాలు అసోం ప్రజల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో మరి! ఎందుకంటే ఈపాటికే విడుదల అయిన ఒపీనియన్ పోల్స్, అసోంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నాయి.