విరాట్‌ విశ్వరూపానికి ఐసీసీ ఫిదా..వరల్డ్ టీ20 కెప్టెన్‌గా కోహ్లీ

  తన ఆట తీరుతో సామాన్యుల నుంచి క్రికెట్ దిగ్గజాల వరకు అందరి ప్రశంసలు అందుకున్న టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి తాజాగా ఐసీసీ కూడా ఫిదా అయిపోయింది. టీ20 ప్రపంచకప్ ప్రతి మ్యాచ్‌లో టీమిండియా విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు కోహ్లీ. వెస్టిండీస్‌ చేతిలో ఓటమి అనంతరం అతన్ని ఓదార్చాడం ఎవ్వరి తరము కాలేదు. ఈ టోర్నిలో విశ్వరూపం చూపించిన కోహ్లీ మూడు హాఫ్ సెంచరీల సాయంతో 273 పరుగులు చేశాడు. అతని ప్రదర్శనకు గానూ టోర్ని ఆఫ్ ద ప్లేయర్ అవార్డును ప్రకటించిన ఐసీసీ కోహ్లీకి ఇంకా ఏదైనా చేయాలనుకుంది. దానిలో భాగంగా ప్రపంచంలోని బెస్ట్ టీ20 ప్లేయర్స్‌తో జట్టును ఎంపిక చేసి దానికి కోహ్లీని కెప్టెన్‌గా చేసింది. భారత్ నుంచి విరాట్‌తో పాటు సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు చోటు దక్కింది. వరల్డ్ టీ20 టీమ్: విరాట్ కోహ్లి(భారత్, కెప్టెన్) జాసన్ రాయ్(ఇంగ్లండ్) డికాక్(దక్షిణాఫ్రికా) జో రూట్(ఇంగ్లండ్) బట్లర్(ఇంగ్లండ్) షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా) ఆండ్రీ రస్సెల్(వెస్టిండీస్) మిచెల్ సాంట్నార్(న్యూజిలాండ్) డేవిడ్ విల్లే(ఇంగ్లండ్) శామ్యూల్ బద్రి(వెస్టిండీస్) ఆశిష్ నెహ్రా(భారత్) ముస్తాఫిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్)

మీడియాకు కాళ్లు చూపించిన సామ్యూల్స్.. మాబోర్డు కంటే బీసీసీఐ బెటర్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ ల మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో వెస్టీండీస్  టి-20 ప్రపంచ కప్ ను గెలిచింది. ఓడిపోతుందనుకున్న సమయంలో కార్లోస్ బ్రాత్ వైట్ వరుసగా నాలుగు సిక్సులు కొట్టి విజయానికి కారకుడయ్యాడు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా విజయం తరువాత వెస్ట్టిండీస్ ఆటగాళ్ల తీరుపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. వెస్టిండీస్ ఆటగాడు మార్లోన్ సామ్యూల్స్.. మైకులు పెట్టే టేబుల్ పైన రెండు కాళ్లూ ఎత్తి పెట్టుకుని నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పాడని విమర్శలు వస్తున్నాయి.     ఇదిలా ఉండగా వెస్టిండీస్ డాషింగ్ ఆల్రౌండర్ డ్వెన్ బ్రావో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై విమర్శలు చేశాడు. వెస్టిండీస్ బోర్డు కంటే బీసీసీఐ చాలా మద్దతుగా నిలిచిందని.. విండీస్ బోర్డు పగ్గాలు సరైన వ్యక్తుల చేతిలో లేవనిబ్రావో అన్నాడు. అంతేకాదు తాము కప్ గెలిచినా కూడా ఎవరూ ఫోన్ చేయలేదని.. తాము ప్రపంచ కప్ గెలుస్తామని బోర్డు అధికారులు నమ్మలేదని, గెలవాలని కోరుకోలేదని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు బ్రావో వ్యాఖ్యలపై విమర్శలు తలెత్తుతున్నాయి.

బ్యాంకులకు నచ్చని మాల్యా ఆఫర్..

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి కింగ్ పిషర్ అధినేత ఉడాయించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిది వేల కోట్లు రూపాయలు బకాయిలు పడ్డ విజయ్ మాల్యా ఎన్నో ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు సెప్టెంబర్ లోపు 4 వేలకోట్లు చెల్లిస్తానని చెప్పాడు. అయితే మాల్యా చెప్పిన మాటాల్లో స్పష్టత లేదని.. ఆయన బకాయి పడిన డబ్బుతో పోలిస్తే, బ్యాంకుల దృష్టిలో ఇది చాలా చిన్న మొత్తమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం పెదవి విరిచింది. ఇప్పటికే బ్యాంకుల వద్ద తనఖాలో ఉన్న ఆయన కంపెనీల వాటాలనే రూ. 2 వేల కోట్లుగా చూపించే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కనీసం రూ. 8 వేల కోట్ల ప్లాన్ తో వస్తేనే మాల్యాతో చర్చించాలని కన్సార్టియం నిర్ణయించినట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ అధికారి వివరించారు.

ఐసీయూలో ప్రత్యూష బెనర్జీ బాయ్ ఫ్రెండ్

  ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈమె ఆత్మహత్యపై ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ పై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ప్రత్యూషా ఫ్రెండ్స్ కూడా రాహుల్ పై పలు ఆరోపణలు చేశారు. రాహుల్ రాజ్సింగ్తో ప్రత్యూషకు విభేదాలున్నాయ‌ని.. రాహుల్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్తో కలసి ప్రత్యూషను మోసం చేశాడని, చాలాసార్లు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడని చెబుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా రాహుల్ ను విచారిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం రాహుల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని.. ప్రత్యూష చనిపోవడంతో రాహుల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు.. దీంతో శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నాడని.. ఇదే పరిస్థితి కొనసాగితే బ్రెయిన్ హ్యుమరేజ్‌కు దారితీసే ప్రమాదముందని వైద్యులు తెలిపారని ఆయన తరపు లాయర్ తెలిపారు.

దారుణం.. న్యాయవాదిని కత్తులతో పొడిచి చంపారు

  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. న్యాయవాదిని కత్తులతో పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్ అనే న్యాయవాది ఏలూరు వన్ టౌన్ లోని దుకాణంలో ఉండగా నలుగురు వ్యక్తులు కత్తులతో ఆయనపై దాడి చేశారు. ఈ దాడి వలన తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ, న్యాయవాది హత్య కేసులో నలుగురు నిందితులున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

డబ్బు దాచుకున్న వారిలో ఐశ్వర్యా రాయ్.. అంతా అబద్దం

  పనామా పేపర్స్ అనే పత్రిక దేశాల్లో డబ్బు దాచుకున్న వారి జాబితాలోని పేర్లను బయటపెట్టి అందరికి షాకిచ్చారు. ఇందులో 500 మంది భారతీయుల పేర్లు బయటపెట్టి అందరికి షాకిచ్చింది పనామా పేపర్స్. అయితే ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. ఈ 500 మందిలో 140 మందికి పైగా రాజకీయ నాయకులు, 200 మంది వరకూ వ్యాపారవేత్తలు, 12 మంది రాష్ట్రాధినేతలు, సెలబ్రిటీల పేర్లను పనామా పేపర్స్ విడుదల చేసింది. దీనిలో బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ పేర్లు ఉండటం ఆశ్చర్యం. ఐశ్వర్యా రాయ్, ఆమె తల్లిదండ్రులు, సోదరులు బ్రిటన్ లో 2005లో రిజిస్టరైన అమిక్ పార్ట్ నర్స్ లిమిటెడ్ లో డైరెక్టర్లని, ఆ సంస్థ ద్వారా బ్లాక్ మనీని నిర్వహించారని పేర్కొంది. అమితాబ్ నాలుగు విదేశీ సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నారని ఈ కంపెనీలు 5 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల మూలధనం నిల్వలను కలిగినప్పటికీ, మిలియన్ల విలువైన డీల్స్ చేశాయని పేర్కొంది. అయితే దీనిపై ఐశ్యర్యరాయ్ స్పందిస్తూ..బ్లాక్ మనీ కుంభకోణంలో తన పేరుండటం షాక్ ను కలిగించిందని, ఇదంతా పచ్చి అబద్ధమని, పూర్తి అవాస్తవమని పేర్కొంది.

మరోసారి తన వక్ర బుద్ధి చూపిన పాకిస్థాన్..

  ప్రత్యర్ద దేశమైన పాకిస్థాన్ ను అంత తేలిగ్గా నమ్మడానికి లేదని మరోసారి రుజువు చేసింది. గతంలో మాట మార్చిన మాదిరిగానే ఇప్పుడు కూడా మాటమార్చి తన నైజాన్ని మరోసారి నిరూపించుకుంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ విమాన స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. పఠాన్ కోట్ దాడికి కారణమైన జైషే మహ్మద్ చీఫ్ అయిన మసూద్ అజార్‌ను మొదట పాకిస్థాన్ అరెస్ట్ చేశామని.. గృహనిర్భందంలో ఉంచామని చెప్పినా ఆతరువాత అందంతా వత్తిదే అని చెప్పి మాటమార్చింది. ఇప్పుడు పఠాన్ కోట్ పై దాడి నిమిత్తం దాడికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు పాకిస్థాన్ నుంచి కొంతమంది అధికారులు మార్చి 29న పఠాన్ కోట్ ఎయిర్ బేస్కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఉన్నంత సేపు ఏం మాట్లాడని పాక్ దర్యాప్తు బృందం సొంత దేశంలో కాలు పెట్టగానే మాత్రం నోరు విప్పింది. పఠాన్ కోట్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు అసలు తమ దేశానికి చెందిన వారేనని చెప్పే ఆధారాలను భారత్ తమకు అందజేయలేదని నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది.   అంతేకాదు భారత ఎన్ఐఏ అధికారులు తమకు కేవలం 55 నిమిషాలు మాత్రమే ఎయిర్ బేస్లోకి అనుమతించారని, ప్రధాన మార్గం నుంచి కాకుండా ఏదో ఇరుకైనా మార్గం నుంచి తమను తీసుకెళ్లారని, వారిచ్చిన ఆ గడువు కేవలం నడిచేందుకు సరిపోయింది తప్ప ఆధారాలు సేకరించేందుకు వీలుకాలేదని అన్నట్లు తెలుస్తోంది. కానీ ఎన్ఐఏ అధికారులు మాత్రం పాకిస్థాన్ బృందానికి ఘటన స్థలాన్ని మొత్తం చూపించామని.. వారు కొన్ని ఆధారాలు కూడా సేకరించారని అంటున్నారు.  

అమెరికాకు చాలా కష్టాలుంటాయి.. అప్పంతా తీర్చడమే నా లక్ష్యం.. ట్రంప్

  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి పెట్టింది పేరుగా తయారయ్యారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటి వరకూ భారత్.. చైనా..ఇంకా పలు విషయాలపై వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా అమెరికాపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో అమెరికా తీవ్రమైన కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని అన్నారు. అంతేకాదు.. అమెరికాలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, దేశం అతిపెద్ద మాంద్యం దిశగా వేగంగా పడిపోతోందని, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అత్యంత క్లిష్టపరిస్థితి ఎదురుకానుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా అమెరికా 19 ట్రిలియన్ డాలర్ల రుణాలను పలు దేశాలకు, సంస్థలకు ఇవ్వాల్సి వుందని.. వచ్చే ఎనిమిదేళ్లలో అప్పంతా తీర్చడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రచారంలో తాను దూకుడుగానే వెళతానని, అదే తన బలమని చెప్పిన ట్రంప్, ఒంటరిగా వెళ్లి అధ్యక్ష పీఠాన్ని చేపడతానన్న నమ్మకముందని అన్నారు.

ప్రత్యూష బెనర్జీ గర్భవతా..?

ప్రత్యూష బెనర్జీ కేసులో రోజుకో ఆసక్తికరమైన విషయం బయటపడుతోంది. ఇప్పటికే ఇది హత్యా లేక ఆత్మహత్యా అని తెలుసుకోవడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు.. చనిపోయే సమయానికి ప్రత్యూష రెండు నెలల గర్భిణీ అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  ఆమె గర్భవతి కావొచ్చునని వైద్యులు అనుమానిస్తున్నారు. వారు శాంపిల్స్‌ను జేజే ఆసుపత్రికి పరీక్షల కోసం పంపించారు. అయితే దీనిపై పోలీసులు ధ్రువీకరించినా, పోస్టు మార్టం నివేదిక అందిన తర్వాతే ఈ విషయంపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. కాగా ముంబైలోని తన సొంతింటిలో ప్రత్యూష ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాను సీరియల్స్ నిర్మాత, నటుడు రాహుల్ రాజ్ సింగ్ తో గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తుంది.

అసదుద్దీన్ పై బాబా రాందేవ్ మండిపాడు.. లక్షమందినైనా చంపుతా..

  'భారత్ మాతా కీ జై' ఈ నినాదం ఇప్పుడు దేశంలో పెద్ద దుమారమే రేపుతోంది. అసదుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే ఎంతోమంది ఆయనకు కౌంటర్లు ఇచ్చినా మళ్లీ ఎవరో ఒకరు.. ఏదో ఒక సందర్బంలో మాత్రం దాని గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే. ఇప్పుడు జాబితాలో రాందేవ్ బాబా కూడా చేరిపోయారు. ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన దీనిపై మాట్లాడుతూ.. తలకు టోపీ పెట్టుకున్న ఒకతను తాను భారత్ మాతా కీ జై అనను అని అంటాడు.. ఈదేశంలో చట్టం అనేది ఒకటి ఉంది దానిని నేను గౌరవిస్తాను.. లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్లను లక్షల మంది నైనా నరికి చంపడానికి నేను సిద్దం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ దుమారం ఎంత వరకూ వెళుతుందో చూడాలి.

కొడుకే కాదు ఊమెన్ చాందీ నన్ను లైంగికంగా వేధించాడు..

  సోలార్ స్కాంలో ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై సరితా నాయర్ అనేక అరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల మంజూరుకోసం తాను ముఖ్యమంత్రిగారికి రెండు కోట్లు ఇచ్చానని చెప్పడంతో ఊమెన్ చాందీ ఇబ్బందుల్లో పడ్డారు. అయితే మళ్లీ ఇప్పుడు మరో వ్యవహారంలో ఊమెన్ చాందీపై ఇరుకున పడ్డట్టు తెలుస్తోంది. అదేంటంటే..సరితా నాయర్ గతంలో అంటే మార్చి 19, 2013రాసిన ఓ లేఖ వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. అయితే ఆ లేఖలో ఊమెన్ చాందీ తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. అంతేకాదు కొడుకుతో పాటు తండ్రి కూడా తనపై వేధింపులకు పాల్పడ్డారని రాసింది. ప్రస్తుతం ఈ లేఖ కేరళ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అయితే దీనిపై స్పందించిన ఊమెన్ చాందీ ఎన్నికల వేళ, తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శత్రువర్గం చేస్తున్న తుది ప్రయత్నమే ఇదని అన్నారు. ఇంకా ఈ లేఖపై సరితా నాయర్ స్పందిస్తూ.. అది నేను గతంలో పోలీసు కస్టడీలో ఉండగా రాశాను.. అందులో రాసిందంతా నిజమే.. కానీ ఇప్పుడు దానిపై నేను మాట్లాడాలనుకోవడం లేదు అని అన్నారు. మరి ఈ లేఖపై ఇంకెంత దుమారం రేగుతుందో చూడాలి.

చివరి ఓవర్లో వరస సిక్సులు..వరల్డ్ కప్పు వెస్టిండీస్ దే..!

  వెస్టిండీస్ ను ఎందుకు ప్రమాదకర టీం అంటారో ఫైనల్లో మరోసారి ప్రూవ్ అయింది. చివరి ఓవర్లో 19 పరుగులు కొట్టాల్సి ఉండగా, వరస నాలుగు సిక్సులు కొట్టి మరో రెండు బంతులు మిగిలుండగానే చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది విండీస్ సేన. దీంతో టి20 వరల్డ్ కప్ రెండు సార్లు అందుకున్న మొదటి టీం గా నిలిచింది.156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో 85 పరుగులతో నాటౌట్ గా నిలిచిన మార్లోన్ ముఖ్య పాత్ర పోషించాడు. అతనికి బ్రేవో, బ్రాత్ వైట్ నుంచి మాత్రమే సహకారం లభించినా, 156 పరుగుల్ని ఛేదించడానికి అది సరిపోయింది.     విండీస్ విజయానికి ఇరవయ్యవ ఓవర్లో 19 పరుగులు కావాలి. బౌలర్ బ్రాత్ వైట్ క్రీజ్ లో ఉన్నాడు. విండీస్ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా బెన్ స్టోక్స్ వేసిన ఆ ఓవర్లో తొలి నాలుగు బంతుల్ని, నాలుగు సిక్సర్లుగా మలిచి, విండీస్ కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు బ్రాత్ వైట్. చేజేతులా మ్యాచ్ ను ఓడిపోయినందుకు బెన్ స్టోక్స్ మైదానంలో కన్నీళ పర్యంతమయ్యాడు. గేల్ స్కోర్ చేయకపోయినా తాము గెలవగలమని, విండీస్ లో అందరూ మ్యాచ్ విన్నర్లే అని మరోసారి నిరూపించింది ఈ ఫైనల్ మ్యాచ్.అండర్ 19, వుమెన్ టి20 వరల్డ్ కప్, మెన్ వరల్డ్ కప్, ఇలా మూడు ఫార్మాట్లలో ఈ ఏడాది కప్పులు కొట్టి చరిత్ర సృష్టించింది విండీస్.

వరల్డ్ కప్ కోసం వెస్టెండీస్ 20 ఓవర్లలో 156 పరుగులు చేయాలి..!

  ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. టర్నింగ్ ట్రాక్ ను విండీస్ స్పిన్నర్ బద్రీ సద్వినియోగం చేసుకున్నాడు. అతని బంతులు ఎలా ఆడాలో కూడా బ్యాట్స్ మెన్ కు తెలియలేదు. అతని నాలుగుఓవర్లలో పద్నాలుగు బంతులు డాట్ బాల్సే. విండీస్ బౌలింగ్ ధాటికి విలవిల్లాడిన ఇంగ్లాండ్ ను జోరూట్(54, 36 బంతుల్లో) అర్ధ శతకంతో ఆదుకున్నాడు. బట్లర్ (36, 22 బంతుల్లో) ఉన్నంత సేపూ మెరుపులు మెరిపించాడు. చివర్లో డేవిడ్ విల్లో(21, 14 బంతుల్లో) హిట్టింగ్ తో ఇంగ్లాండ్ 155 పరుగులకు చేరుకోగలిగింది. విండీస్ బౌలర్లలో బ్రావో, బ్రాత్ వైట్ లు చెరో మూడు వికెట్లు, బద్రీ రెండు వికెట్లు, రసెల్ ఒక వికెట్ తీశారు. ఇప్పటికే విండీస్ మహిళల జట్టు, కప్పును గెలిచింది. విండీస్ కుర్రాళ్ల జట్టు కూడా కప్పు గెలుస్తుందని ఆ దేశ అభిమానులు ఆశిస్తున్నారు

కెప్టెన్సీకి ఆఫ్రిది రాజీనామా..రిటైర్మెంట్ లేదు..!

  వరల్డ్ కప్ లో ఘోర ప్రదర్శన తర్వాత, స్వదేశంలో తీవ్రవిమర్శలు ఎదుర్కుంటోంది పాక్ టీం. దీనికి బాధ్యుడిగా అన్ని వేళ్లూ ఆఫ్రిదినే చూపించాయి. అతనిది బాధ్యతా రాహిత్యం అంటూ వకార్ యూనిస్ పిసీబీ కి రిపోర్ట్ ఇచ్చాడు. దీంతో వరల్డ్ కప్ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ, ఆఫ్రిది కెప్టీన్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్ గా తప్పుకున్నా, ఆటగాడిగా తన సేవలు పాక్ క్రికెట్ కు అందిస్తానని, రిటైర్మెంట్ గురించి ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని ఆఫ్రిది ప్రెస్ నోట్ లో వివరించాడు. పాక్ వరల్డ్ టి20 నుంచి నిష్క్రమించిన నిముషం నుండే, ఆఫ్రిదిని బోర్డు తప్పించబోతోందంటూ పాక్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దాంతో బోర్డుకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తనే తప్పుకున్నాడు ఆఫ్రిది. టోర్నీని ఆఫ్రిది సీరియస్ గా తీసుకోలేదని, అసలు కెప్టెన్సీ ఎలా చేయాలో తెలియనట్టు ఆఫ్రిది వ్యవహరించాడని, జట్టు మ్యానేజర్ ఇంతికాబ్ ఆలం, కోచ్ వకార్ యూనిస్ లు ఆప్రిదిపై విమర్శలు గుప్పించారు. వీటికి తోడు, భారత ప్రేక్షకులను పొగుడుతూ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు కూడా అతని కెప్టెన్సీ కి ఎర్త్ పెట్టాయి. ఇకపై కనీసం ప్లేయర్ గానైనా ఆఫ్రిదిని బోర్డు కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

' చిన్నారి పెళ్లికూతురు ' ప్రత్యూష ఆత్మహత్యకు కారణాలేంటి..?

  చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ నటి ప్రత్యూష ఆత్యహత్య వెనుక కారణాలను పోలీసులు ఛేదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆత్మహత్య వెనుక హత్యాకోణం కూడా ఉండొచ్చనే ఉద్దేశంతో ఆమె లవర్ రాహుల్ రాజ్ సింగ్ ను కూడా విచారించారు. కానీ విచారణ తర్వాత, ప్రత్యూషది కేవలం ఆత్మహత్యేనని, దీని వెనుక రాహుల్ హస్తముండే అవకాశం లేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ధిక ఇబ్బందులు, డిప్రెషన్ ప్రత్యూషను ఆత్మహత్యచ చేసుకునే విధంగా పురికొల్పి ఉండచ్చంటున్నారు. ప్రత్యూష తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఆత్మహత్య ఉదంతంలో, రాహుల్ ప్రమేయం లేదనే చెబుతున్నారు. మరి ప్రత్యూష శరీరంపై గాయాలున్నాయంటూ, ఆమె స్నేహితులు చెబుతున్న సంగతేమైందనే ప్రశ్న చాలామందిలో ఉత్పన్నమౌతోంది. ఆమెకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవంటూ, ఆమె స్నేహితులు చెబుతుండటం ప్రత్యూష కేసు విషయంలో పోలీసులకు చిక్కుముడిని మరింత జటిలం చేస్తోంది.

నేనింకా కన్యనే : పెళ్లి కోసం ప్రకటన ఇచ్చిన నటి..!

  అరణ్య పుయ్ పాథుమ్ థాంగ్ వయస్సు 40 ఏళ్లు. బ్యాంకాక్ సినిమాల్లో నటి. ఇంకా పెళ్లి కాలేదు. వివాహం కోసం చాలా ప్రయత్నాలు చేసింది గానీ ఎందుచేతనో వర్కవుట్ కాలేదు. దాంతో డైరెక్ట్ గా భారీ హోర్డింగ్ పెట్టి ప్రకటన ఇచ్చేసింది. 40 ఏళ్ల కన్య పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. భర్త కోసం ఎదురుచూస్తోంది అంటూ ఆ హోర్డింగ్ పై తన అర్ధనగ్న ఫోటోపెట్టి మరీ ప్రకటించింది. ఈ ప్రకటనకు వాంట్ యూ అని హెడ్డింగ్ పెట్టింది. తనను పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రస్ట్ ఎవరికైనా ఉంటే సంప్రదించవచ్చని ఫోన్ నంబర్ కూడా ఇచ్చిందండోయ్. తాను చనిపోయే లోపు పెళ్లి చేసుకుని, మ్యారేజ్ లైఫ్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేయాలనుకుంటోంది ఈ ముదురు భామ. అక్కడ మసాలా చిత్రాల్లో నటించే నటి కావడంతో, పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో, పాథుమ్ ఈ ప్రకటన ఇచ్చింది. పెళ్లి కొడుకు దొరుకుతాడో లేదో తెలీదు కానీ, మేడమ్ ఇచ్చిన ప్రకటన దెబ్బకి ఇలా అర్ధనగ్నంగా పబ్లిగ్గా ఫోటో పెట్టడమేంటంటూ పోలీసులు మాత్రం కేసు పెట్టారు. కేసు పెడితే పెట్టారులే, పెళ్లైతే చాలంటోందీ సుందరి. మరి ఎవరైనా దొరుకుతారో లేదో చూడాలి.