ఇక‌పై మ‌గాళ్ల‌క్కూడా ప్యాట‌ర్నిటీ లీవులు

  సాధారణంగా మెట‌ర్నిటీ లీవులంటే మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం. కానీ ఇక‌పై మ‌గాళ్ల‌కు వీటిని వ‌ర్తింపజేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌ను మార్చాల‌ని యోచిస్తోంది. స‌రోగ‌సీ ద్వారా సంతానం పొందాల‌నుకునే మ‌హిళా ఉద్యోగుల‌కు 180 రోజులు ప్రెట‌ర్నిటీ లీవు ఇవ్వాల‌ని డిపార్ట్ మెంట్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్ అండ్ ట్రైనింగ్ ప్ర‌తిపాదించింది. స‌రోగ‌సీతో తండ్రులయ్యే పురుషుల‌కూ ఆరు నెల‌లు ప్రెట‌ర్నిటీ సెల‌వులు ఇవ్వాల‌ని సిఫార‌సు చేసింది. స‌రోగ‌సీ ద్వారా సంతానం పొందే మ‌హిళ‌ల‌కు లేదా అద్దెగ‌ర్భం మోసే త‌ల్లుల‌కు మెట‌ర్నిటీ సెల‌వులు ఇవ్వ‌డం అనేది ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్వీస్ రూల్స్ లో లేదు. త‌మ చిన్నారుల‌ను కంటికి రెప్ప‌లా చూసుకునే స‌రోగ‌సీ దంప‌తుల‌కు 180 రోజులు సెల‌వు ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసింది. ఈ మేరకు నిబంధ‌న‌ల‌ను త‌న వెబ్ సైట్ లో పెట్టింది.

లోకేష్ కోసం ఇంత త్యాగమా..

టీడీపీ యువనేత నారా లోకేష్ ను కేబినెట్లో తీసుకునేందుకు నారా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లోకేశ్ ను కేబినేట్లో తీసుకోవడానికి చంద్రబాబు ఆ పార్టీ నేతలతో సంప్రదించడం.. దానికి పార్టీ నేతలు కూడా ఓకే అనడం జరిగిందట. దీనిలో భాగంగానే ఇప్పుడు నారా లోకేష్ ను కేబినెట్ లో తీసుకునేందుకు వీలుగా మేము రాజీనామా చేస్తామంటే మేము రాజీనామా చేస్తామంటూ ఆయన కోసం విజయవాడ టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధపడుతున్నారట. అయితే లోకేశ్ పెనమలూరు నుంచి పోటీ చేయాలని ఆకాంక్షించడంతో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తాను రాజీనామాకు సిద్దమని చెప్పాడు. మరోవైపు లోకేష్ కోసం తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి దీనిపై మాట్లాడుతానని ఆయన అన్నారు. లోకేష్ ను ఎమ్మెల్సీగా పెద్దల సభకు పంపి కేబినెట్ లోకి తీసుకోవాలని కోరుతానని ఆయన చెప్పారు.

విశ్వనాథన్ ఆనంద్ హృదయనాథ్ పురస్కారం..

  ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఐదు సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న ఆయనకు హృదయనాథ్ పురస్కారం దక్కింది. సాధారణంగా ఈ పురస్కారం దేశంలో వివిధ రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన, విజయవంతమైన వ్యక్తులను ఈ పురస్కారంతో గౌరవిస్తారు. ఇప్పుడు ఈ పురస్కారం ఈయనను వరించింది. ఈ పురస్కారానికి ఎంపికైన విశ్వనాథన్ ఆనంద్ కు రూ.2 లక్షల నగదు, ఒక జ్ఞాపిక ను అందజేయనున్నారు. ఈ నెల 12వ తేదీన మహారాష్ట్రలో జరిగే కార్యక్రమంలో గవర్నర్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. కాగా గతంలో ఈ అవార్డును అందుకున్న వారిలో లతా మంగేష్కర్, బాబా సాహెబ్ పురందరె, ఆశా భోంస్లే, అమితాబ్ బచ్చన్, హరిప్రసాద్ చౌరాసియా, ఏఆర్ రెహ్మాన్ తదితర ప్రముఖులు ఉన్నారు.

ప్రత్యూష బెనర్జీ నన్ను పిలుస్తోంది అంటున్న రాహుల్ సింగ్..

  ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో రోజుకో ఆసక్తికరమైన విషయం బయటపడుతోంది. ఇప్పటికే ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ పరిస్థితి  ఏం బాలేదని.. ఐసీయూలో ఉన్నాడని అతని లాయర్ చెప్పాడు. అయితే ఇప్పుడు రాహుల్ రాజ్ సింగ్ షాక్ కు గురయ్యాడని అతని తండ్రి తెలిపారు. తన కుమారుడి ఆరోగ్యపరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న తన కుమారుడు చిత్రంగా ప్రవర్తించాడని ఆయన చెప్పారు. ప్రత్యూష తనను పిలుస్తోందని, తాను కూడా వెళ్తానని తనతో చెప్పాడని ఆయన పేర్కొన్నారు. దీంతో తన కొడుకు ఏమైపోతాడోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యూష ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, తన కుమారుడు కోలుకోవాలని ప్రార్థించాలని ఆయన కోరారు. కాగా ప్రత్యూష బెనర్దీ తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహుల్ రాజ్ సింగ్ పై ఆరోపణలు వస్తున్న సంగతి కూడా విదితమే.

నిరాశనే మిగిల్చిన 'గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌'.. కేవలం 7 నిమిషాలేనా..?

దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు అని.. ఈ రైలులో అన్ని సౌకర్యాలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన  'గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌' రైలు నిరాశనే మిగిల్చిందా అంటే అవుననే అంటున్నారు ప్రయాణికులు. ఎందుకంటే. ఢిల్లీ, ఆగ్రాల మధ్య నడిచే ఈ రైలు హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్టేషన్‌ నుంచి ఆగ్రా స్టేషన్‌ మధ్య గల 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 100 నిముషాల్లో చేరుకుంటుంది. అయితే ఇప్పుడున్న శతాబ్ది ఎక్స్ ప్రెస్ తో పోలిస్తే కేవలం 7 నిమిషాల సమయాన్ని మాత్రమే గతిమాన్ ఎక్స్ ప్రెస్ ఆదా చేసినట్టు చెబుతున్నారు ప్రయాణికులు. అందునా శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో రూ. 1010 టికెట్ కాగా గతిమాన్ లో ఇదే క్లాస్ సీటుకు 1500 రూపాయలు. కేవలం 7 నిమిషాలకే  50 శాతం అధికంగా చెల్లించడం వృథా అని అంటున్నారు. మొత్తానికి ఎంత వేగంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అంతే స్పీడ్ గా నిరాశను మిగిల్చింది గతిమాన్ ఎక్స్ ప్రెస్.

మరో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి..?

వైసీపీ పార్టీ నుండి ఇప్పటికే ఎంతో మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పటి వరకూ ఎనిమిది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవ్వగా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ.. పరువుల సుబ్బారావు కూడా టీడీపీలో చేరుతున్నారు కాబట్టి వారితో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లో ఉన్నట్టు. ఇప్పుడు మరో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పడం జరిగింది. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీసీల అండతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని.. ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఇంకా వైసీపీ గురించి మాట్లాడుతూ.. మరో నలుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. మరి ఆ నాలుగురు ఎమ్మెల్యేలు ఎవరో తెలియాలంటే ఆగాల్సిందే.

గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది.. దేశంలోనే మొట్టమొదటి హైస్పీడ్ రైలు

  రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే 'గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌' రైలును ప్రారంభించారు. ఈ హైస్పీడు రైలు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ఢిల్లీ, ఆగ్రాల మధ్య నడిచే ఈ రైలు హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్టేషన్‌ నుంచి ఆగ్రా స్టేషన్‌ మధ్య గల 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 100 నిముషాల్లో చేరుకుంటుంది. అయితే ఈ రైలు ఒక్క శుక్రవారం తప్పా మిగిలిన అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది.     కాగా గతిమాన్ ఎక్స్ప్రెస్ రైలులో  ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, జీపీఎస్ బేస్డ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

చంద్రబాబు తొక్కేస్తున్నారు అంటున్న బీజేపీ నేతలు..

  పేరుకు  టీడీపీ- బీజేపీ పార్టీలు మిత్రపక్షాలు.. కానీ ఈ పార్టీల మధ్య విబేధాలు బయటపడుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించడం.. మొదట సెలైంట్ గా ఉన్నా ఆ తరువాత టీడీపీ నేతలు కూడా తిరిగి బీజేపీ నేతలపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అప్పటినుండి ఇప్పటి వరకూ ఏదో ఒక విషయంలో తరుచూ వివాదాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక ఈ రెండు పార్టీలు కలిసి ఉండబోవని కూడా అనుకున్నారు. కానీ ఇప్పటివరకైతే కలిసే ఉన్నాయి. అయితే టీడీపీ పై బీజేపీ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉందని మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే విజయవాడలో బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు టీడీపీ వైఖరిపై విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఉద్దేశ్యపూర్వకంగా టిడిపి దుష్ప్రచారం చేస్తోందని.. దీనిని తిప్పికొట్టకపోతే బిజెపి శ్రేణుల్లో అపోహలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇంకా బిజెపి వారిని టిడిపి తొక్కేస్తోందని, తొక్కించికుంటూ ఇంట్లో పడుకుందామా, జనంలోకి వెళ్దామా అని మరికొందరు ఘాటుగా వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

ఐడియా ఆదిరింది..! ఆర్టీసీ బస్సులో కూలర్లంట

  వేసవి కాలం వచ్చేసింది, రోజు రోజుకి ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ప్రజలు అడుగుతీసి అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. మరి ఇలాంటి ఎండలో దూర ప్రాంతాలకు ప్రయాణం సాగించేవారి పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. ఆర్టీసీ స్థాపించినప్పటి నుంచి బస్సు వివిధ రకాలుగా రూపాంతరం చెందాయి. ప్యాసింజర్,ఎక్స్‌ప్రెస్‌ల నుంచి ప్రయాణం సుఖంగా సాగడానికి డీలక్స్, సెమీ లగ్జరీ, లగ్జరీ, ఫుష్ బ్యాక్ ఇలా చాలా రకాలుగా బస్సులున్నాయి. అయితే వీటిలో సామాన్యులు ప్రయాణించడానికి వారి ఆర్థిక పరిస్థితులు సహకరించవు. వీరి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వినూత్న ప్రయోగం చేసింది.   సాధారణ ప్యాసింజర్ బస్సులో కూలర్లు ప్రవేశ పెట్టారు అధికారులు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డిపోకు చెందిన సిబ్బంది తమ సొంత ఖర్చు 30 వేల రూపాయల వ్యయంతో బస్సులో ఎయిర్ కూలర్లను అమర్చారు. ఏసీ అంత ఫీల్ రాకున్నా..ఎండ వేడిమి నుంచి కాస్తలో కాస్త ఉపశమనం పొందడానికి ఈ ప్రయత్నం మాత్రం విజయవంతమయినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ బస్సు జగిత్యాల నుంచి హైదరాబాద్‌కి వస్తుంది. ఈ బస్సులో ప్రయాణించడానికి ప్రయాణికులు క్యూకడుతున్నారు.

అదంతా భారత్ ఆడిన డ్రామా.. పాకిస్థాన్

  పఠాన్ కోట్ విమాన స్థావరంపై దాడి గురించి పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఉగ్రదాడి జరిగిన ప్రదేశాన్ని పాకిస్థాన్ నుండి వచ్చిన ప్రత్యేక బృందం పర్యవేక్షించి పఠాన్ కోట్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు అసలు తమ దేశానికి చెందిన వారేనని చెప్పే ఆధారాలను భారత్ తమకు అందజేయలేదని నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు భారత ఎన్ఐఏ అధికారులు తమకు కేవలం 55 నిమిషాలు మాత్రమే ఎయిర్ బేస్లోకి అనుమతించారని, కేవలం నడిచేందుకు సరిపోయింది తప్ప ఆధారాలు సేకరించేందుకు వీలుకాలేదని చెప్పింది.   ఇప్పుడు మరోసారి పాకిస్థాన్ మీడియా ఇండియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఉగ్రదాడి ఘటన భారత్ ఆడిన నాటకమని.. భారతే ఈ దాడికి పాల్పడిందని.. పాకిస్థాన్ పై విష ప్రచారం చేసేందుకే ఇండియా నాటకమాడుతుందంటూ..  పాకిస్థాన్ దర్యాప్తు బృందం చెప్పిందంటూ ఓ ప‌త్రిక పేర్కొంది. ఎయిర్ బేస్ లోకి ప్రవేశించిన కొద్దిసేపటికే సాయుధులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయని, అయితే అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి, ప్రపంచం ముందు పాక్ ను ఉగ్రవాద దేశంగా చిత్రించడం కోసమే మూడురోజుల పాటు ఆపరేషన్ నిర్వహించార‌ని పాక్ మీడియా పేర్కొంది. దాడి చేసిన వారు పాకిస్థాన్ నుంచి వచ్చినట్టుగా భారత్ నిరూపించలేకపోయిందని పాక్ సంయుక్త దర్యాప్తు బృందం అభిప్రాయపడినట్టు పత్రిక పేర్కొంది. మరి పాకిస్థాన్ మీడియా చేసిన ఈ వ్యాఖ్యలకు భారత్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

లోకేశ్ ను.. రాహుల్ లా కాదు కేటీఆర్ లా తీసుకురావాలి

  ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు. తండ్రి బాటలోనే తాను కూడా మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే లోకేశ్ గతంలో కంటే ఇప్పుడు కాస్త బెటరే అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా లోకేశ్ ను  ఏపీ కేబినెట్లోకి తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలతో చంద్రబాబు చర్చలు కూడా చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.జూన్ నెలలో ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో అప్పుడు లోకేశ్ ను కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.   ఇదిలా ఉండగా లోకేశ్ రాకపై టీడీపీ నేతలు బాబుకు కొన్ని సలహాలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ విషయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన తప్పిదాన్ని లోకేష్ విషయంలో జరగకుండా చూడాలని కొందరు పార్టీ సీనియర్లు సీఎం చంద్రబాబుకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఎందుంటే కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ అంతంగా పట్టించుకోలేదని.. అధికారపీఠానికి కాస్త దూరంగా ఉన్నారని.. అలా కాకుండా ముందే నుండే ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండి ఉంటే రాహుల్ రాజకీయ స్థాయి పెరిగి ఉండేదని.. ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు అధికార బాధ్యతలు చేపడితే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని అన్నారు. అంతేకాదు కేసీఆర్.. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా తన కొడుకు, కూతురు, మేనల్లుడిని ముందు నుండే ప్రభుత్వంతో మమేకం చేశారు.. ఇప్పడు వారికి జనాదారణ కూడా పెరిగింది..  అందుకనే రాహుల్ లా కాకుండా కేసీఆర్ లా ముందునుండే లోకేశ్ ను ప్రభుత్వలోకి తీసుకురావాలని సూచించారట. మరి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

వరుస ఆత్మహుతి దాడులు.. 34 మంది మృతి

  ఈమధ్య కాలంలో ఇరాక్ లో ఆత్మహుతి దాడులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఈ ఆత్మహుతి బాంబు దాడుల వలన అతలాకుతలమైపోతున్న ఇరాక్ లో మరోసారి సోమవారం వరుస ఆత్మాహుతి దాడులు చోటుచేసుకున్నాయి. షియా వర్గీయులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు జరుగాయి. ఈ దాడుల్లో  20 మంది మృతి చెందారు. మరో 60 మంది గాయపడ్డారు. మరోచోట ధీ ఖార్‌ ప్రావిన్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 14 మంది మృతి చెందగా, మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ వరుస దాడుల వలన మొత్తం 34 మంది మృతి చెందగా 87 మంది గాయాలపాలయ్యారు. ఇదిలా ఉండగా ఇరాక్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో జరిగిన దాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్టు గతంలోనూ ఐఎస్‌ ప్రకటించింది.

47 మంది పోలీసులకు జీవిత ఖైదు.. ఎక్కడ..?

సాధారణంగా హత్య చేసినప్పుడు కానీ..ఇంకా ఏదైనా నేరం చేసినప్పుడు కానీ నిందితులకు జీవిత ఖైదు విధిస్తారు. కానీ ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 47 మంది పోలీసులకు జీవిత ఖైదు పడింది. అదేంటీ పోలీసులకు జీవిత ఖైదు పడటం ఏంటీ అనుకుంటున్నారా.. నకిలీ ఎన్ కౌంటర్ చేసినందుకు గాను ఉత్తరప్రదేశ్ లోని 47 మంది పోలీసులకు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. వివరాల ప్రకారం..  జూలై 12, 1991న  సిక్కు యాత్రికుల బస్సును అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. యాత్రికుల్లో ఉగ్రవాదులు ఉన్నారంటూ 10 మందిని ఎన్ కౌంటర్ చేశారు. ఆ మరుసటి రోజు ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని చంపామంటూ ప్రకటించారు. అయితే ఎన్‌కౌంటర్‌పై తీవ్ర దుమారం రేగడంతో సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. టైస్టుల్ని చంపితే వచ్చే అవార్డులు, గుర్తింపు కోసమే  హత్యాకాండకు పోలీసులు పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. కాగా మొత్తం మొత్తం 57మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 10 మంది విచారణ మధ్యలోనే మరణించారు. 47 మందిపై విచారణ జరిపి వారికి జీవిత ఖైదు విధించారు.

శిల్పా పై భుమా ఫిర్యాదు.. అతని పద్ధతేం బాలేదు..

టీడీపీలో ఉన్న విభేధాలు అప్పుడప్పుడు ఏదో ఒక రకంగా బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవలే భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి మధ్య ఉన్న విభేధాలు బయటపడుతున్నాయి. మామూలుగానే వీరిద్దరి మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. మొన్నీ మధ్యనే శిల్పా మోహన్ ముఖ్య అనుచరుడుపై దాడి జరుగగా.. దానికి భూమా అనుచరులే కారణమంటూ శిల్పా మోహన్.. అతని అనుచరులు మండిపడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే భూమా నాగిరెడ్డి శిల్పామోహన్ పై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన హత్యాయత్నాలకు, తనకు సంబంధం లేదని.. కర్నూలు జిల్లాలో  శిల్పా మోహన్ రెడ్డి వైఖరి తమకు ఇబ్బందికరంగా మారిందని ఫిర్యాదు చేశారు. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి సైతం ఇప్పటికే భూమాపై చంద్రబాబు వద్ద ఫిర్యాదు చేశారు. తమను టీడీపీ నుంచి వెళ్లగొట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. మరి ముందు ముందు ఇంకెన్ని సమస్యలు తలెత్తుతాయో చూడాలి.

ప్రియాంక చోప్రాపై మేనేజర్ సంచలన వ్యాఖ్యలు.. కాళ్ల మీద పడితే వదిలేసానన్న తల్లి

  టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉదంతంతో ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త ఒకటి ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నసంగతి కూడా తెలిసిందే. అది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందంటూ మాజీ మేనేజర్ ప్రకాష్ జాజు సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. గతంలో రెండు మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని.. ప్రియాంక చూడటానికి చాలా స్టాంగ్ ఉమెన్ గా కనిపించవచ్చు. కానీ ఆమె మానసికంగా చాలా వీక్ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే దీనిపై ప్రియాంక చోప్రా తల్లి స్పందిస్తూ మేనేజర్ ప్రకాష్ జాజుపై మండిపడ్డారు. ట్వీట్టర్లో ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మేనేజర్‌గా ప్రకాష్ జాజు 2014 లో ప్రియాంక మేనేజర్ గా ఉండేవాడని.. తరువాత అతని కాంట్రాక్ట్ ముగిసిపోయిన తరువాత ప్రియాంక వేరే మేనేజర్ ను అపాయింట్ చేసుకుందని.. అతన్ని ఎందుకు కొనసాగించలేదో తెలియదని తెలిపింది. అప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని.. గతంలో కూడా ఇలానే చేసి జైలుకు వెళ్లాడని.. అప్పుడు వారి తల్లిదండ్రులు ప్రియాంక కాళ్ల మీద పడి ప్రాధేయపడటంతో వదిలేసామని చెప్పారు. ఇప్పుడు కూడా కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని అన్నారు. మరి దీనిపై ప్రియాంక ఎలా స్పందిస్తుందో చూడాలి.