క్షమాపణకు సిద్దమైన రోజా..

  ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముగిసింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యలు మాట్లాడుతూ.. రోజా ఇచ్చిన వివరణను నమోదు చేసుకున్నాం.. త్వరలో స్పీకర్ కు నివేదకి అందజేస్తామని తెలిపారు. ఇంకా రోజా.. అనితపై నేను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు.. అనిత మనసు గాయపడితే క్షమాపణలు చెప్పడానికి సిద్దమని చెప్పినట్టు తెలుస్తోంది.   కాగా టీడీపీ ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యో రోజా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన సంగతి తెలిసిందే. గతంలో రెండుసార్లు అవకాశం ఇచ్చినా కమిటీ ముందుకు రాని రోజాకు మరో అవకాశం ఇచ్చారు. అయితే గతంలో కమిటీకి హాజరుకాని రోజా.. హైకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన కారణంగా ఈసారి మాత్రం కమిటీకి హాజరయ్యారు.

బ్రతికుండగానే ప్రిన్సిపాల్ కు సమాధి కట్టిన విద్యార్ధులు..

కేరళలోని పలక్కాడ్ లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. బ్రతికుండగానే ఓ ప్రిన్సిపాల్ కు సమాధి కట్టారు. వివరాల్లోకి వెళితే.. పలక్కాడ్ లో గవర్నమెంట్ విక్టోరియా కాలేజీకి ప్రిన్సిపాల్ డాక్టర్ టిఎన్ సరసు గత మార్చి 31న ఈ కళాశాలకి వచ్చారు. అయితే ప్రిన్సిపాల్ గా ఆఖరి రోజు కావడంతో కళాశాలకు వచ్చిన ఆమెకు దిమ్మతిరిగే షాకిచ్చారు విద్యార్ధులు. అలా కాలేజీ ఆవరణలోకి అడుగుపెట్టిన ఆమెకు అక్కడ సమాధి ఒకటి కనిపించింది. ఇది ఎవరి సమాధి అని అక్కడి విద్యార్ధులను అడుగగా.. వారు మీదే అని చెప్పారు. దీంతో ఆ సమాధానం విన్న ఆమె నిర్ఘాంతపోయారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 'తరగతులను బహిష్కరించేందుకు, నిరసన తెలిపేందుకు ఎస్ ఎఫ్ఐ విద్యార్థులకు నేను అనుమతి ఇవ్వలేదు.. కాలేజీలు ఈవెంట్లు, నిరసనల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను, నిబంధనలను కచ్చితంగా అమలు చేశాను.. అందుకే దానికి ప్రతీకారంగా నాకు ఈ బహుమతి ఇచ్చారు అని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో విద్యార్ధులు మాత్రమే కాదు.. లెఫ్ట్ పార్టీలతో అనుబంధమున్న కొందరు టీచర్ల ప్రమేయం కూడా ఉంది' అని తెలిపారు. ప్రిన్సిపాల్ సరసు ఫిర్యాదు మేరకు పోలీసులు విద్యార్థులపై పరువు నష్టం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

లోకేష్ పోటీ చేసేది ఇక్క‌డి నుంచే..

  టీడీపీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మంత్రి ప‌ద‌విని చేప‌ట్టేందుకు అన్ని క‌లిసి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తిస్తున్న లోకేష్ ను ఎలాగైనా కేబినెట్ లోకి తీసుకోవాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించి మంత్రిని చేయాల‌ని నిర్ణ‌యించారు. ఎమ్మెల్సీని చేసి మంత్రి ప‌ద‌వి ఇస్తే లోకేష్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేడ‌ని ఇలా దొడ్డి దారిన మంత్రిని చేశారనే విమ‌ర్శలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని బాబు ఊహించారు.   ఒకే దెబ్బ‌కి రెండు పిట్ట‌ల‌న్న‌ట్లు రెండు ప్ర‌శ్న‌ల‌కు ఒకేసారి స‌మాధానం చెప్పాల‌ని డిసైడ్ అయిన టీడీపీ అధినేత త‌న‌యుడి కోసం నియోజ‌క‌వ‌ర్గాన్ని రెడీ చేసే ప‌నిలో ప‌డ్డారంట‌. కృష్ణా జిల్లా పెన‌మలూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోకేష్ తో పోటీ చేయించాల‌ని బాబు వ్యూహం వేశారని ప‌చ్చ కండువాలు గుస‌గుస‌లాడుతున్నాయి. పెన‌మ‌లూరు బెజ‌వాడ‌ను ఆనుకుని ఉంటుంది. అక్క‌డ చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గంతో పాటు టీడీపీ బ‌ల‌మైన బీసీలు ఎక్కువ‌గా ఉన్నారు. అదీ కాక ఆ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌.  స్థానిక ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ కూడా తాను లోకేష్ కోసం రాజీనామా చేస్తాన‌ని ఇంత‌కు ముందే ప్ర‌క‌టించారు. ఇన్ని అనుకూల‌త‌లు ఉండ‌బ‌ట్టే ఏపీ సీఎం పెనమ‌లూరుని ఎంపిక చేసిన‌ట్టున్నారు.

ద‌గ్గుబాటి సురేశ్ కి టీడీపీ టిక్కెట్

  రాజ్య‌స‌భ‌లో ఖాళీ అయిన స్థానాల‌కు గానూ వ‌చ్చే జూన్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దేశ వ్యాప్తంగా జ‌రిగే ఈ ఎన్నిక‌ల్లో తెలుగు రాష్ట్రాల‌న నుంచి మొత్తం 6 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 ఖాళీలున్నాయి. తెలంగాణ‌లో ఉన్న ఖాళీల‌ను టీఆర్ఎస్ ద‌క్కించుకోనుండగా..ఇక ఏపీలో ఉన్న స్థానాల‌ను మూడు టీడీపీ, ఒక‌టి వైసీపీకి ద‌క్క‌నున్నాయి. రాజ్య‌స‌భ టిక్కెట్లు కేటాయింపు తెలుగు దేశానికి క‌త్తిమీద సాముగా త‌యారైంది. చాలా మంది రాజ్య‌స‌భ టిక్కెట్లు ఆశిస్తున్నారు. అయితే వీట‌న్నింటిలోంచి  ఒక వార్త ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.   టాలీవుడ్ అగ్ర నిర్మాత‌, సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ద‌గ్గుబాటి సురేష్ ని టీడీపీ త‌ర‌పున పెద్దల స‌భ‌కు పంపిస్తార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ద‌గ్గుబాటి కుటుంబం తొలి నుంచి టీడీపీతో స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తోంది. రామానాయుడు బాప‌ట్ల నుంచి తెలుగు దేశం త‌ర‌పున లోక్ స‌భకు ఎంపిక‌య్యారు. సురేశ్ కి కూడా చంద్రబాబుతో సత్సంబంధాలున్నాయి. దానితో పాటు సినిమా   ఇండ‌స్ట్రీని కూడా త‌న వైపు తిప్పుకోవ‌డానికి సురేశ్ ను రాజ్య‌స‌భ‌కు పంపితేనే బెట‌ర‌నే ఆలోచ‌న‌లో ఉన్నారని టాక్. మ‌రి టీడీపీ అధినేత మైండ్ గేమ్ ఎలా ఉంటుందో.

రాహుల్ గురించి ప్రత్యూషకు తెలిసిన నిజం.. అదేనా..?

  ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు ఉన్న నేపథ్యంలో.. ఈ ఘటనకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంటుంది. ఇప్పటికే ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త అంశం వెలుగుచూసింది. ప్రత్యూష బెనర్జీ తల్లిదండ్రులు రాహుల్ సింగ్ పైన పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యూష ఆత్మహత్యకు కారణం ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. రాహుల్ ప్రత్యూషను మోసం చేశాడని.. తన ఆస్తిపాస్తుల గురించి ప్రత్యూషకు అబద్దం చెప్పాడని..  ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడని ఆరోపించారు. అంతేకాదు రాహుల్‌కు తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడని.. ఈ మధ్యే ప్రత్యూషకు అసలు నిజం తెలిసిందని.. తనకు జరిగిన మోసాన్ని తట్టుకోలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రాహుల్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.   మరోవైపు రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం రాహుల్ పరిస్థితి బాలేదని.. ప్రత్యూష నన్ను పిలుస్తోంది అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని అతని తండ్రి తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రాహుల్ పై ప్రత్యూష తల్లిదండ్రులు చేసిన ఆరోపణల నేపథ్యంలో అతను డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేసే అవకాశముందని అంటున్నారు. అంతేకాదు రాహుల్‌కు పదేళ్ల జైలు శిక్ష పడవచ్చునని చెబుతున్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్ లు బయటకొస్తాయో చూడాలి.

ఇండియాలో ఫేస్ బుక్కే కింగ్..

  సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ఫేస్ బుక్. ఇది ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరి వ్యక్తుల మధ్య అనుసంధానంగా నిలుస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ తో వస్తున్న ఫేస్ బుక్ అంటే అందరికీ మక్కువ ఎక్కువ. ప్రపంచంలోనే రెండో స్థానాన్ని సంపాదించుకున్న ఈ ఫేస్ బుక్ మన దేశంలో మాత్రం నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ ఐఎంఆర్బీ నిర్వ‌హించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. మన దేశంలో ఫేస్‌బుక్‌ను.. ట్విట్టర్, యూట్యూబ్ కంటే 2.4 రెట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారని ఈ అధ్యయనంలో పేర్కొంది. అంతేకాదు 70 శాతం మంది స్మార్ట్ ఫోన్ ద్వారానే ఫేస్ బుక్ ను వాడుతున్నారని తెలిపింది. ఇక ఫేస్ బుక్ తర్వాత స్దానాన్ని మాత్రం వాట్సప్ ఆక్రమించింది.

జయలలితకు పోటీగా హిజ్రా..

  త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నసంగతి తెలిసిందే. ఇప్పటినుండే పార్టీలన్నీ ఎన్నికల బరిలో విజయం పొందడానికి వారి వారి ప్రయత్నాల్లో సమాయత్తమవుతున్నాయి. మరోవైపు పార్టీల్లోకి వచ్చే వాళ్లు వస్తున్నారు.. మారే వాళ్లు మారుతున్నారు. అంతేకాదు ఇప్పటివరకూ గ్లామర్ ఫీల్డ్ కు సంబధించిన వారిని పార్టీల్లోకి తీసుకోవడంపై ఎక్కువ దృష్టిసారించిన నేతలు.. ఇప్పుడు హిజ్రాలకి కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు ప్రజలు అమ్మగా భావించి.. రాజకీయరంగంలో చక్రం తిప్పుతున్న జయలలితపైనే పోటీ చేయడానికి సిద్దపడుతున్నారు. జయలలిత తమిళనాడులోని ఆర్కే నగర్ నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే నియోజక వర్గం నుండి దేవి అనే హిజ్రా కూడా పోటికి సిద్దమైంది. సినీ దర్శకుడు సీమన్ పెట్టిన పార్టీ తరుపున ఆమె జయలలితకు పోటీ ఇవ్వబోతోంది. మరి జయలలితను అధిగమించి ఆమె గెలుస్తుందో లేదో తెలియాలంటే ఎన్నికలు వరకూ ఆగాల్సిందే.

చైన్ స్నాచింగ్.. పసికందు మృతి.. ట్విస్ట్ తల్లే చంపిందా..?

  హైదరాబాద్ నగరం నేరేడ్ మెట్ లో చైన్ స్నాచర్లు ఓ మహిళపై దాడి చేయడం.. ఈ దాడిలో 25 రోజుల పసికందు చనిపోవడం తెలిసిందే. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకొచ్చింది. ఆ పసికందును తల్లే చంపేసింది అన్న ఆరోపణలు వస్తున్నాయి. వివరాల ప్రకారం.. నేరెడ్ మెట్ లో పూర్ణిమ అనే యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా ఆమెపై  చైన్ స్నాచర్లు దాడి చేశారు. ఈ పెనుగులాటలో ఆమె ఒడిలో ఉన్న 25 రోజుల పసికందు కిందపడి మరణించింది. అయితే పోలీసుల మాత్రం తల్లే ఈ హత్య చేసిందని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది.  పసికందు తల్లి పూర్ణిమ చెప్పిన దానిపై పోలీసులు అనుమానించి ఆమె ఇంటిని తనిఖీ చేయగా రక్తపు మరకలున్న దుస్తులు కనిపించాయి. దీంతో దంపతులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కుటుంబసభ్యులు మాత్రం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అబద్దం చెబుతున్నారని, తన కోడలు బయటకు వెళ్లినప్పుడు బంగారపు పుస్తెల తాడు ఉందని, ఆమె ఇంటికి వచ్చేసరికి లేదని తన మనవడు అంటే తమకూ ప్రేమేనని, కానీ తమ కోడలి పైన అభాండాలు వేయవద్దని అంటున్నారు. మరి ఏది నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..

వాట్స్ యాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్..

వాట్స్ యాప్ యూజర్స్ కి ఓ గుడ్ న్యూస్. ఇక నుండి వాట్స్ యాప్ పూర్తి సురక్షితమైందని.. ఆండ్రాయిడ్, ఐఫోన్, బ్లాక్ బెర్రీ ప్లాట్ ఫాంలపై వాట్స్ యాప్ ను పూర్తి ఎన్ క్రిప్ట్ చేశామని, ఇక ఎవరు ఏం మెసేజ్ లు పంపుకున్నా మరొకరికి తెలిసే అవకాశాలు లేవని వాట్స్ యాప్ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ వెల్లడించారు. ఇంకా జాన్ కౌమ్.. సైబర్ క్రిమినల్స్, హ్యాకర్లకు మీ మెసేజ్ లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక కనిపించవు. మేము కూడా తెలుసుకోలేమని వెల్లడించారు. అంత పటిష్ఠమైన భద్రతా వలయాల మధ్య నుంచి సమాచారం బట్వాడా అవుతుంది" అన్నారు. కాగా దేశంలో ఇప్పటికే 100 కోట్లమందికి పైగా వాట్స్ యాప్ ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.

పదిమందిని బహిష్కరించిన విజయకాంత్.. కారణం ఆయన సతీమణా..?

  తమిళనాడు రాజకీయ పార్టీల్లో రోజుకో సరికొత్త అంశం చోటుచేసుకుంటుంది. అందునా డిఎండికె పార్టీలో రోజుకో ఆసక్తికరమైన అంశం తెరకెక్కుతోంది. డిఎండికె అధ్యక్షుడు అధినేత విజయ్ కాంత్ తాను ఒంటరిగానే పోటీ చేస్తానని ముందు చెప్పినా.. ఆ తరువాత పిడబ్ల్యూఎఫ్‌తో పొత్తు పెట్టుకున్నారు. కానీ పార్టీ నేతలు మాత్రం ముందునుండి డీఎంకేతో పొత్తు పెట్టకోవాలని విజయకాంత్ కు చెప్పారంట. విజయకాంత్ మాత్రం వారి మాటలను తోసిపుచ్చి ప్రజా సంక్షేమ కూటమితో పొత్తు పెట్టుకున్నారు. దీన్ని ఏమాత్రం సహించలేని పార్టీ నేతలు ఆయనను ప్రశ్నించారు. ఇందుకుగాను విజయకాంత్ అలా ప్రశ్నించిన ముగ్గురు ఎమ్మెల్యేలు సహా పదిమందిని పార్టీ నుంచి బహిష్కరించినట్టు ప్రకటించారు. దీంతో డిఎండికె పార్టీలో మరోసారి ముసలం ఏర్పడింది. మరోవైపు విజయ్‌కాంత్‌ నిర్ణయానికి ప్రధాన కారణం ఆయన సతీమణి ప్రేమలత, ఆమె తమ్ముడు సుదీష్‌లేనని ఆరోపించారు.

కేసీఆర్ శ్రీవారికి చేయించిన ఆభరణాలు ఇవే

  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే తిరుమల శ్రీవారు, విజయవాడ కనకదుర్గమ్మ, వరంగల్ భద్రకాళీ, కురివి వీరభద్రస్వామికి బంగారు అభరణాలను చేయిస్తానని మొక్కుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల తర్వాత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. అనుకున్నట్లుగానే దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తానని దానికి నిధులు కూడా విడుదల చేశారు.   సాంస్కృతిక శాఖ సలహాదారుడు కేవీ రమణాచార్యులను ఆభరణాల కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు. ఆభరణాల తయారీ టెండర్లను తమిళనాడులని కొయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ కాలిదాస్ జ్యువెలర్స్ దక్కించుకుంది. దీనిలో తొలి విడతగా తిరుమల వెంకన్న ఆభరణాలైన శాలిగ్రామ హారం, మకరకంఠ సిద్ధమయ్యాయి. 20 కిలోల బరువుతో సుమారు 5 కోట్లు వెచ్చించి వీటిని తయారు చేశారు. ఈ నెలాఖరున సీఎం కేసీఆర్ తిరుమలకి వెళ్లి మొక్కు చెల్లించనున్నారు.

మొన్నే సీఎంగా ప్రమాణ స్వీకారం.. అప్పుడే మెహబూబా ముఫ్తీకి షాక్

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో మెహబూబా ముఫ్తీకి అప్పుడే షాక్ తగిలింది. బీజేపీ మద్దతుదారుడిగా కొనసాగుతున్న సజ్జద్ ఘనీ లోన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మెహబూబా మప్తీ ఘనీకి సాంఘిక సంక్షేమ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఘనీ మాత్రం తనకు వైద్య, ఆరోగ్య శాఖ వస్తుందని ఆశించారు. దీంతో తనకు కేటాయించిన శాఖకు అసంతృప్తి చెందిన ఘనీ వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఆ లేఖను మెహబూబాకు పంపడానికి బదులుగా బీజేపీ హై కమాండ్ కు పంపారు. మరోవైపు అటు బీజేపీ, ఇటు పీడీపీ ఘనీని బుజ్జగించేదుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ విషయంలో ఘనీ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ మెహబూబాతో ఈ విషయంపై మాట్లాడితే కాని సర్దుబాటు జరిగేలా లేదని రాజకీయ పెద్దలు చర్చించుకుంటున్నారు.

ఆవు ప్రాణమా.. మొసలి ప్రాణమా.. తేల్చనున్న కోర్టు..

  ఆవు ప్రాణమా.. మొసలి ప్రాణమా అంటే.. ఈ రెండింటిలో ఎవరైనా ఆవు ప్రాణమా అనే చెప్తారు. కానీ ఈ రెండింటిలో ఏ ప్రాణం ముఖ్యమో అన్న విషయం ఓ కోర్టు ఇచ్చే తీర్పును బట్టి తెలియనుంది. ఇంతకీ అసలు సంగతేంటంటే.. అమెరికా కోర్టులో ఓ విచిత్రమైన కేసు ఒకటి వచ్చింది. మొసలి ప్రాణం గొప్పదా? లేక ఆవుల ప్రాణాలు గొప్పవా? అన్న ఆసక్తికరమైన కేసు కోర్టు ముందుకు వచ్చింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒకిచోబి అనే ఏరియాలో ఒక రైతుకు బోలెడన్ని ఆవులు ఉండేవి. అయితే కాల క్రమేణా ఆవుల సంఖ్య తగ్గుకుంటూ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన ఆయన నిఘా వేసి చూడగా ఒక మొసలి ఆవులను తింటుందని గమనించాడు. ఇక ఆ మొసలిని చంపి దానిని ప్రొక్లయినర్ సాయంతో వేలాడదీసి.. ఫొటో తీసి మరీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు చూసిన జంతు సంరక్షకులు ఆరైతుపై కేసు పెట్టగా  ప్రస్తుతం ఫ్లోరిడా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వన్యప్రాణిని చంపడం తప్పా? కాదా? అన్నది కోర్టు తేల్చనుంది. మరి కోర్టు ఏ రకమైన తీర్పునిస్తుందో చూడాలి.

వైసీపీ నుండి మరో వికెట్ డౌన్.. ఎమ్మెల్యే సునీల్ టీడీపీలోకి..

వైసీపీ పార్టీనుండి ఎమ్మెల్యేలు ఒకరి తరువాత ఒకరు టీడీపీలోకి వలసలు కట్టారు. ఇప్పటికే తుమ్మల రాజకీయంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి చేరుతుంటే.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే సునీల్ టీడీపీ లోకి జంప్ అవనున్నారు. అయితే సునీల్ టీడీపీ చేరిక వెనుక హస్తం మాత్రం మంత్రి నారాయణదే అని రాజకీయ పెద్దలు చర్చించుకుంటున్నారు. సునీల్‌ను విజయవాడలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయానికి నారాయణ వెంట తీసుకుని వచ్చారు. చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆయన తెదేపా కండువా కప్పుకున్నారు. కాగా మరి కొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది.

ఈసారైనా రోజా సారీ చెబుతుందా..?

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మరో ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే అనిత రోజాపై ఫిర్యాదు చేయడంతో రోజాను కమిటీ ముందు హాజరు కావాలని ఇప్పటికీ చాలాసార్లే కమిటీ ఆదేశించింది. అయితే రోజా మాత్రం ఇంతవరకూ కమిటీ ముందు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ముందు రోజా వ్యవహారశైలిపై మండిపడ్డ కమిటీ..ఆ తరువాత మరోసారి రోజాకు కమిటీ ముందు హాజరయ్యే అవకాశం ఇచ్చింది. దీనిలో భాగంగానే ఈరోజు రోజా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకానున్న అనిత విషయంలో తన వాదనలు వినిపిస్తారు. ఇదిలా ఉండగా రోజా మాత్రం అనితపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేందుకు సిద్దంగా లేరు. మరోవైపు రోజా క్షమాపణ చెప్తే ఆమె పట్ల ప్రివిలేజ్ కమిటీ కాస్తంత సానుకూలంగా స్పందించే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

టీఆర్ఎస్ లోకి పొంగులేటి.. తుమ్మల నడిపిన రాజకీయం..!

వైసీపీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పొంగులేటి చేరిక వెనుక మాత్రం తుమ్మల నాగేశ్వరరావు హస్తం ఉందని అంటున్నారు రాజకీయ పెద్దలు. మంత్రి తుమ్మల నడిపిన రాజకీయ ఫలితమే తెలంగాణాలో వైసీపీకి ఉన్న ఏకైక ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పాయం వెంకటేశ్వర్లు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమయినట్టు సమాచారం. మరోవైపు ఏపీ నుండి మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

నాకేం తెలియదు అంటున్న అమితాబ్..

పనామా పేపర్స్ నల్ల కుబేరుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో 500 మంది భారతీయుల పేర్లు ఉన్న సంగతి.. అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ పేర్లు కూడా ఉన్న సంగతి విదితమే. అయితే దీనిపై ఐశ్వర్యరాయ్ స్పందించి.. అది అంతా అబద్దమే అని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది. ఇప్పుడు దీనిపై మామ అమితాబ్ కూడా స్పందించి.. విదేశాల్లో నాకు కంపెనీ ఉందని.. దానికి నేను డైరక్టర్ అని వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు.. నాకు ఎలాంటి కంపెనీ లేదు.. నేను దేనికీ డైరక్టర్ ను కాదు అని చెప్పారు. మరి ఎవరిది ఎంత నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.