తెరాస, వైకాపాలది సెల్ఫ్‌గోలేనా?
posted on Jan 21, 2015 9:29AM
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఈరోజు నుండి వారం రోజుల పాటు నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్ర చేసేందుకు బయలుదేరారు. ఆమె జిల్లాలో ఏడు నియోజక వర్గాలలో నివసిస్తున్న 30 కుటుంబాలను పరామర్శిస్తారు. ఇదివరకు కూడా ఆమె మెహబూబ్ నగర్ జిల్లాలో పరామర్శ యాత్రలు చేసారు. ఆమె తన యాత్రలకు రాజకీయ ఉద్దేశ్యాలు లేవని చెపుతుంటారు. కానీ తెలంగాణా ప్రభుత్వం ఏ మాత్రం నొచ్చుకోకుండా సుతిమెత్తగా విమర్శలు చేస్తుంటారు. అయినప్పటికీ ఆమె విమర్శలకు, చేస్తున్న యాత్రలపై తెరాస పార్టీ నేతలెవరూ స్పందించరు. కానీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నెల వరంగల్లో పర్యటిస్తారని తెలియగానే మంత్రి మహేందర్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించడం గమనార్హం. తెలంగాణకు నీళ్ళు రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబుని అడ్డుకొంటామని ఆయన హెచ్చరించారు. అంటే వైకాపా వల్ల తెరాసకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ తెదేపాతో మాత్రం అభ్యంతరాలున్నాయని స్పష్టం అవుతోంది.
తెరాస, వైకాపాల మధ్య ఉన్న ఈ రహస్య ప్రేమ, అవగాహన దేనికంటే తెలంగాణాలో స్థిరపడిన లక్షలాది ఆంద్ర ప్రజల ఓట్లను తెరాస ఎట్టిపరిస్థితుల్లో పొందే అవకాశం లేదు. కనుక, ఆ అవకాశం ఉన్న వైకాపాను తెరాస ప్రోత్సహిస్తోందనుకోవచ్చును. ఆ విధంగా తమ ఉమ్మడి శత్రువు అయిన తెదేపాను తెలంగాణాలో బలపడకుండా నిలువరించడానికేనని భావించవచ్చును. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే వచ్చిన ఎన్నికల సమయంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొనే సాహసం చేయలేకపోయాయి. కానీ తెలంగాణాలో తెరాస ఘన విజయం సాధించి పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు వైకాపా ముందుకు రావడం, ఇప్పుడు మళ్ళీ పరామర్శ యాత్రల పేరిట వైకాపా తెలంగాణాలో పునః ప్రవేశించడం గమనిస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొనేందుకే ప్రయత్నాలు మొదలు పెట్టాయేమోననే అనుమానాలు కలుగకమానదు.
అయినా కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్, సమైక్య ఉద్యమాలు చేసి అటు తెలంగాణా, ఇటు ఆంద్ర ప్రజలకు కూడా హ్యాండ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ కలిపినా తమ రాజకీయ ప్రయోజనాలకు నష్టం జరుగుతున్నట్లు ఏమాత్రం అనుమానం కలిగినా ఒకరి హ్యాండ్ మరొకరు నలిపివేయడానికి ఏ మాత్రం వెనుకాడరని చెప్పవచ్చును.
తెలంగాణాలో ప్రజల తరపున పోరాడతామని పదేపదే చెపుతున్న షర్మిల, తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఏవిధంగా, ఎవరితో పోరాడాలనుకొంటుందో కూడా వివరిస్తే బాగుండేది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో అడుగుపెట్టేందుకు కూడా సాహసించలేనప్పుడు, మరి తెలంగాణాలో కూడా జగనన్న రాజ్యం స్థాపిస్తాడని షర్మిల ఏవిధంగా ప్రజలకు చెప్పగలుగుతున్నారో వివరిస్తే బాగుండేది. అంటే ప్రస్తుతానికి అవసరార్ధం తెరాసతో సఖ్యతగా మెలుగుతున్నప్పటికీ మున్ముందు దానికి కూడా తమ పార్టీ హ్యాండ్ ఇస్తుందని దాని భావమేమో వైకాపాయే చెప్పాలి.
రాజకీయ నేతలయినా, పార్టీలయినా స్మార్ట్ గా ఉంటే మంచిదే. కానీ ఓవర్ స్మార్ట్ గా ఉంటే నష్టపోతాయని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీయే ఒక సజీవ ఉదాహరణగా మన కళ్ళెదుట నిలిచి ఉంది. కానీ అది పట్టించుకోకుండా తెరాస, వైకాపాలు ఓవర్ స్మార్ట్ గా వ్యవహరిస్తున్నట్లు కనబడుతున్నాయి. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెలంగాణాలో దుఖాణం తెరిచేందుకు ప్రయత్నిస్తుంటే కేసీఆర్ ఉపేక్షించడం వలన తెరాసపై ప్రజలలో అనుమానాలు కలగడం సహజం. అదేవిధంగా నిత్యం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంతో యుద్ధం చేస్తున్న తెలంగాణా ప్రభుత్వాన్ని, దాని ముఖ్యమంత్రి కేసీఆర్ ని వెనకేసుకు వస్తునందుకు ఆ పార్టీకి ఆంద్ర ప్రజలు దూరంకావడం తధ్యం.
భిన్న దృవాల వంటి ఆ రెండు పార్టీలు, ఒకే రకమయిన అహంభావం కలిగిన వాటి అధినేతలు తమ ఉమ్మడి శత్రువు అయిన తెదేపాను నిలువరించడానికే చేతులు కలుపుతారో లేదా అనే విషయం పక్కనబెడితే, వారు అనుసరిస్తున్న ఈ రహస్య వ్యూహం బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చును.