కేసుల భయమా! స్నేహ హస్తమా! ఒకే బాటలో వైసీపీ, టీడీపీ
posted on Sep 16, 2020 9:26AM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఒకే దారిలో పయనిస్తున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు ఓటేశారు వైసీపీ, టీడీపీ ఎంపీలు. రాష్ట్రంలో బద్ద శత్రువులుగా ఉన్న పార్టీలు ఢిల్లీలో ఒకేబాటలో పయనించడం చర్చనీయాశంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ కూటమికి మద్దతిచ్చామని వైసీపీ చెబుతోంది. టీడీపీ కూడా అదే వాదన వినిపిస్తోంది. అయితే రాజ్యసభ ఎన్నికల పరిణామాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో స్నేహానికి వైసీపీ, టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని రెండు పార్టీలు చెబుతున్నా.. కేసుల భయంతోనే బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం లేదనే చర్చ కూడా జరుగుతోంది.
ఏపీ సీఎం జగన్ పై సీబీఐ, ఈడీ కేసులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. గతంలో ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరైన ఆయన ప్రస్తుతం మినహాయింపులో ఉన్నారు. సీఎం హోదాలో కూడా ఓసారి కోర్టుకు హాజరయ్యారు జగన్. కేసులు ఇంకా పూర్తి కానందున కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉండటమే బెటరన్న అభిప్రాయంలో వైసీపీ ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా వెళితే పరిణామాలు మారవచ్చని.. కేసుల విచారణలో స్పీడ్ పెరగవచ్చనే భయం జగన్ పార్టీ నేతల్లో ఉంది. అందుకే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లులతో పాటు అన్ని అంశాల్లోనూ బీజేపీకే మద్దతిస్తున్నారు వైసీపీ ఎంపీలు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లోనూ అలాగే చేశారు. బీజేపీకి మద్దతుగా ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం కూడా ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబుది సేమ్ అలాంటి ఇబ్బందే. అమరావతి ఇన్ సైడ్ ట్రేడింగ్ తో పాటు ఫైబర్ నెట్ పనులపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరే యోచనలో ఉంది వైసీపీ. వీటిపై ఇప్పటికే రాష్ట్రంలో ఏసీబీ విచారణ జరుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు చంద్రబాబు. ప్రధాని మోడీతో పాటు బీజేపీ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కూటమిలో చేరి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించి బీజేపీ వ్యతిరేక ప్రచారం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల తర్వాత ఫలితాలు తారుమారు కావడం, ఏపీలోనూ టీడీపీకి పరాజయం దక్కడంతో చంద్రబాబు మౌనంగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు బీజేపీ పెద్దలు. ఈ నేపథ్యంలో అమరావతి, ఫైబర్ నెట్ పనులపై జగన్ సర్కార్ సీబీఐ దర్యాప్తు కోరితే తనకు ఇబ్బంది కలగొచ్చనే ఆందోళనలో బాబు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే కొంత కాలంగా ఆయన బీజేపీతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఇటీవల ఎలాంటి ప్రకటనలు చేయలేదు చంద్రబాబు. కరోనా కట్టడిలో మోడీ సర్కార్ బాగా పని చేస్తుందని చెప్పారు. బీజేపీతో మంచి సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు... రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలను ఉపయోగించుకున్నట్లు చెబుతున్నారు, ఎన్డీఏకు సపోర్ట్ చేయడం వల్ల బీజేపీకి దగ్గర కావచ్చన్నది బాబు అంచనాగా భావిస్తున్నారు .
మరోవైపు వైసీపీ, టీడీపీ తీరుపై ఏపీలోని మిగితా పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయకుండా.. వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల భయంతోనే బీజేపీకి జై కొడుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ, టీడీపీ మద్దతు ఇవ్వడంపై ఢిల్లీలోనూ చర్చలు జరుగుతున్నాయి.