Read more!

ప్రపంచాన్ని అబ్బుర పరిచిన జపాన్ సాకర్ ప్లేయర్స్, అభిమానుల స్వచ్ఛ సేవ

ప్రపంచం మొత్తం ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ తో ఊగిపోతోంది. తమ అభిమాన జట్ల విజయాన్ని అభిమానులు సంబరాలతో వేడుకలు చేసుకుంటున్నాయి. కిక్కిరిసిన స్టేడియంలలో కూడా ఈ విజయోత్సాహాలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. అయితే వీటికి భిన్నంగా విజయం సాధించిన తరువాత జపాన్ ఆటగాళ్లు, ఆ జట్టు అభిమానులూ వేడుక జరుపుకున్న తీరుకు ప్రపంచం మొత్తంఫిదా అయిపోయింది.  

నెటిజన్లు  జపాన్ ఆటగాళ్లనూ, ఆ జట్టు అభిమానులనూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం జర్మనీ, జపాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో జపాన్ విజయం సాధించింది. వెంటనే స్టేడియంలో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటుతాయని అంతా భావించారు. కానీ జపాన్ ఫ్యాన్స్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో, ప్రపంచం మొత్తం మెచ్చుకునేలా సంబరాలు జరుపుకున్నారు.   జ‌ర్మ‌నీపై జ‌పాన్ విజ‌యం సాధించిన త‌రువాత ఆ జ‌ట్టు అభిమానులు స్టేడియంలోని గ్యాల‌రీలలో చెత్త‌ను శుభ్రం చేశారు.

మ్యాచ్ చూసే స‌మ‌యంలో ఆహార‌ ప‌దార్థాల‌ను తినిప‌డేయ‌డం, కూల్ డ్రింక్స్ బాటిల్స్‌, ఇత‌ర వ‌స్తువుల ప్యాకెట్లు స్టేడియంలో పడేయడం తెలిసిందే. వీటిని తొల‌గించేందుకు స్టేడియం సిబ్బంది ప్రేక్షకులంతా స్టేడియంను ఖాళీ చేసేసిన తరువాత శ్రమిస్తారు. వారికి ఆ శ్రమ ఎందుకు అనుకున్నారో ఏమో జపాన్ ఫుట్ బాల్ జట్టు అభిమానులు తమ జట్టు విజయం సాధించిన సందర్భాన్ని ఇలా స్టేడియంలో స్వచ్ఛ సేవ చేయడం ద్వారా జరుపుకున్నారు.

స్టేడియంలో ప్రేక్షకులు చెల్లా చెదురుగా పాడేసిన వస్తువులన్నిటినీ సంచులన నింపి ఒక చోటుకి చేర్చారు. తమ అభిమానులతో జపాన్ ఫుట్ బాల్ జట్టు సభ్యులు కూడా చేతులు కలిపారు. జ‌ర్మ‌నీపై  విజ‌యం త‌రువాత జపాన్ ఆటగాళ్లు   డ్రెసింగ్ రూంలో  ఎంజాయ్ చేయ‌డం మానుకొని మరీ స్వచ్ఛ సేవలో పాల్గొన్నారు. ఇదంతా ప్రపంచాన్ని అబ్బుర పరిచింది. జపాన్ ఫుట్ బాల్ జట్టు ఆటగాళ్లు, అభిమానుల స్వచ్ఛ సేవ సెలబ్రేషన్స్ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  వారి స్వచ్ఛ దీక్షకు ప్రపంచం నీరాజనాలర్పిస్తోంది.