ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్ పైనా అనుమానాలేనా?
posted on Sep 16, 2015 @ 1:43PM
భారతదేశంలో వ్యాపారానికి అనువయిన రాష్ట్రాలలో గుజరాత్ ప్రధమ స్థానంలో దాని తరువాత ఆంద్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. దేశంలో గుజరాత్ తరువాత రెండవ ధనిక రాష్ట్రమని చెప్పుకొంటున్న తెలంగాణాకి ఈ విషయంలో 13వ స్థానంలో ఉన్నట్లు ప్రకటించడంపై తెరాస ప్రభుత్వ మంత్రులు, నేతలు షాక్ అయ్యారు. దానిపై తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “ప్రపంచ బ్యాంక్ ఏ ప్రాతిపదికన తమ రాష్ట్రానికి 13వ స్థానం కేటాయించిందో తెలియదు కానీ తమ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలే గీటురాయిగా నిలుస్తాయని” ఆ రాష్ట్ర ఐటి మంత్రి కె.తారక రామారావు అన్నారు.
ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇష్టపడని కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రపంచ బ్యాంక్ పై ఒత్తిడి చేసి ఈ విధంగా ప్రకటింపజేసి ఉండవచ్చని తెరాస ఎంపీ నర్సయ్య గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేసారు. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు దేశ విదేశాల నుండి భారీ పెట్టుబడులు ఆకర్షిస్తూ శరవేగంగా ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్నప్పటికీ వాటిని పక్కనపెట్టి ఝార్ఖండ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలే వ్యాపారానికి అనువుగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ చేత ర్యాంకులు ఇప్పించుకొందని అయన వాదిస్తున్నారు.
ఆంద్రప్రదేశ్ కి రెండవ స్థానం దక్కడాన్ని ఆయనతో సహా చాలా మంది తెరాస నేతలు పైకి మెచ్చుకొంటున్నట్లు మాట్లాడుతున్నప్పటికీ, వారి వాదనలు వింటుంటే ఆంద్రప్రదేశ్ కి రెండవ ర్యాంక్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారనే విషయం స్పష్టం అవుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంక్ తెలంగాణాకి 3 లేదా 4వ స్థానం ఇచ్చి, ఆంద్రప్రదేశ్ కి ఏ ఐదో,ఆరో స్థానం ఇచ్చి ఉండి ఉంటే వారు కూడా ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకుల గురించి గొప్పగా చెప్పుకొని ఉండేవారు. కానీ అన్ని విధాల చితికిపోయున్న ఏపీకి రెండవ స్థానం ఇచ్చి, తెలంగాణాకు 13వ స్థానం ఇవ్వడం వలననే వారు ఈ ర్యాంకులను అంగీకరించడం లేదని చెప్పవచ్చును.
ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థల ప్రమేయం ఉన్న ఏ అంశంపైనైనా సానుకూల నిర్ణయం తీసుకొన్నట్లయితే, అవి వాటికి అమ్ముడుపోయాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంటాయి. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ కి తొత్తులుగా మారిపోయి అవి ఆడించినట్లు ఆడుతున్నాయనే ఆరోపణలు తరచూ వింటూనే ఉంటాము. అటువంటప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి ఎంత ర్యాంక్ ఇవ్వాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ కి ఏవిధంగా నిర్దేశించగలవు? ఒకవేళ తెరాస నేతలు ఆరోపిస్తున్నట్లు భారత్ ప్రపంచ బ్యాంక్ ని నిర్దేశించే పరిస్థితిలో ఉండి ఉంటే దేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేప్పట్టేందుకు రుణాల కోసం ప్రపంచ బ్యాంక్ ని ప్రాధేయపడవలసిన అవసరమే ఉండేది కాదు.
సాధారణంగా ఏ రాష్ట్రానికయినా ఇటువంటి ర్యాంకులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ విద్యుత్, నీటి సౌకర్యం, భూమి ఉపలబ్దత, రవాణా వ్యవస్థలు, మానవ వనరులు, సహజ వనరులు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొంటుంది. అదే విధంగా రాష్ట్ర ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొని ఉన్న సంబంధాలు, రాష్ట్రాలపై వాటి ప్రభావం, సదరు రాష్ట్రంతో ప్రపంచ దేశాల ఏవిధంగా వ్యవహరిస్తున్నాయి? వంటి అనేక ఇతర అంశాలను కూడా పరిశీలించి ర్యాంకింగ్ ఇస్తుంటుంది. దేశంలో గుజరాత్ తరువాత తెలంగాణా ధనిక రాష్ట్రం అయ్యి ఉండవచ్చును. కానీ నేటికీ విద్యుత్, సాగునీరు, త్రాగు నీరు వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాల కృషి చేస్తున్న మాట వాస్తవం. కానీ అవి ఇంకా పరిష్కరింపబడవలసి ఉంది.
ఇక తెలంగాణా-కేంద్రప్రభుత్వాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాటిని మెరుగుపరుచుకొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ గట్టిగా ప్రయత్నాలు చేయలేదు అనే కంటే అసలు వాటికి ఆయన ఎన్నడూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పవచ్చును. కేంద్రంపట్ల ఆయన ఎన్నడూ నిలకడగా ఒకే విధానం అవలంభించలేదు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించేందుకు విదేశాలలో పర్యటిస్తున్నప్పుడు, ఆయన తెదేపా-బీజేపీల మధ్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బలమయిన అనుబంధం గురించి నొక్కి చెప్పడం మరిచిపోరు. ఆంద్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే కేంద్రప్రభుత్వం కూడా అన్ని విధాల పూర్తి సహకారం అందిస్తుందని ఆయన కేంద్రప్రభుత్వం తరపున పూర్తి భరోసా ఇస్తుంటారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అటువంటి భరోసా ఇవ్వలేరు. కారణం కేంద్రప్రభుత్వంతో అనిశ్చిత సంబందాలు నెలకొని ఉండటమే.
ఇక ఉద్యమ సమయంలో తెరాస నేతలు రాష్ట్రంలో సినీ, వ్యాపార, పారిశ్రామిక తదితర రంగాలకు కల్పించిన తీవ్ర అభద్రతా భావం నేటికీ వారిలో యధాతధంగా నెలకొనే ఉంది. వారిలో నెలకొని ఉన్న ఆ అభద్రతా భావాన్ని దూరం చేసేందుకు తెరాస ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఆ అభద్రతా భావం కారణంగానే హైదరాబాద్ లో స్థిరపడిన సినీ ప్రముఖులు నేటికీ తరచూ ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూ ఆయనని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతలా పరిపాలిస్తున్నారని ప్రతిపక్షాలు తరచూ ఆరోపించడం అందరూ ఎరిగిన విషయమే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చివరికి మీడియా కూడా రాష్ట్రంలో మనుగడ సాధించలేదని నిరూపితమయింది. రాష్ర్టంలో ఇటువంటి అభద్రతా భావం నెలకొని ఉన్నప్పుడు అక్కడ వ్యాపారానికి అనుకూలమయిన పరిస్థితులు ఉండవని ఎవరయినా చెప్పగలరు. అదే ముక్క ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పినట్లు భావించవచ్చును.