ఆంద్రప్రదేశ్ వ్యాపారానికి అత్యంత అనుకూలమయిన రాష్ట్రం: ప్రపంచ బ్యాంక్
posted on Sep 14, 2015 @ 11:09PM
గుజరాత్ తరువాత తెలంగాణా దేశంలో రెండవ ధనిక రాష్ట్రమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. గుజరాత్ తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోకెల్లా వ్యాపారానికి అత్యంత అనువయిన రాష్ట్రమని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ఈ విషయంలో తెలంగాణా 13వ స్థానంలో ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతవరకు గుజరాత్ తరువాత మహారాష్ట్ర చాలా విషయాలలో రెండవ స్థానంలో నిలిచేది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు చెరో అంశంలో మహారాష్ట్ర స్థానాన్ని ఆక్రమించాయి. బీహార్ రాష్ట్రం నుండి విడివడిన జార్ఖండ్ కూడా మహారాష్ట్రాని అధిగమించి మూడవ స్థానంలో ఉండటం మరో విశేషం.పెట్టుబడుల విషయంలో అరుణాచల్ ప్రదేశ్ అన్నిటి కంటే చివరి స్థానంలో నిలిచింది.
తెలంగాణాకి అన్ని విధాలా అభివృద్ధి చెందిన హైదరాబాద్ దక్కినందున అది దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా నిలవడంలో ఆశ్చర్యం లేదు. కానీ రాష్ట్ర విభజన తరువాత అన్ని విధాలా ఘోరంగా దెబ్బతిని, కనీసం రాజధాని కూడా లేని పరిస్థితుల్లో ఉన్న ఆంద్రప్రదేశ్ పెట్టుబడులకు వ్యాపారానికి అత్యంత అనువయిన రాష్ట్రంగా స్థానం సంపాదించడం విశేషమే. ఈ ఖ్యాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే చెందుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే మంచి కార్యదక్షుడు, అనుభవజ్ఞుడు కలిగిన ఆయన మాత్రమే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలరని నమ్మకంతోనే ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. రాష్ట్ర విభజన తరువాత ఎదురవుతున్న సమస్యలను ఆయన ధీటుగా ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రజలలో, పారిశ్రామిక వ్యాపారవేత్తలలో భవిష్యత్ పట్ల మంచి నమ్మకం కలిగించగలిగారు. అందుకు తగినట్లుగానే నేటికీ అందరూ ఆయన రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్ది మళ్ళీ వేగంగా అభివృద్ధి సాధిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర భవిష్యత్ పట్ల ప్రభుత్వానికి, ప్రజలకు, పెట్టుబడిదారులకు అందరికీ బలమయిన నమ్మకం కలిగి ఉండటం, ముఖ్యంగా ప్రజలకు ప్రభుత్వంపై అచంచలమయిన నమ్మకం కలిగి ఉండటం ఏ రాష్ట్రానికయినా, ప్రభుత్వానికయినా ఖచ్చితంగా చాలా సానుకూల అంశమే.
రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులని, జరిగిన తరువాత పరిస్థితులని, ప్రస్తుత పరిస్థితులని ఒకసారి బేరీజు వేసుకొని చూసినట్లయితే రాష్ట్రంలో చాలా సానుకూలమయిన పరిస్థితులు, మార్పులు కనబడుతున్నాయి. అందుకే ప్రపంచ బ్యాంక్ రాష్ట్రానికి రెండవ స్థానం ఇచ్చిందని భావించాల్సి ఉంటుంది. రాజధాని నిర్మాణం, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, మెట్రో రైల్ ప్రాజెక్టులు వంటి భారీ నిర్మాణ కార్యక్రమాలలో విదేశీ సహాయసహకారాలు తీసుకోవాలనుకోవడం కూడా ఇందుకు ఒక కారణమయి ఉండవచ్చును.
తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు కానప్పటికీ ఆంద్రప్రదేశ్ వ్యాపారానికి చాలా అనువయినదని ప్రపంచ బ్యాంక్ స్వయంగా ప్రకటించడం వలన దేశ విదేశీ సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావచ్చును. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధతకి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన కాంప్లిమెంటుగా భావించవచ్చును. అదేవిధంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీనిని ఒక వరంగా కూడా భావించవచ్చును. బహుశః ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ విదేశీ సంస్థలకు ఇదే విషయం నొక్కి చెప్పి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చును.