Read more!

సిగ్గుండాలి.. సంబరాలకు!

కింద పడ్డా పై చేయి మాదే అనడంలో వైసీపీ నేతలు సిద్ధహస్తులు. ఇందు కోసం వారు కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెప్పడానికి కూడా ఇసుమంతైనా వెనుకాడరు.  అమరావతి పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో వైసీపీ నేతల వ్యాఖ్యలు, ప్రకటనలు, సంబరాల తీరు చూస్తుంటే.. నేడో రేపో విశాఖ కు రాజధానిని తరలించేసుకునేందుకు సుప్రీం కోర్టు తీర్పు అనుమతిచ్చేసిందన్న స్థాయిలో వైసీపీ  శ్రేణులు హంగామా చేస్తున్నాయి. వాస్తవానికి సుప్రీం కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి శరాఘాతమే. రాష్ట్ర ప్రభుత్వం ఏది కోరుకుందో దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఔను హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.  

అయితే అది రాజధాని విషయంలో శాసనాధికారం చేసే హక్కు లేదన్న దానిపై కాదు. నిర్దుష్ట కాలపరిమితిలో అమరావతి రైతులకు ప్లాట్లు అభివృద్ది చేసి అప్పగించాలన్నదానిపై స్టే ఇచ్చింది. అలాగే నిర్దుష్ట కాలపరిమితిలో అమరావతి అభివృద్ధి చేయాలన్న అంశంపై మాత్రమే సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్ లో హైకోర్టు తీర్పు మేరకు అమరావతి అభివృద్ధి ఆరు నెలలలో సాధ్యం కాదు.. కొంత సమయం ఇవ్వాలని కోరినందునే. అదే సుప్రీం కోర్టు తీర్పు ప్రభుత్వ విధానాలకు, మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు వచ్చేసిందన్నంతగా వైసీపీ చేస్తున్న హడావుడి చూస్తుంటే.. వారు కోర్టు తీర్పును అర్ధం చేసుకున్నారా అన్న అనుమానం కలగక మానదు. సుప్రీం కోర్టు సోమవారం పేర్కొన్న మేరకు అమరావతే రాజధాని అన్న విషయంపై స్టే ఇవ్వలేదు.

కేంద్రం సహా అన్ని పక్షాల వాదనలూ విన్న తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా చెప్పింది. దానికే ఇప్పుడు వైసీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారు. సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అయితే సుప్రీం తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని మీడియా సమావేశంలో చెప్పడమే కాకుండా.. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో వేలు పెట్టడానికి ఇతర వ్యవస్థలకు అధికారమే లేదంటూ తన పాండిత్యాన్ని ప్రదర్శించారు. సుప్రీం కోర్టు తీర్పుకు వక్రభాష్యం చెప్పడంలో మంత్రి గుర్నాథ్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి మూడు రాజధానులకు సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పిచ్చేసిందనీ, వచ్చే ఏప్రిల్ నుంచి జగన్ పాలన విశాఖ నుంచే ఉంటుందనీ ప్రకటించేశారు.

సోమవారం (నవంబర్ 28) సుప్రీం కోర్టు తీర్పు మేరకు సందేహాలకు అతీతంగా ఇప్పటికి అయితే అమరావతే రాజధాని.. అన్ని పక్షాల వాదనలూ విన్న తరువాత సుప్రీం కోర్టు తన తుది తీర్పు ఇచ్చే వరకూ అమరావతే రాజధాని. అక్కడ నుంచి కార్యాలయాలు కాదు కదా చిన్న ఇటుకనైనా తరలించడానికి వీల్లేదు. సుప్రీం తీర్పు సారాంశం ఇది అయితే వైసీపీ మాత్రం ఆ తీర్పును తమకు అనుకూలంగా భాష్యం చెప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ విజయమే అమరావతి రాజధాని అన్న గత ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల మద్దతు లేదనడానికి నిదర్శనమని చెబుతున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన విషయమేమిటంటే 2019 ఎన్నికలు అమరావతిపై రిఫరెండం ఎంత మాత్రం కాదు. ఎన్నికలకు ముందు ప్రచార సభల్లోనూ, అంతకు ముందు తన పాదయాత్రలోనూ, అసెంబ్లీలోనూ కూడా  అప్పటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ అమరావతే రాజధాని అని విస్పష్టంగా చెప్పారు.

అమరావతికి అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు ఇచ్చారు. కనుక ఇప్పుడు సజ్జల చెబుతున్నట్లు ప్రజా మద్దతు అమరావతికి ఉందో లేదో అన్నదే లిట్మస్ టెస్ట్ అంటే జగన్ తక్షణమే ప్రజా తీర్పు కోరాలి. అంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి. అందుకు భిన్నంగా మూడురాజధానుల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది కోర్టు ధిక్కారమే అవుతుంది.    సీఆర్డీయేతో అమరాతి కోసం భూములిచ్చిన రైతులు  చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ దశలో ప్రభుత్వం వెనక్కు వెళ్లడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించ కూడదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.  రాజధానిపై చట్టం చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదనడంతోపాటు  పలు  కీలకాంశాలతో హైకోర్టు ఇచ్చిన తీర్పులో... నిర్దుష్ట గడవులకు సంబంధించిన  అంశాలపై స్టే ఇస్తూ మాత్రమే సుప్రీం కోర్టు సోమవారం(నవంబర్ 28)ఆదేశాలు జారీ చేసింది.

అంతే తప్ప మరే అంశంలోనూ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వలేదు. అంతే కాకుండా మూడు రాజధానుల అంశాన్ని ఏపీ సర్కార్ ఉపసంహరించుకుందనీ, ఇక అది ముగిసిన అంశమేననీ ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్  హైకోర్టు ముగిసిన అంశంపై తీర్పు ఎలా ఇస్తుందనీ ప్రశ్నించారు. అంటే ప్రభుత్వమే మూడు రాజధానుల అంశం ముగిసిందని పేర్కొన్నట్లైంది. అలాగే హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని కూడా ఏజీ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ దశలో సుప్రీం కోర్టు ఏయే అంశాలపై స్టే కోరుతున్నారని ప్రశ్నించగా మాజీ ఏజీ గడువులకు సంబంధించిన అంశాలపైనే స్టే కోరుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ప్రభుత్వం కోరిన గడువు అంశాలపైనే సుప్రీం తీర్పు ఇచ్చింది.