Read more!

కౌన్ బనేగా ఏపీ ‘సీఎస్’ ఆఖరిక్షణంలో కొత్త ట్విస్ట్

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్‌శర్మ పదవీ కాలం  నవంబర్ 30తో ముగుస్తుంది. ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపధ్యంలో  డిసెంబరు 1వ తేదీ బాధ్యతలు చేపట్టే కొత్త సీఎస్ ఎవరు? అనే విషయంలో, ఇటు రాజకీయ వర్గాల్లో, అటు అధికార వర్గాల్లోనూ గత కొంత కాలంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. నిజానికి,  కొన్ని పేర్లు వినిపించినా ముందునుంచి సీనియర్ ఐఎఎస్ జవహర్‌రెడ్డి రేస్ లో ముందున్నారు. ఆయన నియామకం ఇంచుమించుగా ఖరారు అయిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే, ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని, అందరూ భావిస్తున్న సమయంలో,కొత్తగా మరో పేరు తెర మీదకు వచ్చింది. 

అయితే ముందు నుంచి జవహర్ రెడ్డి వైపే మొగ్గుచూపిన ముఖ్యమంత్రి ఆఖరి క్షణంలో  పునరాలోచన చేయడం వెనక ఉన్న కారణం ఏమిటనే విషయంలో  భిన్న అభిప్రాయలు వ్యక్త మవుతున్నాయి. అయితే, ముఖ్యమంత్రి మనసు మార్చుకోవడం వెనక ఇంకా ఇతర కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ  ప్రధానంగా, జవహర్ ‘రెడ్డి’ పేరే కారణం అంటున్నారు. ప్రభుత్వంలో రెడ్డి వాసన తగ్గించేందుకు ముఖ్యమంత్రి సమీర్ ‘రెడ్డి’ నియామకం విషయంలో పునరాలోచన చేస్తున్నారని అంటున్నారు. పార్టీ పదవుల విషయంలోనూ ముఖ్యమంత్రి కొంత మేరకు రెడ్డి ట్యాగ్ ప్రాధాన్యత తగ్గించి, బీసీలకు పార్టీ పదవుల్లో కొంచెం ఎత్తు పీట వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  

అదలా ఉంటే, సీఎస్ రేసులో కొత్తగా కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమణే పేరు వినిపిస్తోంది. 1988 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అరమణే  ఆంధ్ర ప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్రం రక్షణశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన్ను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. మరోవంక, గిరిధర్‌ అరమణే   శనివారం(నవంబర్26)  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో భేటీ అయ్యారు. కొత్త సీఎస్‌ నియామకంపై కసరత్తు జరుగుతున్న సమయంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.   

ఆంధ్రప్రదేశ్ కేడర్‌ కు చెందిన ఐఎఎస్ అధికారుల సీనియార్టీ  జాబితాలో గిరిధర్‌ అరమణే రెండో స్థానంలో ఉన్నారు. గిరిధర్ అరమణే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడితే 2023 జూన్‌ 30 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయబోతున్నారు. డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త సీఎస్ బాధ్యతలు చేపట్టాల్సిఉంటుంది. సో.. కొత్త సీఎస్‌ నియామకంపై నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

నిజానికి, ముఖ్యమంత్రి ఫస్ట్ ఛాయస్ ‘రెడ్డి’ అందులో సందేహం లేదు. అందుకే, ముందు నుంచి, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రెటరీగా ఉన్న జవహర్‌రెడ్డి పేరు మాత్రమే ప్రముఖంగా వినిపించింది. అయితే  వచ్చేది ఎన్నికల సంవత్సరం  కాబట్టి ఆ దిశగానే నియామకం ఉంటుందని అంటున్నారు. అయితే అదే సమయంలో అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఖచ్చితంగా ‘కౌన్ బనేగా సీఎస్’ సస్పెన్స్ కొనసాగుతుందనీ అంటున్నారు. అయినా, మరి కొద్ది గంటల్లోనే అధికారిక ప్రకటన వెలువడనున్న నేపధ్యంలో తినబోతూ రుచులెందుకు అంటూ ఐఎఎస్ అధికారులు గుంభనంగా ఉంటున్నారు. కొస మెరుపుగా, రెడ్డి ఛాయస్ కు అడ్డు పడింది ఎవరు? అనే చర్చ కూడా అధికార, రాజకీయ వర్గాల్లో వినవస్తోంది.

ఇంతకాలం  ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పూర్తి స్వేఛ్చ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఆయనకు ముకుతాడు బిగించేందుకు, గిరిధర్‌ అరమణేను రాష్ట్రానికి పంపుతోందా  అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే  కేంద్రం కావాలనే గిరిధర్‌ అరమణే పేరును తెర మీదకు తెచ్చిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైనా, సీఎస్ ఎవరైనా, అన్ని విధాలా పట్టాలు తప్పిన ఏపీ సర్కార్ ను మళ్ళీ పట్టాల మీదకు తీసుకురావడం, అయ్యే పని కాదనే, ఐఎఎస్ లు అంటున్నారు. అవును ఐఎఎస్ లే కాదు, సామాన్య  ప్రజలు కూడా రాష్ట్రానికి మళ్ళీ  మంచి రోజులు రావాలంటే, మళ్ళీ చంద్రబాబు రావాలని అంటున్నారు.