Read more!

మనిషికి స్పష్టత ఎలా చేకూరుతుంది?

మనందరిలోను ఒక ప్రవృత్తి వుంది అదేంటంటే…. అన్నిటితోనూ సర్దుకుపోవడం అని. దాన్నే అలవాటుపడిపోవడం అంటారు.  పరిస్థితులను నిందిస్తూ కాలం గడపడం, పరిస్థితులు వేరుగా వున్నట్లయితే, నేనూ మరో విధంగానే రూపొందేవాడిని అనో, నాకో అవకాశం ఇవ్వండి, యేం చేస్తానో చూడండి అనో, అందరూ కలిసి నాకు అన్యాయం చేశారు అనో, ఇలా ఒకటి అని కాదు బోలెడు రకాల మన ఇబ్బందులను ఇతరులకు, పరిస్థితులకు, మన చుట్టూ ఉండే వాతావరణానికి, ఆర్థిక ఒత్తిడులకు ఇలా ఏదో ఒకదానికి అంటగట్టడానికి ప్రయత్నిస్తాము.

ఈ చికాకులకు అలవాటు పడిపోయాడంటే వ్యక్తి మనసు బద్ధకంగా తయారయిపోయిందన్నమాట. మన చుట్టూ వున్న సౌందర్యానికి అలవాటు పడిపోయి దాని అస్తిత్వాన్నే గమనించకుండా వుండిపోతాము గదా! అలవాటు పడిపోకపోతే, దాన్నుంచి పరుగులు తీద్దామనుకుంటాము, ఏ మందో మాకో తీసుకుని, రాజకీయ ముఠాలలో చేరి, అరుస్తూ, వ్రాసుకుంటూ, ఆటలకు వెడుతూ గుడి గోపురానికో దర్శనానికి నడుస్తూ పారిపోదామనుకుంటాం. ఏదో మరో రకం వినోదం కల్పించుకుంటూ వాస్తవ విషయాల నుంచి ఎందుకని పరుగెత్తుకుపోదాం అనుకుంటాం? 

మనకు మృత్యువు అంటే భయం. ఇది అందరికీ తెలిసిన విషయమే…. ఎవరూ మృత్యువుని ప్రేమించరు. దీనికోసం ఎన్నో రకాల సిద్ధాంతాలు, ఆశలు, విశ్వాసాలు కనిపెడతారు.  మృత్యువుకు ముసుగు వేయటానికి, అయినా వాస్తవం అలా ఇంకా నిలిచే వుంది. వాస్తవాన్ని అవగాహన చేసుకోవాలంటే మనం దానివంక చూడగలగాలి, దాని నుంచి పారిపోవడం మార్గం కాదు. 

మనలో చాలమందికి బ్రతకాలన్నా భయమే, మృత్యువన్నా భయమే. మనకు కుటుంబం అంటే భయం, పదిమంది మాట అంటే భయం, ఉద్యోగం పోతుందేమోనని భయం, మన భద్రత  గురించి భయం, ఇంకా ఇలాంటివే వందలాది విషయాలను గురించి భయం. అసలు వాస్తవం ఏమిటంటే  మనకు భయం, దీన్ని చూసి దాన్ని చూసి కాదు.  వాస్తవాన్ని చూడలేక కలుగుతున్న భయం అది. మనం ఎందుకని ముఖాముఖి ఆ వాస్తవాన్ని చూడలేకపోతున్నాం??  వాస్తవాన్ని సందర్శించడం అనేది వర్తమానంలోనే సాధ్యం. కానీ  ఎప్పుడూ పారిపోవడానికి ప్రయత్నిస్తూ దాన్ని ముందుకు రానివ్వడమే లేదు. పలాయన ప్రక్రియకు అనుగుణంగా మనమొక చక్కని వల తయారు చేసుకున్నాం కాబట్టి ఈ అలవాటులోనే చిక్కుబడి పోతున్నాం.

మనుషులు అందరూ సునిశితులు, తీవ్రంగా ఆలోచించేవాళ్ళు అయితే, వారి నిబద్ధత వారికి తెలిసి రావడమే కాకుండా, అది తీసుకువచ్చే తదుపరి ప్రమాదాలు కూడా గమనించగలుగుతారు. అది ఎంత క్రౌర్యం, హింస, దుస్సహసస్థితి తీసుకు వస్తుందో తెలుసుకోగలుగుతారు. మీ నిబద్ధతలో వున్న ఈ ప్రమాదాలనన్నిటినీ గమనించినప్పుడు, పని చేయటానికి ఎందుకు పూనుకోరు?  సోమరిపోతులు కాబట్టినా ?

సోమరితనం ఎలా కలుగుతుంది?? 

తగినంత శక్తి - జీవసత్వం లేకపోవడం వల్ల కలుగుతుంది. మీ కళ్లకు ఎదురుగా ఏదో పామో, మంటో, గుంటో వుంటే ఆ స్థూల ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అవసరమయ్యే శక్తి మీకు తక్షణమే వాటిని చూసిన వెంటనే సమకూరుతుంది కదా! మరి కొన్ని జీవితకాల విషయాల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు. మాటమాత్రంగానే చూసినందువల్ల  మాటకు, ఆచరణకు వైరుధ్యం వస్తుంది. ఆ వైరుధ్యం శక్తి సంపదనంతా కొల్లగొట్టుకుపోతుంది. నిబద్ధతతో స్పష్టంగా చూసి దానిపల్ల వచ్చే ప్రమాదాలను తక్షణమే గమనించగలిగితే అప్పుడే మీరు కార్యాసక్తులవుతారు. కాబట్టి చూడడమే కార్యాచరణ. 

మనలో చాలమందిమి జీవితాన్ని అశ్రద్ధగా తీసుకుంటాము. మనం పెరిగిన వాతావరణానికి అనుగుణంగా స్పందనలు, ప్రతిస్పందనలు చేస్తూ వుంటాము. ఇవన్నీ మరింత కట్టుబాటును, బంధనాన్ని తీసుకువస్తాయి. అలా వచ్చినప్పుడే మనిషికి తనమీద తనకు ఒక స్పష్టత చేకూరుతుంది.

                                       ◆నిశ్శబ్ద.