జగన్ పై నడ్డా విమర్శల మతలబేంటి?
posted on Sep 16, 2025 @ 9:47AM
జగన్ హయాంలో పాలనపై జేపీ నడ్డా కీలకమైన కామెంట్లు చేశారు. జగన్ అసమర్ధ, అస్తవ్యస్త పాలన ద్వారా ఏపీ అభివృద్ధి మొత్తం పడకేసిందని.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి గాడిలో పడుతున్నాయని నడ్డా అన్నారు. నడ్డా మాటలు అక్షర సత్యాలే అయినా.. ఇంత కాలం లేనిది ఇప్పుడీ విమర్శలేంటన్న సంశయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ జగన్ మీద ఈగ వాలనివ్వని బీజేపీ సడెన్ గా ఇలా రివర్స్ అవ్వడమేంటి? జగన్ పై వ్యతిరేక కామెంట్లు చేయడమేంటి? అన్న ఆశ్చర్యం, విస్మయం పరిశీలకుల్లోనే కాకుండా.. సామాన్య జనంలో కూడా వ్యక్తం అవుతోంది. దానికి తోడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అడిగీ అడక్క ముందే.. బీజేపీకి మద్దతు ప్రకటించచేసి ఎన్డీయే అభ్యర్థికి ఓటేసిన జగన్ పార్టీ.. ఇటు చెల్లి నుంచి ఢిల్లీ గల్లీ గల్లీ వరకూ విమర్శల పాలయ్యింది. ఆర్ఎస్ఎస్ భావజాలానికి చెందిన ఒక వ్యక్తికి వైయస్ఆర్ కొడుకు ఇలా ఓటు వేయడమేంటని.. ఆయన సోదరి షర్మిళ అయితే కడిగిపాడేశారు.
ఇక వైఎస్ అతేవాసి, జగన్ కు బిహైండ్ ది కర్టెన్ మెంటార్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే.. ఇక్కడ ఎన్డీయే కి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన జగన్ తాము కాంగ్రెస్ వ్యతిరేకులం అంటూ ఎన్డీయే అభ్యర్ధికి ఓటు వేయడమేంటని ప్రశ్నించారు. కొంతలో కొంత.. బీఆర్ఎస్సే నయం.. కాస్త సంయమనం పాటించి ఓటింగ్ లోనే పాల్గొనలేదు. జగన్ మరీ ఇంత దిగజారుడుతనమా? అన్న టాకొచ్చింది.
అలా తమ అభ్యర్ధికి ఓటు వేసిన పార్టీ అని కూడా చూడకుండా.. జేపీ నడ్డా ఇలా అనేశారేంటన్న చర్చ సాగుతోంది. ఈ మధ్య ఒక కొత్త ఈక్వేషన్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ అంటే దేశంలో భారతీయ జనతా పార్టీ అయితే అయి ఉండొచ్చేమోగానీ, ఏపీలో మాత్రం ఇందుకు భిన్నం. బీ అంటే- బాబు జే అంటే- జగన్, పీ అంటే- పవన్ అంటూ కామెంట్ చేశారు మాజీ ఐఏఎస్ విజయ కుమార్. దానికి తోడు బీజేపీకి వైసీపీకి చీకటి ఒప్పందాలు ఏవో ఉండబట్టే.. ఆయనింకా జైలుకు వెళ్లకుండా బయట ఉండగలు గుతున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ. మద్యం కుంభకోణంలో కూడా జాతీయ దర్యాప్తు సంస్థలేవీ కనీసం ముట్టుకోలేదీ కేసును. దీన్నిబట్టీ చూస్తే బీజేపీ జగన్ మధ్య అవినీతి సంబంధం స్టిల్ అలైవ్ అంటున్నారు విశ్లేషకులు.
ఇలాంటి కామెంట్లకు కాస్త ఫుల్ స్టాప్ పెట్టడానికో ఏమో.. జేపీ నడ్డా జగన్ పై ఇలాంటి కామెంట్లు చేశారన్న మాట వినిపిస్తోంది. జగన్ ఎప్పుడైతే జైలుకు వెళ్తారో అప్పుడు తప్ప బీజేపీని నమ్మడానికి వీల్లేదన్న కామెంట్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే.. తెలంగాణ ఎన్నికల్లో కవితను అరెస్టు చేయకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న అర్ధం వస్తుందని ఏకంగా.. ఆ పార్టీ ఎంపీ కొండా అనడం అప్పట్లో సంచలనం. తాజాగా ఏపీలో కూడా సరిగ్గా ఇలాంటి మాటే వినిపిస్తోంది. జగన్ బయట ఉన్నంత వరకూ వీరెన్ని మాటలు మాట్లాడినా అది జనం దృష్టి మరల్చే ఎత్తుగడ తప్ప మరొకటి కాదంటున్నారు చాలా మంది.