చిన్న దేశాల్లోనే .. చిచ్చుకు కారణమేంటి?
posted on Sep 12, 2025 @ 10:31AM
చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం అని మనకు మనం చాలా ఎక్కువ ఫీలవుతుంటాం. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మాయమైందో ఈ చిన్న కుటుంబాలకు భారీ సపోర్టింగ్ వచ్చింది. దానికి తోడు కుటుంబ నియంత్రణపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో.. ఆ చిన్న కుటుంబాలు మరింత చిరు కుటుంబాలుగా మారిపోయాయి. ఈ కుటుంబ వ్యవస్థ గురించి ఉపోద్ఘాతం ఎందుకంటే.. చిన్న దేశాల విషయంలో తరచూ ఏవో ఒక వివాదం. ఒకప్పుడు మయన్మార్, ఆపై శ్రీలంక, బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్. ఇక పాకిస్థాన్ సంగతి సరే సరి. అది నిత్య అగ్ని గుండమే. మయన్మార్ అయితే ఆంగ్ సాన్ సూకీ ని జైల్లో బంధించడం.. ఆర్మీ మొత్తం దేశాన్ని శాసించే యత్నం చేయడం. ఇది కొన్ని తరాలుగా జరుగుతూ వస్తోన్న ఒకానొక ఆర్మీ డామినేటింగ్ హిస్టరీ. ఆ దేశం ఎంత చిన్నదైతే.. అక్కడ ప్రజాస్వామిక పాలన అంతగా పడకేయాల్సిందే. సైన్యం అంతగా ప్రతాపం చూపాల్సిందే. మీరు కావాలంటే చూడండీ పాకిస్థాన్ లో సైన్యం ఎప్పుడెప్పుడు దేశ పరిపాలన ఆక్రమిద్దామా? అని చూస్తుంటుంది. ఇప్పటికి ఎన్నోసార్లు అలా జరిగింది కూడా. ప్రస్తుతం కూడా అక్కడ సైన్యాధ్యక్షుడిదే హవా. అన్ని విదేశీ అధికారిక కార్యక్రమాలకు ఆర్మీ చీఫ్ మునీరే హాజరవుతుంటారు.
ఇక బంగ్లాదేశ్ సంగతి సరేసరి. ఇటీవల అక్కడ సరిగ్గా నేపాల్ లాంటి ఉద్యమం రావడం.. ఒక ఆర్ధిక వేత్త తిరిగి తాత్కాలికంగా అధికారం చేజిక్కించుకోవడం సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికలు నిర్వహించడం అనే విషయం మీద సైన్యం వర్సెస్ ప్రభుత్వం గొడవ చెలరేగింది. దీంతో తిరిగి నిరసన ప్రదర్శనలు మిన్నంటాయి. సరిగ్గా నేపాల్ కి మల్లే బంగ్లాదేశ్ లోనూ సాదాసీదాగానే మొదలైంది మూమెంట్. విద్యార్ధులే కీలక పాత్ర పోషించారు. జెన్ జెడ్ అనే ఒక మూముంట్ స్టార్ట్ అయ్యింది. దీంతో సోషల్ మీడియానునిషేధించింది నేపాలీ ప్రభుత్వం. అంతే అగ్గి రాజుకుంది. అది దేశ పార్లమెంటు, ప్రధాని, అధ్యక్ష, మంత్రుల కార్యాలయ నివాస ప్రాంతాలన్నిటినీ తగలబెట్టేసింది.
నేపాలీ యువత రాజేసిన ఈ నిరసన జ్వాలకు ప్రస్తుత ప్రభుత్వం నిలువునా కుప్పకూలింది. ఇక్కడా సైన్యం కమాండింగే. మీరు అర్జెంటుగా పీఠం దిగండని ప్రధాని ఓలీకి సైన్యం సూచించడంతో.. ఆయన రాజీనామా చేసి దిగిపోయారు.
ఈ హింసాత్మక నిరసనల పుణ్యమాని ఒక మంత్రి భార్య మరణించారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. చిన్నదేశం అనగానే.. ఏ మాత్రం తేడా వచ్చినా సైన్యం దేశాన్ని తన అదుపాజ్ఞల్లోకి తీసుకుంటుంది. దీంతో ప్రజాస్వామ్యం కాస్తా పక్కకు తప్పుకోవల్సి వస్తుంది. మరి చూడాలి.. నేపాల్లో సాధారణ పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందో తేలాల్సి ఉంది. చిన్న దేశాలు బాగానే ఉంటాయిగానీ అది ఏదో ఒక అసంతృప్తి రగులుకునే వరకే. ఆపై వాటి లో భారీ ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. అది మొత్తం దేశాన్ని తగలబెడుతుందని అంటారు. ఈ మొత్తం వ్యవహార క్రమంలో ప్రధానంగా కనిపించేది సైన్యం పాత్ర.