పెళ్లి తర్వాత భాగస్వామితో ప్రేమ, స్నేహం ఎంతవరకు సాధ్యం?
posted on Aug 28, 2025 @ 9:30AM
నేటికాలంలో పెళ్ళి ఫిక్స్ అయిందంటే చాలు.. అమ్మాయి అబ్బాయి ఫోన్ నంబర్లు మార్చుకుని ఎంచక్కా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ వివాహం అయితే చెప్పక్కర్లేదు. అయితే పెళ్లికి ముందు ఉండే స్నేహం, ప్రేమ అనేవి పెళ్లి తర్వాత కూడా ఉంటాయా అంటే.. చాలామంది అవి లేవనే సమాధానం చెబుతారు. అంటే.. పెళ్లికి ముందు ఉండే ప్రేమ, స్నేహం వంటివి పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఉండటం లేదు. ఎందుకని? వివాహం తర్వాత కూడా ప్రేమ అలాగే ఉంటుందని అనుకుంటారు. కానీ స్నేహానికి స్థలం తగ్గకూడదు. నిజం ఏమిటంటే.. వివాహంలో, స్నేహం, ప్రేమ రెండూ ఉంటే బంధం మరింత బలపడుతుంది.కానీ ఇవి రెండూ ఉండగలవా? పెళ్లి తర్వాత ప్రేమ, స్నేహం రెండూ భార్యాభర్తల మధ్య ఉండగలవా? భార్యాభర్తల బంధంలో ప్రేమ, స్నేహం రెండూ ఉంటే ఏం జరుగుతుంది?
స్నేహం.. సంబంధానికి పునాది..
ఏ సంబంధానికైనా స్నేహం బలమైన పునాది. భార్యాభర్తలు ఒకరితో ఒకరు స్నేహితులుగా ఉంటే వారి మధ్య బంధం ఓపెన్ గా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. స్నేహం వల్ల ఎక్కువ అవగాహన, సాన్నిహిత్యం ఉంటుంది. కాబట్టి చిన్న విషయాలకు తగాదాలు తక్కువగా ఉంటాయి.
ప్రేమకు స్నేహమే సపోర్ట్..
వివాహం తర్వాత ప్రేమ అంటే భార్యాభర్తలు సరదాగా ఉండటం కాదు.. జీవితంలోని బాధ్యతలు, కష్టాల గుండా కూడా ప్రయాణం చేయడం. అటువంటి పరిస్థితిలో ఆ ప్రేమను సజీవంగా ఉంచేది ప్రేమ మాత్రమే. కష్ట సమయాల్లో మద్దతు ఇచ్చేవాడు మంచి స్నేహితుడు. ఈ లక్షణాలు వైవాహిక జీవితంలో కూడా ఉపయోగపడతాయి.
స్నేహం, ప్రేమ బ్యాలెన్సింగ్..
చాలా సార్లు భార్యాభర్తలు తమ జీవితంలో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో అయోమయంలో పడుతుంటారు. పరిస్థితి మొత్తం చెయ్యి దాటాక.. అయ్యో.. ఈ సందర్బంలో ఫ్రెండ్ గా మాట్లాడి ఉంటే బాగుండు.. ఫలానా సందర్భంలో ఒక లవర్ లాగా ప్రేమను ఎక్ప్స్రెస్ చేసి ఉంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. అయితే పరిస్థితి ఎలాంటిది అయినా కనీసం స్నేహం, ప్రేమ.. ఏదో ఒకటి ప్రెజెంట్ చేస్తూ ఉంటే అది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. క్రమంగా ఈ స్నేహం, ప్రేమ కూడా బ్యాలెన్సింగ్ గా ఉంటాయి.
అపార్థాలు..
భార్యాభర్తలు కేవలం భార్యాభర్తల్లా కాకుండా పైన చెప్పుకున్నట్టు స్నేహం, ప్రేమను ప్రెజెంట్ చేస్తుంటే.. భార్యాభర్తల మధ్య అపార్థాలు అనే మాటకు అసలు తావే ఉండదు. ఒకవేళ అపార్థాలు వచ్చినా వాటిని ఎలా పరిష్కరించుకోవాలో వారికి ఇట్టే అర్థం అవుతుంది. వివాహం తర్వాత ప్రేమ, స్నేహం ఉండే జంటలు సమప్రయాణాన్ని చాలా సంతోషంగా చేయగలుగుతారు.
*రూపశ్రీ.