వ్యాపం కుంభకోణంలో సీబీఐ ముందడుగు
posted on Jul 16, 2015 @ 8:43PM
దేశంలో కలకలం సృష్టిస్తున్న వ్యాపం కుంభకోణంపై దర్యాఫు చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ, దర్యాప్తు మొదలుపెట్టిన మూడవ రోజే దీనితో సంబంధం ఉందని అనుమానిస్తున్న 8మందిపై రెండు కేసులు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తుకి సీబీఐ ఏకంగా 40మంది అధికారులను కేటాయించింది. వారందరూ 3రోజుల క్రితమే డిల్లీ నుండి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చేరుకోగానే తమ దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కుంభకోణంపై దర్యాప్తుకి ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులతో వారు మాట్లాడి ఈ కుంభకోణంపై వారు చేసిన దర్యాప్తు గురించి వివరాలు సేకరించారు. అదేవిధంగా వారి నుండి ఈ కుంభకోణానికి సంబంధించిన అనేక కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకొన్నారు. 2010-11లో జరిగిన ప్రీ-పోస్ట్ గ్రాడ్యుయేట్ల మెడికల్ ప్రవేశ పరీక్షలలో 21మంది అభ్యర్ధుల దగ్గర నుండి లంచాలు తీసుకొన్నట్లు అనుమానిస్తున్న మొత్తం 8మందిపై సీబీఐ అధికారులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసారు. త్వరలోనే రాష్ట్రంలో గ్వాలియర్, ఇండోర్ తదితర పట్టణాలకు కూడా వెళ్లి తమ దర్యాప్తుని ముమ్మరం చేస్తారని సమాచారం.
ఇంతకు ముందు ఈ కుంభకోణంపై దర్యాప్తు చేసిన సిట్ అధికారులు దీనిలో రాష్ట్ర గవర్నర్ రాం నరేష్ యాదవ్ కూడా నిందితుడేనని కనుక ఆయనని ప్రశ్నించేందుకు అనుమతించమని హైకోర్టుని కోరారు. కానీ ఆయన రాష్ట్ర గవర్నర్ గా తనకున్న రాజ్యాంగ రక్షణని వాడుకొంటూ మినహాయింపు పొందారు. మరో ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న గవర్నర్ కుమారుడు శైలేష్ యాదవ్ కూడా అనుమాన స్పద స్థితిలో మరణించడం. ఇదంతా చూస్తుంటే ఈ కుంభకోణంలో ఎంత పెద్ద స్థాయిలో జరుగుతోందో అర్ధమవుతుంది.
ఒకవైపు సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తుండగానే, ఇంతవరకు ఈ కుంభకోణాన్ని దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఈ కేసులో నిందితులుగా పేర్కొంటున్న వారిపై చార్జ్ షీట్లు దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ గురువారంనాడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసారు. ఈ వ్యాపం కుంభకోణంలో సిట్ అధికారులు ఇంత వరకు మొత్తం 185 కేసులు నమోదు చేసారు. వారిలో చాలా మందిని అరెస్ట్ చేసారు. ఈ కేసులన్నీ సీబీఐకి బదలాయించడానికి చాలా సమయం పడుతుంది. అంతవరకు నిందితులపై అభియోగాలు నమోదు చేయకపోయినట్లయితే వారందరూ బెయిలు పొందడానికి అర్హులవుతారు కనుక దర్యాప్తు పూర్తయిన కేసులలో అభియోగాలు నమోదు చేసేందుకు తమను అనుమతించమని సిట్ అధికారులు చేసిన విజ్ఞప్తిపై ఈనెల 20వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.యల్.దత్తు తెలిపారు.
ఇంచుమించుగా రెండు దశాబ్దాలుగా ఈ కుంభకోణం, అనుమానాస్పద మరణాలు, దర్యాప్తు, అరెస్టులు సాగుతున్నాయి. కానీ ఇంతవరకు ఎవరూ కూడా దాని మూలాలలోకి వెళ్ళలేకపోయారంటే దర్యాప్తు చేస్తున్న అధికారులపై కూడా తీవ్రమయిన రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అందుకే ఈసారి దర్యాప్తులో సీబీఐ అధికారులపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు పడకుండా నివారించాలనే ఆలోచనతో సుప్రీంకోర్టు ధర్మాసనం తనే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించుకొంది. మరి సీబీఐ అధికారులయినా ఈ మిష్టరీని చేధిస్తారో లేదో చూడాలి.