వెంకయ్య నాయుడు మంచి ప్రయత్నమే చేసారు
posted on Mar 14, 2015 @ 11:39AM
రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు పూర్తి న్యాయం చేస్తామని కేంద్రం హామీ ఇస్తున్నప్పటికీ అది ఆచరణలో కనబడకపోవడంతో రెండు రాష్ట్రాలలో ప్రజలలో, ప్రభుత్వాలలో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొని అది క్రమేపీ పెరుగుతూ వస్తోంది. కానీ బీజేపీ దానిని పసిగట్టడంలో విఫలమయ్యిందో లేక ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాలు తమను గట్టిగా ప్రశ్నించవని భావించిందో తెలియదు కానీ ఇంతకాలం ఒట్టి హామీలతో కాలక్షేపం చేసింది. ఆ కారణంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఇరు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువెత్తిన నిరసనలు, నేటికీ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనలు ఉద్రుతమయ్యాయి. అప్పుడు కానీ బీజేపీ పూర్తిగా మేల్కొనలేకపోయింది.
కానీ అలాగని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు ఇంతవరకు ఏమి చేయలేదని కానీ అదేవిధంగా ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోందని కూడా మోడీ ప్రభుత్వాన్ని నిందించడం భావ్యం కాదు. కేంద్రం తెర వెనుక తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది. కానీ ఇరురాష్ట్రాలలో బీజేపీ నేతలు ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వాలతో కుస్తీ పట్లు పట్టేందుకే ప్రయత్నించేరు తప్ప కేంద్రం ఇరు రాష్ట్రాలకు ఏమేమి ఇచ్చింది ఇంకా మున్ముందు ఏమేమి ఇవ్వబోతోంది? అనే విషయాలను ప్రజలకు చెప్పుకోవడంలో అశ్రద్ధ వహించారు. అందుకే ప్రజలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది.
ఇంతకాలం హామీలు అమలుచేస్తామని పదేపదే చెపుతున్న వెంకయ్య నాయుడు తన పార్టీ మరియు కేంద్ర ప్రభుత్వం పట్ల ఇరు రాష్ట్రాల ప్రజలలో నెలకొన్న అపోహలను దూరం చేసే ప్రయత్నంలో భాగంగా మొత్తం 35 మంది కేంద్రమంత్రులను తన చాంబర్ లో సమావేశపరిచి వారిచేతనే రెండు రాష్ట్రాలకు తమ ప్రభుత్వం ఇంతవరకు ఏమేమి చేసింది, ఏమేమి చేయబోతోంది? హామీల అమలులో ఎందుకు జాప్యం జరుగుతోంది? అనే విషయాలపై మీడియాకు సమాధానాలు చెప్పించారు. వారు చెప్పిన ప్రకారం రెండు రాష్ట్రాల కోసం కేంద్రప్రభుత్వం తెరవెనుక చాలా కృషి చేస్తున్నట్లు స్పష్టమయింది.
ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ (ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి), పోలవరం ప్రాజెక్టు, రాజధానికి నిధులు, తిరుపతిలో ఐఐటి, ఐ.ఐ.యస్.ఈ.ఆర్.లకు త్వరలో శంఖుస్థాపన, మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు, కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పే విషయంపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్), ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖలో ప్రాంతీయ పాస్‌పోర్టు ఆఫీసు కార్యాలయం ఏర్పాటు కోసం కేంద్రం కసరత్తు చేస్తోందని సంబంధిత కేంద్రమంత్రులు చెప్పారు. వాటిలో కొన్ని ప్రతిపాదనలు పరిశీలనలో ఉండగా, మరికొన్నిటి కోసం సాంకేతిక అధ్యయనం జరుగుతోంది. తిరుపతిలో ఐఐటి వంటి సంస్థలకు త్వరలోనే శంఖు స్థాపన చేయబోతున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు.
ఇక తెలంగాణాకి సంబంధించి, రామగుండంలో ఎంజిఆర్ ప్రాంతంలో 1600 మెగావాట్ల తెలంగాణ ప్రాజెక్టు రామగుండంలో ఫర్టిలైజేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యూనిట్‌ను పునరుద్ధరన, గ్యాస్ ఆధారిత ఎరువుల ప్లాంట్‌ను ఏర్పాటు, హైకోర్టు విభజన, రెండు రాష్ట్రాల మధ్య జాతీయ రహదారుల నిర్మాణం వంటివి వివిధ దశలలో ఉన్నట్లు సంబంధిత కేంద్రమంత్రులు చెప్పారు.
కేంద్రప్రభుత్వం తెరవెనుక ఇంత కృషి చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని ఇంతవరకు ప్రజలకు చేరవేయడంలో అలసత్వం ప్రదర్శించినందునే ప్రజలలో ఈ అపోహలు కలిగాయి. వెంకయ్య నాయుడు చేసిన ఈ ప్రయత్నం వలన ఆ అపోహలు కొంతయినా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వారు చెపుతున్నవన్నీ వీలయినంత త్వరగా ఆచరణలోకి వచ్చేందుకు వారు గట్టిగా కృషి చేయాలి.