కొరివితో తల గోక్కున్న కేసీఆర్
posted on Jun 11, 2015 @ 2:37PM
తెలుగుదేశం పార్టీని అప్రతిష్ఠపాలు చేసి రాజకీయంగా లాభం పొందాలని అనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొరివితో తల గోక్కున్నారా? తెలుగుదేశం నాయకులను కేసులలో ఇరికించే విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన కేసీఆర్ ప్రభుత్వం తాను తీసిన గోతిలో తానే పడిందా? చెరపకురా చెడేవు అనే సామెతకు టీఆర్ఎస్ మరో ఉదాహరణగా నిలవబోతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారి నుంచి వస్తోంది. కేసీఆర్ చాలా తెలివైన వారని, తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టగల నేర్పరి అని మొన్నటి వరకూ అనుకున్నవారు కూడా ఇప్పుడు కేసీఆర్ ఇరుక్కుపోయిన తీరును చూసి ఆశ్చర్యపోయారు. ఎరక్కపోయి ఇరుక్కపోవడం కాకుండా... అన్నీ ఎరిగిన వ్యక్తి ఇలా అడ్డంగా ఇరుక్కుపోవడం చాలా వెరైటీగా వుంది. ఓటుకు నోటు వ్యవహారంలో ఏ కోణంలో చూసినా తెలుగుదేశం పార్టీకి గానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు గానీ ఎలాంటి నష్టం జరిగే దాఖలాలు కనిపించడం లేదు. అయితే ఈ వ్యవహారంలో చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన అధికార పార్టీ మాత్రం అన్నిరకాలుగా ఇరుక్కుపోయింది. మొన్నటి వరకూ మాదే పైచేయి అన్నట్టుగా వున్న అధికార టీఆర్ఎస్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. అయితే వారి అత్యుత్సాహం కారణంగా జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికే జరిగిపోయింది.
కేసులు పెట్టి చంద్రబాబును ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన టీఆర్ఎస్ ఇప్పుడు తానే ఇరుకున పడింది. రేవంత్ మీద జరిపిన స్టింగ్ ఆపరేషన్‌కి న్యాయస్థానాల్లో విలువ లేదని పలువురు న్యాయ కోవిదులు స్పష్టం చేస్తున్నారు. స్టింగ్ ఆపరేషన్లకి వ్యతిరేకంగా గతంలో సుప్రీం కోర్టును ఇచ్చిన తీర్పును కూడా వారు ఉటంకిస్తున్నారు. ఒక వ్యక్తిని లంచం ఇచ్చేలా ప్రేరేపించి, ఆ వ్యవహారాన్ని చిత్రీకరించి, అతన్ని దోషిగా న్యాయస్థానాల ముందు నిలబెట్టడం అనేది నిష్ప్రయోజనం అనేది స్పష్టంగా వుంది. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడిన సంభాషణ అన్నట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ మీడియా ప్రచారం చేస్తున్న ఆడియో టేపులకు కూడా ఎంతమాత్రం విలువలేదు. అసలు ఆ టేపుల్లో ఉన్న సంభాషణలో కొంపలు మునిగిపోయే అంశమే లేదు. అయితే ఈ ట్యాపింగ్ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం మెడకే పాములా చుట్టుకుంది. ట్యాపింగ్ వ్యవహారం గతంలో ప్రభుత్వాలనే కూల్చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర హోం శాఖతోగానీ, టెలికం శాఖతోగానీ విచారణ జరిపించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం ‘‘మేం ఏపీ సీఎం సంభాషణలను రికార్డ్ చేశాం’’ అని సగర్వంగా ప్రకటించుకున్న టీఆర్ఎస్‌కి వెన్నులో చలి పుట్టిస్తోంది.
తెలుగుదేశం పార్టీ విషయంలో టీఆర్ఎస్ చేసిన యాక్షన్‌కి ఇప్పుడు భారీ రియాక్షన్ వస్తోంది. పదేళ్ళపాటు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో తమకు రక్షణ లేని పరిస్థితి వుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. విభజన చట్టంలో వున్న సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పోలీసు, శాంతిభద్రతల అంశాలు గవర్నర్‌కి అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంవత్సర కాలంగా ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో వుంది. ఇప్పుడు జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి హైదరాబాద్‌ని గవర్నర్ చేతిలో పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అదే జరిగితే, టీఆర్ఎస్ ప్రభుత్వానికి శరాఘాతం తగిలినట్టే. రాజధానిలో కీలకమైన అంశాలు గవర్నర్ చేతిలోకి వెళ్ళిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో చేయగలిగిందే ఏమీ వుండదు. ఈ ఏడాది చివర్లో రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఘన విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతూ, ఏ అవకాశాన్నీ వదలకుండా వినియోగించుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది ఆయువుపట్టు మీద దెబ్బలా మారే ప్రమాదం వుంది.
తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ చంద్రబాబు విషయంలో చాలా సానుకూలంగా వుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ చంద్రబాబుకు అండగా నిలిచే అవకాశాలు నూటికి నూరుశాతం వుంది. కేంద్ర ప్రభుత్వం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన స్నేహధర్మాన్ని విడిచిపెట్టని చంద్రబాబు మీద కేంద్రానికి గౌరవం వుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం చంద్రబాబును ఆదుకోవడానికి ముందుకు రావడం అనేది సహజ పరిణామం. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో చంద్రబాబు కోరినట్టుగా హైదరాబాద్ అధికారాలను గవర్నర్‌కి అప్పజెప్పడం అనేది బీజేపీకి కూడా ఉపయోగపడే అంశం. తన రాజకీయ ప్రత్యర్థులైన టీఆర్ఎస్, మజ్లిస్‌లను ఒకేసారి దెబ్బతీయడానికి దీనిద్వారా మేలు జరుగుతుంది. గవర్నర్‌కి అధికారాలు అప్పగించడంతోపాటు ఇప్పుడున్న గవర్నర్ నరసింహన్‌ని తొలగించి, తమకు అనుకూలంగా వున్న గవర్నర్‌ని కేంద్రం నియమించిందంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్, మజ్లిస్ కూటమి చేతులు ఎత్తేయడం మినహా చేయగలిగిందేమీ వుండదు. రాజధానిలోనే టీఆర్ఎస్ తన పట్టును పూర్తిగా కోల్పోయిందంటే, ఒక విధంగా అది ఆ పార్టీ పతనానికి మొదటి మెట్టు అయ్యే ప్రమాదం వుంది. మరి ఇలాంటి పరిస్థితిలోకి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరైనా నెట్టారా? దీన్నే స్వయంకృతాపరాధం అంటారు. ఆ అపరాధానికి ఏ స్థాయిలో మూల్యం చెల్లిస్తారనేది వేచి చూడాల్సిన విషయం.