తప్పులు తెలుసుకునే పనిలో పడ్డ కేసిఆర్?
posted on Oct 31, 2012 7:58AM
ఎట్టకేలకు పార్టీ శ్రేణుల ఉత్సాహానికి తెరాస అధినేత కేసిఆర్ లొంగకతప్పలేదు. ఇక పార్టీని ఉద్యమాల బాట పట్టిస్తామని ఆయన ప్రకటించుకున్నారు. అయితే నవంబర్ 1వ తేదీన ఆంధ్రరాష్ట్ర అవతరణను నిరసన దినంగా పాటించాలని తెరాస నిర్ణయించింది. దానికి కేసిఆర్ పెట్టిన పేరు విద్రోహదినం. ఈ విద్రోహదినాన్ని యావత్తు తెలంగాణా ప్రాంతమంతా పాటించాలని కేసిఆర్ పిలుపు ఇచ్చారు. అయితే లాబీయింగ్ పేరిట కాలం గడిపిన కేసిఆర్ మాటను తెలంగాణావాదులు పెద్దగా పట్టించుకోకుండా తెలంగాణాజెఎసి ఛైర్మన్ కోదండరామ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ దినం విజయవంతం అవ్వాలంటే కోదండరామ్ కూడా కలిసిరావాలని తెరాసనాయకులు కేసిఆర్‌కు సూచిస్తున్నారట. ఆయన తెరాస అధినేతగా తానిచ్చిన పిలుపును మరొకరు కూడా విజయవంతం చేయాలని కోరటం ఎందుకని నేతలను తిరిగి ప్రశ్నించారని సమాచారం. ఎందుకంటే తెలంగాణామార్చ్ విజయవంతం చేసినందున కోదండరామ్ పిలిస్తే యావత్తు తెలంగాణా స్పందిస్తుందని, ఆ తరువాత తిరిగి కేసిఆర్ మేమంతా ఒక్కటే అని ప్రకటించేసుకోవచ్చని నేతలు సమాధానమిచ్చారట. దీంతో ఆశ్చర్యపోయినా తాను చేయాలనుకున్నది మార్చుకోని కేసిఆర్ విద్రోహదినం గురించి మీడియాను పిలిచి ప్రకటించేశారు. అంతేకాకుండా యావత్తు తెలంగాణాను ఒక శక్తి మారుస్తామని తాను కూడా మేనల్లుడు హరీశ్‌రావు మాదిరిగా ఉద్యమాల బాట పడుతున్నానని పరోక్షంగా తెలియజేసుకున్నారు. మేధోమదన సదస్సులో ప్రత్యేక తెలంగాణా గురించి చర్చిస్తామని కూడా నొక్కి చెప్పారు. అంటే తన తప్పులు తాను తెలుసుకునే పనిలో కేసిఆర్ పడ్డారన్న మాట.