తెరాస బలపడితే తెలంగాణా బలపడినట్లేనా?
posted on Jul 8, 2015 @ 9:10PM
తెలంగాణాలో తెరాస బలపడితే తెలంగాణా బలపడినట్లేనని తెరాస అధినేత కేసీఆర్ ఒక సరికొత్త సిద్దాంతం ఆవిష్కరించారు. తెలంగాణా ప్రజలను, తెలంగాణా (రాజకీయ) శక్తులను కలిపే నాయకత్వం ఉంటే తెలంగాణా సమాజం అంతా ఒక్కటవుతుందని తను గతంలోనే చెప్పానని అదే ఇప్పుడు క్రమంగా నిజమవుతోందని కేసీఆర్ అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెరాసలో చేరిన సందర్భంగా కేసీఆర్ ఈవిధంగా చెప్పడం గమనిస్తే ఆయన అంతర్యం ఏమిటో అర్ధమవుతోంది. తెలంగాణాలో కేవలం తెరాస పార్టీ మాత్రమే ఉండాలని ఆయన చెప్పకనే చెపుతున్నారు. తెలంగాణా (రాజకీయ) శక్తులన్నీ ఏకం కావడం అంటే అన్ని పార్టీలలో నేతలు వచ్చి తెరాసలో చేరడమేనని చెప్పవచ్చును. వారిని కలిపే బలమయిన నాయకత్వం అంటే తన నాయకత్వమేనని వేరేగా చెప్పనవసరం లేదు. అన్నిశక్తులు తెరాసలో చేరిపోతే ఇక ఆ పార్టీకి రాష్ట్రంలో పోటీయే ఉండదు. అందుకే తెలంగాణాలో శక్తులు (?) అన్నీ ఏకమవ్వాలని ఆయన కోరుకొంటున్నట్లు అర్ధమవుతోంది.
ఒక్క తెరాస తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా తెలంగాణా రాష్ట్రానికి, ప్రజలకి పరాయివేనని చెపుతున్నట్లుంది. అంటే తెలంగాణాలో ఉన్న కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, వామపక్ష పార్టీలు తెలంగాణా ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకొనే శక్తి కానీ, రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత గానీ లేదని చెపుతున్నట్లుంది.కనుక దీనికి ఏకైక పరిష్కారంఆ పార్టీలన్నీ వచ్చి తెరాసలో విలీనమయిపోవడమే. తెలంగాణా రాష్ట్రం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సరిగ్గా ఇటువంటి షరతే ఆయనకీ పెట్టింది. కానీ ఆయన దానికి అంగీకరించలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు ఆయన అన్ని శక్తులు (?) తెరాసలో కలవాలని ఆశిస్తున్నారు!
తెలంగాణాలో తెరాస తప్ప మరొక రాజకీయ పార్టీయే ఉండకూడదనే తన బలమయిన కోరికను ఆయన చాలా లౌక్యంగా, చాలా అందంగా చెపుతున్నారు. ఒకవేళ తెలంగాణాలో తెరాస పార్టీ ఒక్కటే ఉండాలనుకొంటున్నట్లయితే, ఇంక తెలంగాణాలో ఎన్నికలు కూడా అవసరం లేదనే చెప్పవచ్చును. చాలా గొప్ప ఆలోచనే! కానీ మన ప్రజాస్వామ్య దేశంలో అటువంటి గొంతెమ్మ కోరికలు ఎన్నటికీ తీరే అవకాశమే లేదని ఆయనకీ తెలుసు. అలాగని ప్రయత్నా లోపం ఉండకూడదు కనుకనే ఆయన ఇతర పార్టీలకు చెందిన నేతలని ఏదోవిధంగా తెరాసలోకి ఆకర్షిస్తున్నారనుకోవలసి ఉంటుంది. దానికే ఆయన తెలంగాణా శక్తుల ఏకీకరణ అనే అందమయిన పదం తగిలించి చెపుతున్నారు.
ఇదివరకు మనదేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ఇటువంటి ఆలోచనలే చేసారు. కానీ ఎవరూ ఇంతవరకు సఫలం కాలేదు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ సైతం తన నిరంకుశ ధోరణితో కొంత కాలమే రాజకీయాలను శాసించగలిగారు. కానీ అదే ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యానికి బద్దురాలయి ఉన్నంత కాలం నిరాటంకంగా రాజ్యం ఏలగలిగారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న గొప్ప లక్షణం అదే. కనుక కేసీఆర్ కావచ్చు లేదా మరొకరు కావచ్చు ఈ చిన్న సూత్రాన్ని ఆకళింపు చేసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థని గౌరవించి, అంగీకరించి ప్రజలను మెప్పించే పరిపాలన, వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా రాష్ట్రభివృద్ధి చేసి చూపగలిగితే ఎదురు లేకుండా పరిపాలించుకోవచ్చును.
కానీ కేవలం తమ పార్టీ మాత్రమే ప్రజల ఆకాంక్షలకి అద్దం పట్టగలదని, తమ పార్టీయే రాష్ట్రానికి ప్రతిరూపమని కనుక అది బలపడితే రాష్ట్రం కూడా బలపడుతుందని భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి ఉండబోదు. రాజకీయపార్టీలు ఏవయినా సరే దేశంలో అంతర్భాగమే తప్ప అవే దేశానికో ఒక జాతికో ప్రతిరూపం కాలేవు. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే దేశంలో లేదా రాష్ట్రంలో ఆ పార్టీ జెండాలు రెపరెపలాడవచ్చును. ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తోంది కనుక పరిపాలన చేయవచ్చును. తన ఆలోచనలను, సిద్దాంతాలను, వ్యూహాలను అమలు చేయవచ్చును. అవి ప్రజలకి నచ్చినట్లయితే మళ్ళీ అధికారం కట్టబెడతారు. లేదంటే రేపు మరొక పార్టీకి అధికారం కట్టబెడతారు. అప్పుడు మళ్ళీ జెండాలు, ఆలోచనలు, సిద్దాంతాలు మారిపోతాయి. ఇది అందరూ కళ్ళారా చూస్తున్నదే. తెరాస, తెదేపాలపై ప్రజలు నమ్మకం ఉంచి అధికారం కట్టబెట్టారు. కనుక అవి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి లోబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకుపోగలిగితే అనూహ్యమయిన ఇటువంటి సిద్ధాంతాలు ప్రతిపాదించనవసరం ఉండదు.