తెలంగాణాలో వైకాపా నేతలను పావులుగా వాడుకొంటున్నారా?
posted on Jun 4, 2015 @ 12:37PM
రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణాను విడిచిపెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో ప్రవేశించి అక్కడ బలపడేందుకు ప్రయత్నిస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. అందుకోసం రాష్ట్ర వైకాపా నేతలు తెరాస ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్నారు. ఆ పార్టీ నేత షర్మిల రెండు సార్లు పరామర్శయాత్రలు చేసారు. మళ్ళీ ఈనెల 9నుండి మూడవసారి యాత్రలకి బయలుదేరుతున్నారు. కానీ మొన్న జరిగిన తెలంగాణా శాసనమండలి ఎన్నికలలో తెరాసకు వైకాపా మద్దతు ఇవ్వడంతో రాష్ట్ర నేతలు కంగు తిన్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు యం.యల్యేలను తెరాస తన వైపు త్రిప్పుకొన్నప్పుడు సహజంగా ఆగ్రహం కలగాలి. కానీ అందుకు ఏ మాత్రం స్పందించకపోగా తిరిగి ఆ పార్టీ అభ్యర్ధికే ఓటు వేయడంతో వైకాపాకు నిజంగానే తెలంగాణాలో బలపడాలనే ఉద్దేశ్యం ఉందా...లేక రాష్ట్రంలో వైకాపా నేతలను ఆ రెండు పార్టీలు కలిసి తమ రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకొంటున్నాయా? అనే అనుమానం కలుగకమానదు. జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న నిర్ణయం వలన రాష్ట్ర నేతలు కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు తెలంగాణా ప్రభుత్వంతో పోరాడుతున్నట్లు నటిస్తున్నట్లయింది. తెలంగాణా ప్రజలు వారి చిత్తశుద్ధిని శంఖించే పరిస్థితి ఏర్పడింది.
రెండు రాష్ట్రాలలో తెదేపా-బీజేపీలు కలిసి పనిచేస్తున్నట్లే, ఒకవేళ తెలంగాణాలో తెరాసతో కలిసి పనిచేయాలని వైకాపా భావిస్తే అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. ఒకవేళ చెప్పినా ఆ రెండు పార్టీలకు ప్రజలకు జవాబు చెప్పుకోగల దైర్యం ఉన్నట్లయితే ఎవరినీ పట్టించుకోనవసరం లేదు. కానీ తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నట్లు నటిస్తూ మళ్ళీ అవసరం పడినప్పుడు ఈవిధంగా మద్దతు ప్రకటించడం గమనిస్తే ఆ పార్టీకి తెలంగాణాలో బలపడాలని కాక వేరే ఇతర కారణాలు, ఉద్దేశ్యాలు ఉన్నట్లు అనుమానించవలసి వస్తోంది.
ఆ రెండు పార్టీలు తమ ఉమ్మడి శత్రువు అయిన తెదేపాను, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని రాజకీయంగా దెబ్బ తీసేందుకే వైకాపాను తెలంగాణాలో ప్రవేశపెట్టి ఉండవచ్చును. అందుకే వైకాపా యం.యల్యేలను తెరాస తనవైపు త్రిప్పుకొన్నప్పటికీ ఆ పార్టీ అస్సలు పట్టించుకోలేదు. కానీ తెలంగాణాలో ఎలాగయినా బలపడి, వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని భావిస్తున్న తెదేపా, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ యం.యల్యేలను తెరాస ఆకర్షించినప్పుడు దానిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా న్యాయపోరాటాలు కూడా చేస్తుండటం గమనిస్తే, ఈ విషయంలో వైకాపా ఎందుకు ఉదాసీనంగా ఉందో అర్ధమవుతుంది.
ఇక మరో కారణం ఏమయి ఉండవచ్చంటే తెలంగాణాలో స్థిరపడిన ఆంద్ర ప్రజల ఓట్లు తెరాసకు పడతాయనే నమ్మకం లేదు. కనుక వారి ఓట్లను తెరాసకు బదలాయించేందుకే వైకాపాను తెలంగాణాలోకి రప్పించి ఉండవచ్చుననే అనుమానాలు కలుగుతున్నాయి. నల్గొండలో పరామర్శ యాత్ర పూర్తయిన తరువాత రంగారెడ్డి, హైదరాబాద్ లలో షర్మిల యాత్రలు చేస్తారని ఆ పార్టీ ప్రకటించడం గమనిస్తే, త్వరలో జరుగనున్న జి.హెచ్.యం.సి. ఎన్నికలలో వైకాపా పోటీ చేసి ఆంద్ర ప్రజల ఓట్లను తెరాసకు బదలాయించేందుకేనని అనుమానం కలుగుతోంది. మొన్న శాసనమండలి ఎన్నికలలో తెరాసకు మద్దతు ఇచ్చినట్లే, జి.హెచ్.యం.సి. ఎన్నికలలో తమ ఉమ్మడి రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా, బీజేపీ అభ్యర్ధుల ఓట్లను చీల్చి తెరాసకు ప్రయోజనం కలిగించవచ్చును. లేదా ఎన్నికల తరువాత తెరాసకు మద్దతు ప్రకటించవచ్చును.
వైకాపా ఉద్దేశ్యం తెలంగాణాలో బలపడి ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారం చేప్పట్టడం కాదు కనుకనే తెదేపాను, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యాత్రలను వ్యతిరేకించినట్లుగా షర్మిల పరామర్శ యాత్రలను, తమ ప్రభుత్వంపై వైకాపా చేస్తున్న పోరాటాలను తెరాస పెద్దగా పట్టించుకోవడంలేదని భావించవలసి ఉంటుంది. తెలంగాణాపై ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆసక్తి లేదు కనుకనే ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ ఇంత వరకు తెలంగాణాలో పర్యటించకుండా అప్పుడప్పుడు తన సోదరి షర్మిలను పరామర్శ యాత్రలకు పంపిస్తున్నట్లున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఆమె కూడా తన యాత్రలు రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తున్నవి కావు కనుక తను రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని చాలా లౌక్యంగా తెరాసపై ఎటువంటి విమర్శలు చేయకుండా వెళ్లి వచ్చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ఓదార్పు యాత్రలు, రైతు భరోసా యాత్రలు చేస్తునప్పుడు మాత్రం తన రాజకీయ ప్రత్యర్ధి అయిన తెదేపాను, అది నడిపిస్తున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఎంత ఘాటుగా విమర్శిస్తారో అందరికీ తెలుసు. దీనిని బట్టి చూస్తే వైకాపాకు తెలంగాణాపై ఆసక్తి లేదని, తన రాజకీయ శత్రువు అయిన తెదేపాను తెలంగాణాలో నిలువరించేందుకు తెరాసకి సహాయపడేందుకే ఆ రాష్ట్రంలో తిరిగి ప్రవేశించినట్లు అనుమానం కలుగుతోంది. అయితే ఇది కాకుండా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వేరే ఇతర అవసరాలు, ప్రయోజనాలు లేదా ఇతర కారణాలు కూడా ఉండి ఉండవచ్చును. కానీ ప్రధాన కారణం మాత్రం పైన పేర్కొన్నవే అయ్యి ఉండవచ్చును.
ఈ అనుమానాలే నిజమయితే అందరి కంటే ఎక్కువ నష్టపోయేది వైకాపాను నమ్ముకొన్న నేతలు, కార్యకర్తలే. ఇంతకు ముందు కొండా సురేఖ వంటి నేతలు వైకాపాను నమ్ముకొన్నందుకు తెలంగాణా ద్రోహులుగా అనేక అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ వైకాపా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని, తెలంగాణాలో పార్టీకి కొండంత అండగా నిలబడిన కొండా సురేఖ దంపతులతో సహా అనేకమంది తెలంగాణా నేతలను నడిరోడ్డు మీద విడిచిపెట్టేసి రాత్రికి రాత్రి తెలంగాణా నుండి ఆంధ్రాకు తరలిపోయిన విషయం అందరికీ తెలుసు. బహుశః మళ్ళీ మున్ముందు తెలంగాణాలో వైకాపా నేతలకు అటువంటి పరిస్థితే ఎదురయినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.