ఎన్డీఏ కూటమిలో టీఆర్ఎస్ చేరితే..?
posted on Feb 18, 2015 @ 12:10PM
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తె కవితకి కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకొనేందుకే ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే ఇప్పుడు ఆయనను కేసీఆర్ తెగ పొగిడేస్తున్నారని టీ-కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. అలాగ నిప్పు పుట్టింది కనుక ఈ అంశంపై మీడియాలో కూడా పొగలు రావడం మొదలయ్యాయి.
కానీ తెరాస నేతలు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. తాము ఈ విషయం గురించి కేంద్రంలో ఎవరినీ సంప్రదించలేదని, అదేవిధంగా కేంద్రం కూడా తమను సంప్రదించలేదని వారు చెపుతున్నారు. కానీ ఈ వార్తలకు కేంద్రబిందువుగా ఉన్న నిజామాబాద్ యంపి కవిత మాత్రం ఈ వార్తలను నిర్ద్వందంగా ఖండింలేదు. అలాగని సమర్ధించ లేదు కూడా. ఆమె ఒక ప్రముఖ తెలుగు పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో “తెరాసకు, తెలంగాణా రాష్ట్రానికి ఏది మంచిదో ఏది కాదో నా తండ్రి కేసీఆర్ కి తెలిసినట్లు మరెవరికీ తెలియదు. కనుక మేమందరం కూడా మారు మాట్లాడకుండా ఆయన తీసుకొన్న నిర్ణయాలను అమలుచేస్తాము,” అని చెప్పారు. కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు ఆమె చెప్పిన ఈ జవాబే సందేహాలను మరింత పెంచుతోంది.
తెరాస-బీజేపీల మధ్య కేవలం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలు తప్ప వాటి మధ్య ఎటువంటి పొత్తులు లేవు. అదీగాక కేసీఆర్ నిన్న మొన్నటి వరకు కూడా మోడీకి, ఆయన ప్రభుత్వానికి కూడా తిట్లు, శాపనార్ధాలు పెడుతూనే ఉన్నారు. కనుక సహజంగానే మోడీ మంత్రివర్గంలో కవితకు అవకాశం ఉండబోదు. కానీ ఒకవేళ మోడీ ఆమెను తన మంత్రివర్గంలోకి తీసుకొన్నట్లయితే అది చాలా అసాధారణమయిన విషయమే అవుతుంది. అంతే కాదు అది భవిష్యత్తులో మారబోయే రాజకీయ సమీకరణాలకి మొదటి సంకేతంగా భావించవచ్చును.
ఒకవేళ ఆమెను మంత్రివర్గంలోను, తెరాసను ఎన్డీయే కూటమిలోనూ చేర్చుకొనేందుకు బీజేపీ సిద్దపడినట్లయితే, అప్పుడు తెదేపా-బీజేపీల మధ్య పొత్తుల గురించే మొట్ట మొదట ఆలోచించవలసి వస్తుంది. ఒకవేళ బీజేపీ తెలంగాణా లో తెదేపాతో తెగ తెంపులు చేసుకొని తెరాసతో జత కట్టదలిస్తే, అప్పుడు తెదేపా పరిస్థితి ఏమిటి? అందుకు ప్రతిగా ఆ పార్టీ ఆంధ్రాలో బీజేపీతో తెగ తెంపులు చేసుకొంటుందా? లేకపోతే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బీజేపీతో రాజీపడి మౌనంగా ముందుకు సాగుతుందా? అనేది వేచి చూడాలి.
ప్రధాని మోడీ కవితను తన మంత్రివర్గంలో తీసుకొన్నా తీసుకోకపోయినా బీజేపీ యొక్క భవిష్య ప్రణాళికలు, తెదేపా పట్ల దాని వైఖరిని అర్ధం చేసుకోవడానికి జీ.హెచ్.యం.సి ఎన్నికల వరకు ఆగితే చాలు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తులా లేక కత్తులా అనేది తేలిపోతుంది. ఒకవేళ తెలంగాణాలో తెదేపాతో కటిఫ్ చెప్పేసినప్పటికీ, ఆంధ్రాలో మాత్రం ఒకరి అవసరం మరొకరికి ఉంది కనుక ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల వరకు పొత్తులు కొనసాగించవచ్చును.