ఇంతకీ శివాజీ దీక్ష ప్రత్యేక హోదా కోసమేనా?
posted on May 4, 2015 @ 9:41PM
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతున్న తెలుగు సినీ నటుడు శివాజీ ఆదివారం నుండి గుంటూరులో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు కూర్చొన్నారు. మొదట ఆయన కేవలం మూడు రోజులు మాత్రమే నిరాహార దీక్ష చేస్తారని ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన్నట్లు తెలుస్తోంది. ఆయన తను బీజేపీకి చెందిన వాడినని చెప్పుకొంటుంటే, పురందేశ్వరి, మంత్రి కామినేని వంటి బీజేపీ నేతలు మాత్రం అతనితో తమ పార్టీకి ఎటువంటి సబంధమూ లేదని చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంది.
బహుశః అతను పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నాడు కనుకనే వారు ఆవిధంగా అంటున్నట్లయితే, బీజేపీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకొన్నవారెవరో శివాజీని వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారేమోననే అనుమానం కలగడం సహజం. కనుక ముందుగా శివాజీ తను బీజేపీ సభ్యుడిగా ఉన్నాడో లేదో తేల్చి చెప్పాక తన దీక్షలు కొనసాగించుకొంటే ఎవరికీ ఇటువంటి అనుమానం రాదు.
అదేవిధంగా శివాజీ నిత్యం పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావించడం కొంచెం ఆలోచింపజేసే విషయమే. ప్రధాని నరేంద్ర మోడీతో సత్సంబంధాలు గల పవన్ కళ్యాణ్ వచ్చి తనతో చేతులు కలిపినట్లయితే మోడీ తప్పకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేస్తారని శివాజీ వాదన. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం అంత సులువయితే, శివాజీ ఆమరణ నిరాహార దీక్ష చేసేవరకో లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి నచ్చజెప్పెవరకో ప్రధాని నరేంద్ర మోడీ వేచి చూసేవారే కాదని అతను గ్రహించితే మంచిది.
మోడీ తమ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చి ఉండవచ్చును. కానీ ఆ హామీని అమలుచేయడంలో అనేక సమస్యలు, అడ్డంకులు ఎదురవుతున్న కారణంగానే ఆయన తన హామీని నిలబెట్టుకోలేకపోతున్నారనే సంగతి అందరికీ తెలుసు. ఈ సంగతి మొన్న ఒక్కరోజు దీక్ష చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకీ, ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్న శివాజీకి తెలియదనుకోలేము. రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకొనేందుకే ప్రత్యేక హోదా వంకతో కొంచెం హడావుడి చేసిందని అందరూ సర్ది చెప్పుకొన్నారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, అవరోధాల గురించి ఎరిగి ఉన్నప్పటికీ బీజేపీకి చెందిన శివాజీ ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నట్లు? దానికి ఆయన సరయిన సమాధానం చెప్పలేకపోతే ప్రత్యేక హోదా విషయంలో చాలా ఇబ్బంది పడుతున్న బీజీపీని మరింత ఇబ్బంది పెట్టి ప్రజలలో అప్రదిష్టపాలుజేసేందుకు బీజేపీ శత్రువులెవరో శివాజీని వెనుకనుండి ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానం కలుగక మానదు.
అదేవిధంగా ఆయన ప్రతీసారి పవన్ కళ్యాణ్ పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారు? అనే ప్రశ్నకు కూడా జవాబు చెప్పవలసి ఉంటుంది. చెప్పలేకపోతే పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకిస్తున్న వారో లేకపోతే పవన్ కళ్యాణ్-తెదేపా-బీజేపీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న వారెవరో శివాజీని వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారనే అనుమానం కలుగక మానదు. ఒకవేళ శివాజీ నిజంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసమే పోరాటం మొదలుపెట్టి ఉంటే ఆయన ముందుగా బీజేపీకి రాజీనామా చేసి, తరువాత కేవలం ప్రత్యేక హోదాకు సంబందించిన విషయాలు, సమస్యల గురించి మాత్రమే మాట్లాడితే మంచిది. అలాకాక ఆయన బీజేపీలో కొనసాగుతూ తన పార్టీ అనుమతి లేకుండా నిరాహార దీక్షలు చేస్తూ తను దేనికోసం నిరాహార దీక్ష చేస్తున్నాడో దాని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ఆయన చిత్తశుద్ధిని అనుమానించవలసి వస్తుంది.