యూరియా యుద్ధం వెనుక అసలు రహస్యం
posted on Sep 2, 2025 6:42AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై యాభై శాతం సుంకాల మోత మోగించడానికి యూఎస్ వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ బార్లా తలుపులు తెరవడం కూడా ఒక కారణం. అంత అవసరం ఏమొచ్చిందని చూస్తే.. అమెరికా రైతాంగం ఓటు బ్యాంకును ఆకట్టుకోడానికే ట్రంప్ ఇదంతా చేస్తున్నారని అంటారు నిపుణులు. దీని వల్ల వచ్చే లాభనష్టాలేంటి? ఆయన మూడో సారి అధ్యక్షుడయ్యేదుందా?
అన్న ప్రశ్న వినిపించవచ్చు. కానీ, వారి దృష్టిలో కూడా తాను గొప్ప రైతు పక్షపాతినని ఎస్టాబ్లిష్ చేసుకోడానికే ట్రంప్ ఇదంతా చేస్తున్నట్టు అంటారు.
సరే అమెరికా సంగతి వదిలి పెట్టి తెలంగాణకు వద్దాం. ఇక్కడ మొన్న కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. ఎవరైతే తెలంగాణ రైతాంగానికి యూరియా కొరత లేకుండా చేస్తారో వారి ఉపరాష్ట్రపతి అభ్యర్ధికే తమ పార్టీ ఎంపీలు ఓటు వేస్తారని చెప్పారు. ఇక్కడా అదే లాజిక్.. ఎలాగైనా సరే, తెలంగాణ రైతాంగం దృష్టినాకర్షించడమే లక్ష్యం. కట్ చేస్తే.. ఇదే బీఆర్ఎస్ ఒక పక్క కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ అనగా.. తమ పార్టీ వారి చేత రోడ్డుపై యూరియా నిరసనకు తెరలేపింది.
ఇక కాంగ్రెస్ తరఫు నుంచి యూరియా యుద్ధం ఎలా సాగిందో చూస్తే.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరూ పార్లమెంటు ఎదుట యూరియా కోసం నిరసన తెలపగా.. ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక సైతం వారి ఫ్లెక్సీలను చేపట్టడానికి చేతులు కలిపారు. వియ్ వాంట్ యూరియా అంటూ స్లోగన్ కొట్టారు. దీంతో బీజేపీ యాభై వేల టన్నుల యూరియా తెలంగాణకు పంపుతామని అనడంతో.. ఆ ఘనత మొత్తం తమదేనంటూ ఇక్కడి వ్యవసాయ మంత్రి తుమ్మల కామెంట్ చేసిన విధమూ కనిపించింది.
ఈ విషయంలో బీజేపీ వాయిస్ ఎలా ఉందో చూస్తే.. యూరియాకి సంబంధించి తప్పుడు లెక్కలు చూపుతోంది రేవంత్ సర్కార్ అంటూ ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. తెలంగాణకు ఖరీఫ్ సీజన్‌కు ఇప్పటివరకు 6.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని కేంద్ర ప్రభుత్వం అందజేసిందని ఆ గణాంకాలన్నిటినీ విడమరచి చెప్పారాయన. ఇంకా ఎంత యూరియా కావాలంటే అంత ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కూడా అన్నారు.
రబీ సీజన్ 2024-2025లో 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని... కానీ తెలంగాణలో 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఆ లెక్కలన్నీ వల్లెవేశారు. కానీ ఇక్కడ చూస్తే యూరియా లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. రబీలో అదనంగా ఉన్న యూరియా ఇప్పుడు ఎందుకు లేకుండా పోయిందని.. నిలదీశారాయన.
ఎందుకు కొరత వచ్చిందో రేవంత్ ప్రభుత్వం పరిశీలించుకోవాలని సూచించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రాజకీయాల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా ధ్వజమెత్తారు. తాను చెప్పింది తప్పయితే పదవికి రాజీనామా చేస్తానని.. మీది తప్పు అయితే మీరు రాజీనామా చేస్తారా? అని తుమ్మలకు సవాల్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్.
ఇంతకీ తెలంగాణలో వచ్చిన యూరియా కొరత నిజమైనదా? లేక రాజకీయ ప్రేరేపితమా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. బేసిగ్గా యూరియా ఎవరి చేతుల్లో ఉంటుందో చూస్తే.. అది కేంద్రం చేతుల్లో. కేంద్రం నుంచి సరఫరా లేక పోవడం వల్లే ఇదంతా అని కాంగ్రెస్ అంటుంటే.. అలాంటిదేం లేదని బీజేపీ వాదిస్తోంది.
అసలు యూరియా కొరత ఎందుకు వచ్చింది? యూరియా కోసం రైతులు ఎందుకు ఇంతలా ఇబ్బందులు పడుతున్నారు? అని చూస్తే వర్షాకాలంలో వరి, పత్తి పంటలకు యూరియా అవసరం పెద్ద మొత్తంలో ఉంటుంది. 2025 సీజన్‌లో ఒక్క తెలంగాణలోనే 1.32 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతాయని అంటోంది వ్యవసాయ శాఖ.
ఇందులో ఆహార ధాన్యాలు 76.14 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. వీటిలో 62.47 లక్షల ఎకరాల్లో వరి, 48.93 లక్షల ఎకరాల్లో పత్తి, 6.69 లక్షల ఎకరాల్లో కంది, 5.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలున్నాయి. మిగిలిన విస్తీర్ణంలో ఇతర ఆహార, వాణిజ్య పంటలున్నాయి.
సీజన్ మొదట్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అక్కడక్కడ యూరియా కొరత కనిపించింది. వర్షాలు పడి రైతులు పూర్తి స్థాయి సాగుకు సిద్ధపడ్డారు. ఈ లోగా వీరినెత్తిన పిడుగులా వచ్చి పడింది యూరియా కొరత. 2 వేల బస్తాలు అవసరం ఉన్న చోట కేవలం 500 బస్తాలు మాత్రమే వస్తున్నాయ్. ఏ మాత్రం ఆలస్యం అయినా ఆ ఒకటీ అరా బస్తాలు కూడా దొరకవు. దీంతో వర్షం పడుతున్నా కూడా.. క్యూలైన్లు వదలకుండా బారులు దీరుతోంది రైతాంగం.
తెలంగాణకు ఎంత యూరియా రావాలి.. ఎంత వచ్చింది? అని చూస్తే.. తెలంగాణకు ఈ వర్షాకాలం సీజన్లో 9.80 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేసింది వ్యవసాయ శాఖ. మాములుగా అయితే ఏటా ఏప్రిల్ నుంచి యూరియా అవసరం మొదలవుతుంది. తర్వాతి సీజన్‌కు తగ్గట్టుగా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. అయితే, 2022 నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ వార్షిక ప్రణాళిక విడుదల చేయడంలేదని ఆరోపిస్తున్నారు రైతు సంఘం నాయకులు. పంటల వారీగా వ్యవసాయ ప్రణాళిక వేయాలని ఎన్నోసార్లు అడిగామనీ.. దీన్నిబట్టి ఎరువులను డిమాండుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకునే వీలుంటుందనీ.. అదే జరగడం లేదనీ ఆరోపిస్తారు వీరంతా.
రాష్ట్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం, తెలంగాణలో ఏప్రిల్ నాటికి 1.92 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ఇది కాకుండా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం కేంద్రం నుంచి వచ్చే నెలవారీ యూరియా కోటాలోనూ కోత పడినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికి కేంద్రం నుంచి 8.30 లక్షల టన్నులకుగాను 5.12 లక్షల టన్నుల యూరియానే వచ్చినట్లుగా చెబుతారు మంత్రి తుమ్మల. ఇదే కాకుండా ఏప్రిల్ నాటికి ఉన్న నిల్వలు కలుపుకొంటే 7.04 లక్షల టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారాయన. కేంద్రం నుంచి రావాల్సిన కేటాయింపుల్లో కోత కారణంగా మొత్తంగా 2.76 లక్షల టన్నుల కొరత ఏర్పడిందని చెబుతారు మంత్రి తుమ్మల.
ఈ ఆరోపణలను ఖండించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచంద్రరావు. యూరియా సరఫరాలో ఎక్కడా కేంద్రం నుంచి లోపం జరగలేదని అంటారు. కేంద్ర ప్రభుత్వం 2025 యాసంగి సీజన్ లో తెలంగాణకు అవసరమైన 9.87 లక్షల టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల టన్నులు సరఫరా చేసిందని వివరించారు రామచంద్రరావు. ఓపెనింగ్ స్టాక్ లెక్కల్లో తేడాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు.
బీఆర్ఎస్ ఈ విషయంలో ఎలాంటి వాదన వినిపిస్తుందో చూస్తే.. తమ హయాంలో ఆరు నెలల ముందు నుంచే ఎరువుల కోసం ముందస్తు ప్రణాళిక తయారు చేసి తెప్పించామని అంటారు కేటీఆర్. ప్రణాళికా లోపం కారణంగానే సమస్య ఏర్పడిందని తేల్చి చెబుతారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎరువుల కొరతపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారాయన. అయితే, రాష్ట్రానికి అవసరమైన ఎరువుల వివరాలు కేంద్రానికి ముందుగా ఇండెంట్ పంపించామని అంటారు మంత్రి తుమ్మల.
ఎరువుల పరంగా ఏ రాష్ట్రానికి ఎంత కావాలనే విషయంపై ఆయా రాష్ట్రాల నుంచి డిమాండ్ వెళ్తుంది. ఈ ఇండెంట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రచించి, ఎరువులు సరఫరా చేస్తుంది. బేసిగ్గా అయితే జిల్లాల అవసరాలను బట్టీ ఎరువులను పంపే బాధ్యత వ్యవసాయ శాఖపై ఉంటుంది. కానీ మంత్రులు ఎమ్మెల్యేల బలాబలాలను బట్టీ ఎరువులను తరలిస్తున్నట్టు ఆరోపిస్తున్నారు వ్యవసాయ సంఘం నేతలు. మొత్తంగా డిమాండ్- కేటాయింపులు- సరఫరా మధ్య 2.76 లక్షల టన్నుల వ్యత్యాసం ఏర్పడింది. దీన్ని అధిగమిస్తేనే, రైతులకు సరిపడా యూరియా అందించే వీలుంటుందని అంటారు నిపుణులు.
ఇక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వ్యవహారం విషయానికి వస్తే.. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 145 పని దినాలు ఉంటే 78 రోజులు ఉత్పత్తి నిలిచిపోయిందని ప్రకటించింది రేవంత్ సర్కార్. ఇందుకు సాంకేతిక కారణాలు, అమ్మోనియం లీకేజీ కారణంగా చెబుతోంది ఫ్యాక్టరీ యాజమాన్యం. ఈ ప్రభావం కూడా తెలంగాణ రైతాంగం పడుతున్నట్టు చెబుతున్నారు. బేసిగ్గా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తయ్యే యూరియాలో 11శాతం వాటా రాష్ట్రానికి ఉంటుంది. ఆ మేరకు తెలంగాణకు కేటాయించాలి. ఫ్యాక్టరీ ఎరువుల ఉత్పత్తిలో వచ్చిన సమస్య కారణంగా కూడా ఈ కొరత వచ్చినట్టు చెబుతారు వ్యవసాయ సంఘ నేతలు.
సాధారణంగా వరి, పత్తికి మూడు నుంచి నాలుగుసార్లు యూరియా వేస్తుంటారు రైతులు. పత్తి విత్తనాలు విత్తిన 20 రోజుల నుంచి మూడు లేదా నాలుగుసార్లు యూరియా వేస్తుంటారు. వరికి కలుపు తీసే సమయలోను, తర్వాత నుంచి 20 రోజులకు, 30 రోజులకు, 50 రోజులకోసారి యూరియాను అవసరాన్ని బట్టి వేస్తుంటారు. యూరియా వాడకం ఎక్కువ కావడంతోపాటు పంటల విస్తీర్ణం పెరగడం కొరత ఏర్పడటానికి కారణమైందని చెబుతుంది వ్యవసాయ శాఖ.
యూరియాపై ఎక్కువగా రైతులు ఆధారపడటానికి గల కారణాలేంటని చూస్తే.. కంపోస్టు ఎరువుల వాడకం తగ్గింది. మాంసకృత్తులతో కూడిన పదార్థాలు పండించే పంటలకు ఎక్కువగా యూరియా అవసరం పడుతోందని అంటారు అగ్రి రంగ నిపుణులు. అలాగే గాల్లో నత్రజని తీసుకునే బ్యాక్టీరియా పంటపొలాల్లో క్రమంగా తగ్గుతోందని, అవసరమైన నత్రజని అందించేందుకు యూరియాను ఎక్కువగా పంటలకు వేస్తుంటారని అగ్రి వర్శిటీ ప్రొఫెసర్లు.
కాదేదీ కవిత్వానికి అనర్హం అన్నట్టు కాదేదీ రాజకీయాలకు అనర్హం. చిన్న సైజు ఉల్లిపాయ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించగలదు. అలాంటిది యూరియా బస్తా మాత్రం ఆ పని చేయలేదా? అన్నది కొందరి కామెంట్. యూరియా కొరత కూడా ప్రస్తుత రాజకీయాల్లో ఒక భాగంగా మారి.. వారి వారి వాదనలను తెరపైకి తెస్తోంది. దీనంతటి వెనక ఉన్న ఒకే ఒక్క లక్ష్యం.. రైతాంగాన్ని ఆకర్షించడమే. మా తరఫున ఈ పార్టీ వాళ్లు గట్టిగానే పోరాడుతున్నారంటూ.. వారి కంట్లో పడ్డమే లక్ష్యంగా ఈ యూరియా యుద్ధం కొన్నాళ్ల పాటు చూడక తప్పదంటున్నారు వ్యవసాయ, రాజకీయ రంగ విశ్లేషకులు.