తెలుగు భాషా? తెలంగాణ భాషా?
posted on Sep 13, 2017 @ 12:25PM
ప్రపంచ తెలుగు మహాసభలను డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్‌లో భారీ స్థాయిలో నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు మహాసభలు నిర్వహించినా తమ రాష్ట్రం నిర్వహించిన సభల ముందు అవి వెలవెలపోవాలన్నది తెలంగాణ సీఎం కేసీఆర్ అంతరంగం. వచ్చే డిసెంబర్‌లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానిని ఆహ్వానించాలని, వారు తప్పనిసరిగా వచ్చి సభలను విజయవంతం చేసేలా చేయాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో వున్నారు. సీఎం మనోభావాలను అర్థం చేసుకున్న అధికార యంత్రాగం కూడా సభలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. తమదే అసలైన తెలుగు రాష్ట్రం అని దేశానికి తెలిసేలా చేయాలన్నది కేసీఆర్ ప్రయత్నం. దీనికోసం తెలుగు మహాసభలకు ముందు నుంచే తెలుగుకు మరింత వెలుగు ఇచ్చే చర్యలను ఆయన ప్రతిపాదించారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించాలని ఆయన ఆదేశించారు. ఈ నిబంధనను అంగీకరించిన విద్యాసంస్థలకే తెలంగాణలో అనుమతి ఇవ్వాలని నిర్దేశించారు. అన్ని నేమ్‌ప్లేట్స్‌నీ (నామ ఫలకాలను) తెలుగులోనే రాయాలని ఆదేశించారు. అంతేకాకుండా సభల నిర్వహణకు ప్రస్తుతానికి యాభై కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేశారు. తెలుగు మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు వున్నా అక్కడ సభలు నిర్వహించేలా చేయాలనే ఆలోచన కూడా సీఎం కేసీఆర్‌కి వుంది. తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సంస్కృతిని ప్రపంచం మొత్తానికీ మరోసారి చాటిచెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది.
అంతా బాగానే వుంది. ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు అంటోంది. అయితే తెలంగాణలోని కొంతమంది మేధావులు ఈ సభలను ‘తెలుగు మహాసభలు’ అని కాకుండా ‘తెలంగాణ మహాసభలు’ అని వ్యవహరించాలని అంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే భాషను ‘తెలుగు భాష’ అని కాకుండా ‘తెలంగాణ భాష’ అని వ్యవహరించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ‘తెలుగు’ పేరుతో నిర్వహించబోతున్న సభలను కూడా వారు వ్యతిరేకిస్తూ ‘తెలంగాణ మహాసభల’ పేరుతో నిర్వహించాలన్న వాదనను తెరమీదకు తెస్తు్న్నారు. ప్రభుత్వా్న్ని వ్యతిరేకించే వర్గాలు కూడా ఈ వాదనకు మద్దతు పలుకుతూ వుండటం విశేషం. మనం మాట్లాడుతున్న భాషను ‘తెలంగాణ భాష’గా వ్యవహరించాలని డిమాండ్ చేయడం మేధావి వర్గానికి నచ్చే విషయమేమోగానీ, సామాన్యుల మెప్పు పొందే విషయం కాదని కొంతమంది భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ భాష తలెత్తుకునేలా చేయాలే తప్ప, ‘తెలుగు’ అనే పదానికే తిలోదకాలు ఇవ్వడం న్యాయం కాదని అంటున్నారు.