భావోద్వేగాలకు అక్షరాలను జోడించే అరుదైన భాష తెలుగు
posted on Aug 29, 2020 @ 9:41AM
తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
అంటూ ఓ సినీకవి కలం నుంచి జాలువారిన అక్షరాలు తెలుగుభాష గొప్పదనాన్ని ప్రపంచ యవనికపై ఆవిష్కరించి భాషలోని మాధుర్యాన్ని నలుదిశగా చాటుతున్నాయి. తీయ్యనైన తేనెలూరే తెలుగు భాషకు గుర్తింపు తీసుకువచ్చిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగుభాషా దినోత్సవంగా ప్రతిఏటా నిర్వహించుకుంటున్నాం. తెలుగుభాషలోని స్పష్టత, భావం, అక్షరాల పొందిక అన్నీ అపురూపంగా ఉంటాయి. అందుకే ఎంతో మంది కవులు తెలుగు అక్షర కుసుమాలతో మాలలల్లీ అమ్మభాషను కమ్మనైన భాషగా భావితరాలకు అందించారు. లెక్కకు మించి పదప్రయోగాలు చేస్తూ ప్రాచీన భాషను పదిలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మనసులోని భావోద్వేగాలకు అక్షరాలను జోడించే అరుదైన భాష తెలుగు మాత్రమే. తెలుగు భాష కోసం గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ తెలుగువెలుగులు దిశదశగా వ్యాపింపచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
ప్రపంచవ్యాప్తంగా పదికోట్ల మంది
ప్రపంచంలో ఉన్న వేలాది భాషల్లో ప్రాచీనభాషగా గుర్తింపు పొందిన భాష మన తెలుగు. భారతదేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడేవారి సంఖ్య దాదాపు ఎనిమిది కోట్లకు పైగా ఉంది. హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. ప్రపంచవ్యాప్తంగా పదికోట్ల మంది మాతృభాష తెలుగే. ప్రాంతీయ భాషల్లో మొదటిస్థానం, ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషలలో 15వ స్థానంలో తెలుగు ఉంది. అతి ప్రాచీనమైన భాషల్లో సంస్కృతంతో తెలుగును కేంద్రప్రభుత్వం గుర్తించింది.
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలుగుభాషలోని పదాలు ఇటాలియన్ భాష మాదిరిగా ఉండటం ఇందుకు కారణం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవదాయులచేత కొనియాడబడిన భాష తెలుగు.
ప్రాచీన కాలంలోనే కాదు నేటి ఆధునిక కాలంలోనూ ఎంతో గొప్పసాహిత్యం తెలుగు భాష సొంతం. ఛందస్సు, పద్యాలు, వచన కవితలు, నాటికలు, జానపదాలు, నానీలు, హైకులు సాహిత్యంలో పలు ప్రక్రియల్లో తెలుగుభాషలోని అక్షరమాల పొందికగా వొదిగిపోతుంది.
విదేశాల్లో తెలుగు వైభవం..
తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్లమాధ్యమంలో చదువులు కొనసాగించాలని ప్రభుత్వాలు ఆలోచిస్తుంటే విదేశాల్లో తెలుగువారు మాత్రం తమ పిల్లలకు వేమనశతకాల నుంచి భగవద్గీతశ్లోకాల వరకు నేర్పిస్తున్నారు. అమ్మా అన్న పిలుపులోని కమ్మదనాన్ని తెలుగుగడ్డపై మరిచిపోయి.. మమ్మీగా మారినా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లో స్థిరపడిన తెలుగువారు మాత్రం తమ మాతృభాషపై మమకారాన్ని వీడలేదు. అంతర్జాతీయ వేదికలపై తెలుగుభాషలో వెబ్ నార్లు నిర్వహిస్తూ అనేక సంస్థలు తెలుగుభాషను బతికిస్తున్నాయి.