భారత్ ఫ్యూచర్ సిటీ..మారనున్న తెలంగాణ దశ
posted on Dec 7, 2025 @ 9:33AM
భారత్ ఫ్యూచర్ సిటీ.. రాబోయే టెక్నాలజీకి, ఆర్థికాభివృద్ధికి, అంతర్జాతీయ సహకారాన్ని సూచించే ఓ మహానగరానికి ఇప్పుడిదో ఆనవాలు. ఇక్కడ జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వల్ల.. హైదరాబాద్ భవిష్యత్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం దశ కూడా మారుతుందనే చర్చ దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇప్పుడు.. తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్.. ఇండియాలో రీసౌండ్‌లో వినిపిస్తోంది.
దేశ, విదేశాల ఫోకస్ కూడా భారత్ ఫ్యూచర్ సిటీ మీదే ఉంది. ఒకప్పుడు రాళ్లు, రప్పలు తప్ప ఏమీలేని ప్రాంతం.. ఇప్పుడు ఈ ప్రపంచం నలుమూలల్లోని..ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడులను పట్టుకొచ్చే కోటగా మారింది. అదే ప్రాంతం.. భవిష్యత్ తరాలకు భరోసాగా నిలవబోతోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కారణంగా.. ఫ్యూచర్ సిటీ రూపురేఖలు మారాయ్.
ఈ సదస్సు జరిగిన తర్వాత.. తెలంగాణ కథే మారబోతోంది. ఎందుకంటే.. భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ దశని మార్చే ఓ గ్లోబల్ రెవల్యూషన్‌గా కనిపిస్తోందిప్పుడు! అద్భుతమైన మౌలిక సదుపాయాలు, రాబోయే అత్యాధునిక టెక్నాలజీ హబ్‌లతో.. ప్రపంచ స్థాయి వేదికగా రూపాంతరం చెందనుంది. భారత్ ఫ్యూచర్ సిటీ.. ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక విప్లవానికి కేంద్రం కాబోతోంది.
ఇక్కడ రేవంత్ సర్కార్ నిర్వహించబోతున్న ప్రతిష్ఠాత్మకమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు.. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈవోలు, వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, టెక్నాలజీ దిగ్గజాలు.. ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గ్లోబల్ సమ్మిట్‌తో.. తెలంగాణ ఊహించని స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను అందుకోబోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఈ ఆర్థిక సదస్సులో పాల్గొనే మల్టీ నేషనల్ కంపెనీలు.. తమ కార్యకలాపాలు విస్తరించడానికి, కొత్తగా స్థాపించడానికి వేల కోట్ల రూపాయలు.. పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
ఈ ఇన్వెస్ట్‌మెంట్లే.. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి వెన్నుగా నిలుస్తాయ్. భారీ పెట్టుబడులతో.. రాబోయే కొన్నేళ్లలో.. వేలాది కొత్త ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా.. ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఫైనాన్స్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు.. ప్యూచర్ సిటీలో గోల్డెన్ ఫ్యూచర్ ఉంది. ఈ సమ్మిట్ సక్సెస్ అయిన తర్వాత.. దిగ్గజ కంపెనీల గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లు ఇక్కడ ఏర్పాటైతే.. ఐటీ, స్టార్టప్ రంగాల్లో.. భారత్‌లోని ఇతర మెట్రో నగరాలకు.. హైదరాబాద్ గట్టి పోటీనిస్తుంది. ఇంటర్నేషనల్ రేంజ్‌లో టెక్ హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది.
భారత్ ఫ్యూచర్ సిటీలో.. 5జీ, 6జీ రెడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లు, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ లాంటి సౌకర్యాలు రాబోతున్నాయ్. ఇక.. పూర్తిగా సోలార్ ఎనర్జీ సప్లై, వ్యర్థాల నిర్వహణకు అధునాతన పద్ధతులు, జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్స్ లాంటివి.. హైలైట్‌గా నిలుస్తున్నాయ్. కొత్త స్టార్టప్‌లని ప్రోత్సహించేందుకు.. ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆఫీసులు కూడా వస్తాయ్. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉండటంతో.. గ్లోబల్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది.
భారత్ ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్.. కేవలం ఐటీ సెక్టార్‌కే పరిమితం కాదు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మీర్‌పేట, ముచ్చర్ల, శ్రీశైలం హైవే ప్రాంతాల్లో.. రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్ ఎస్టే విలువలు ఒక్కసారిగా పెరగనున్నాయ్. విదేశీ ప్రతినిధులు, ఉద్యోగుల రాకతో.. హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్ల డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు.. ఈ రంగంలో కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయ్. ఈ ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా.. యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకు.. కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు కూడా వస్తాయ్. ఇప్పటికే.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.
ఎక్కడా నిర్వహణ లోపం తలెత్తకుండా ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణని 2047 నాటికి.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో.. ప్రభుత్వం తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్‌కు తుదిమెరుగులు దిద్దుతోంది. మరోవైపు సదస్సులో పాల్గొనే వక్తలు, హాజరయ్యే ప్రతినిధుల లిస్ట్ కూడా రెడీ అయింది. తెలంగాణ సర్కార్ కమిట్‌మెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపు, పటిష్టమైన ప్రణాళికతో.. భారత్ ఫ్యూచర్ సిటీ.. తెలంగాణకు ఓ గేమ్ ఛేంజర్ కాబోతోంది. మీర్‌పేటలోని ఈ మారుమూల ప్రాంతం... ఇప్పుడు యావత్ భారతదేశానికి ఆదర్శంగా, ప్రపంచానికి తెలంగాణ శక్తిని చాటిచెప్పే వేదికగా మారనుంది.