కేసీఆర్ అందుకే మోడీని పొగుడుతున్నారా?
posted on Feb 19, 2015 @ 10:32AM
ఇంతకు ముందు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు సాధించుకు రాకుండా అహంభావం ప్రదర్శిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించేవి. కానీ ఇప్పుడు అవే ప్రతిపక్షాలు ఆయన తన కుమార్తె కవితకు కేంద్రమంత్రి పదవి ఇప్పించుకొనేందుకే డిల్లీకి వెళ్లి మోడీతో భేటీ అయ్యేరని, అందుకే ఆయన ఇప్పుడు మోడీని, ఆయన ప్రభుత్వాన్ని, పధకాలను కూడా తెగ మెచ్చేసుకొంటున్నారని విమర్శిస్తున్నాయి.
ప్రతిపక్షాల ఆరోపణలను తెరాస ఖండించింది. కానీ ఈ విషయంలో బీజేపీ కొంచెం ఆలస్యంగా స్పందించడంతో ఆ ఆరోపణలకు బలం చేకూరింది. ఈ అంశంపై మీడియాలో వస్తున్న వార్తలు, విశ్లేషణలు, చర్చలు కూడా వారి ఆరోపణలకు మరింత బలం చేకూర్చాయి. తెరాస-బీజేపీలు దగ్గరవుతున్నాయని మీడియాలో వస్తున్న వార్తలు తెదేపాకు చాలా ఆందోళన కలిగించేవే. కానీ ఆ పార్టీ ఈ విషయంలో చాలా సంయమనంగా వ్యవహరించి దానిని మరింత పెద్ద సమస్య కాకుండా నివారించగలిగింది. ఆ తరువాతే తెలంగాణా బీజేపీ నేతలు కూడా మేల్కొని ఈ వార్తలను గట్టిగా ఖండించడం మొదలుపెట్టారు.
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెరాసను మా ఎన్డీయే కూటమిలో చేర్చుకొనే ఆలోచన ఏమీ లేదు. అలాగే ఆ పార్టీ యంపీలను ఎవరినీ మా ప్రభుత్వంలో చేర్చుకొనే ఆలోచన కూడా మాకు లేదు,” అని విస్పష్టంగా ప్రకటించారు. కానీ తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వేరేలా చెప్పారు. “ఎన్డీయేలో చేరి కేంద్రమంత్రి పదవి పొందేందుకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని” అన్నారు.
అంటే అటువంటి ప్రయత్నాలు జరిగినట్లే అర్ధమవుతోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెరాసతో జత కట్టడం వలన బీజేపీకి ఒరిగేదేమీ ఉండబోదు, పైగా తెదేపాతో దాని సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ తెరాస మాత్రం దాని వలన పూర్తి లబ్దిపొందగలదని ఖచ్చితంగా చెప్పవచ్చును. కనుక ఒకవేళ బీజేపీ కూడా అటువంటి ఆలోచన చేసినా ప్రస్తుతానికి విరమించుకొని ఉండవచ్చును. కానీ భవిష్యత్తులో ఆ ఆలోచనచేసే అవకాశం ఉందని జరుతున్న ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక తెదేపా కూడా అందుకు మానసికంగా, రాజకీయంగా సంసిద్దమవ్వవలసి ఉంటుంది.
అయితే సమయం కాని సమయంలో ఇటువంటి పరిణామాలు జరగడం, వార్తలు వెలువడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణాలో బలపడాలని ప్రయత్నిస్తున్న తెదేపా నేతలను, కార్యకర్తల మనోస్తయిర్యాన్ని దెబ్బతీసి వారి ప్రయత్నాలను అడ్డుకోనేందుకే కేసీఆర్ ఈవిధమయిన ఎత్తు వేసారా? అందుకే ఆయన మోడీకి దగ్గరవుతున్నట్లు నటిస్తున్నారా? అందుకే ఆయన మోడీని పొగడం మొదలుపెట్టారా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు.
ఏదో ఒక ఉద్దేశ్యంతోనొ లేక కారణం చేతనో ఈరోజు మోడీని పొగుడుతున్న కేసీఆర్, రేపు రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోయినా లేదా వివిధ ప్రాజెక్టుల గురించి తను చేసిన డిమాండ్లను కేంద్రం పట్టించుకోకపోయినా, మళ్ళీ అదే నోటితో మోడీకి శాపనార్ధాలు పెట్టినా ఆశ్చర్యం లేదని ఆయన తీరుని నిశితంగా గమనిస్తున్న వారికి తెలుసు. ఏది ఏమయినప్పటికీ ఈ పరిణాలను తెదేపా ఒక హెచ్చరికగా స్వీకరించి తన జాగ్రత్తలో తాను ఉండటమే మంచిదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.