రామోజీ ఫిలిం సిటీలో ఏమి జరుగుతోంది?
posted on Oct 21, 2015 @ 2:05PM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అకస్మాత్తుగా ఈనాడు మీడియా సంస్థల అధినేతకు ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఆయనకు బద్ధ విరోధులు అనుకొన్న వాళ్ళు అందరూ వరుసగా ఆయన ఇంటి ముందు క్యూ కట్టి మరీ ఆయన దర్శనాలు చేసుకొంటున్నారు. తెరాస పార్టీ అధికారంలోకి వస్తే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లను పెట్టి దున్నించేసి చదును చేసేస్తానని శపధాలు చేసిన కేసీఆర్, ముఖ్యమంత్రి అయిన తరువాత స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ దర్శనం చేసుకొని వచ్చేరు. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో రామోజీరావుకి వ్యతిరేకంగా పుంఖానుపుఖాలుగా ప్రచురింపబడిన కధనాలు, కార్టూన్ల గురించి అందరికీ తెలుసు. కానీ కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి కూడా అకస్మాత్తుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ దర్శనం చేసుకొని వచ్చేరు.
ఆ తరువాత మొన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుకి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించి వచ్చేరు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చినట్లుందిపుడు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, తెలంగాణా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రామోజీ ఫిలిం సిటీకి నిన్న వెళ్లి రామోజీరావు దర్శనం చేసుకొని వచ్చేరు.
ఈ సమావేశాలలో కామన్ గా కనిపిస్తున్న వ్యక్తి రామోజీరావు అయితే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్ ముగ్గురూ చంద్రబాబు నాయుడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారే కావడం గమనార్హం. అంటే రామోజీరావు తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులన్నిటినీ అనుసంధాన పరుస్తున్నారా...?అనే అనుమానం కలుగుతోంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుని అధికారంలోకి వచ్చేందుకు రామోజీరావు ఈవిధంగానే చాలా మందిని అనుసంధానం చేశారని గుర్తుకు తెచ్చుకొంటే ఈ అనుమానం నిజమేననిపిస్తుంది.
మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపాలు మళ్ళీ దగ్గరవుతున్న సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయిప్పుడు. రాహుల్ గాంధీ సూచన మేరకు జగన్ ప్రత్యేక హోదాపై పోరాటాలు మొదలుపెట్టడం, దాని కోసం జగన్ నిరాహార దీక్ష చేస్తే ఆయనకి దిగ్విజయ్ సింగ్ మద్దతు ప్రకటించడం, వైకాపాతో కలిసి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక పోరాటాలు చేయడానికి సిద్దమని ఆయన ప్రకటించడం, అమరాతి శంఖుస్థాపన కార్యక్రమాన్ని జగన్ ‘బాయ్ కాట్’ చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత కాంగ్రెస్ పార్టీ కూడా బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించడం వంటివన్నీ అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.
జగన్ నిరాహార దీక్షకు కూర్చొనే ముందు రామోజీరావుతో తనకున్న శత్రుత్వాన్ని పక్కనబెట్టి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ దర్శనం చేసుకొని వచ్చేరు. ఆయన దీక్షకి, పోరాతలకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు ఫిలిం సిటీకి వెళ్లి రామోజీని కలవడం చూస్తుంటే రామోజీ ఫిలిం సిటీలో మామూలు సినిమాలే కాకుండా ఏదో సరికొత్త రాజకీయ సినిమాకి స్క్రీన్ ప్లే సిద్దం అవుతున్నట్లు అనుమానం కలుగుతోంది. అదే నిజమయితే ఈ కొత్త సినిమా 2018ఎన్నికలకి సిద్దం అవుతుందేమో.. లేకపోతే జగన్ జోశ్యం చెపుతున్నట్లుగా ఇంకా ముందే రిలీజ్ అవుతుందేమో?