కొత్త జిల్లాల ప్రతిపాదనని తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ పక్కన పెట్టిందా?
posted on Sep 12, 2015 @ 10:29AM
తెలంగాణా రాష్ట్రంలో 10 జిల్లాలను పునర్విభజించి కొత్తగా మరో 10-15 జిల్లాలు ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ఎన్నికల సమయంలో చాలా సార్లు చెప్పారు. తెరాస అధికారంలోకి రాగానే ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు చేసారు. కానీ కొత్త జిల్లాల ఏర్పాటులో ఊహించని అనేక సమస్యలు ఎదురవడంతో ఆ ప్రతిపాదనని పక్కనబెట్టేశారు. కానీ కొన్ని రోజుల క్రితం మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ప్రస్తావించి, దాని కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించారు. వారు ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించగానే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడతామని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం మళ్ళీ ఆ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
కొన్ని జిల్లా కేంద్రాలను, జిల్లాలో ముఖ్య పట్టణాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తెరాసలోనే వ్యతిరేకత ఎదురయినట్లు తెలుస్తోంది. ముందు నియోజక వర్గాలను పునర్విభజించిన తరువాతనే కొత్త జిల్లాల ఏర్పాటు గురించి ఆలోచించమని తెరాస నేతలే సూచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగినట్లయితే పరిపాలన వికేంద్రీకరణ జరిగి జిల్లాల పాలన చాలా సౌకర్యంగా ఉంటుంది. కానీ సదరు జిల్లాలలో పాతుకుపోయున్న రాజకీయ నాయకులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. తమకు బాగా పట్టున ప్రాంతాలు వేరే జిల్లాలోకి వెళ్ళిపోతే, జిల్లాలో మళ్ళీ తమ స్థానం సుస్థిరం చేసుకొనే వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. తేడా వస్తే అది వారి రాజకీయ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపవచ్చును. అందుకే అన్ని పార్టీల నేతలు కొత్త జిల్లాల ప్రతిపాదనను అంగీకరించలేకపోతున్నారు. ఇక రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు కొత్త జిల్లాల ఏర్పాటుకి అనేక ప్రతిపాదనలు చేస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం అసంభవం. కనుక తెలంగాణా ప్రభుత్వం ఈ ప్రతిపాదనని మళ్ళీ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తరువాత అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకొన్న తరువాత కొత్త జిల్లాల ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రతీసారి హడావుడిగా ఏదో ఒక నిర్ణయం ప్రకటించడం, సమస్యలు ఎదురయిన తరువాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా మారిపోయింది. రాజకీయ శత్రుత్వం కారణంగా ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించవని భావిస్తున్నట్లయితే ఆయా రంగాలలో నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకొన్నా ఇటువంటి పరిస్థితి తలెత్తేది కాదు. ఒకేసారి అన్ని జిల్లాలను పునర్విభజించాలని ప్రయత్నం చేయడం కంటే ముందుగా ఏదో ఒక జిల్లాను ఎంచుకొని దానిని పునర్విభజించడానికి ప్రయత్నిస్తే దానిలో కష్ట నష్టాలు అర్ధం అవుతాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ తొందరపడలేదు. ముందుగా రాజధాని అమరావతిని కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి విడదీసి కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణా ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తే మంచిదేమో!