అద్దాల మేడలో కూర్చొని రాళ్ళు విసిరితే...
posted on Jun 13, 2015 @ 10:08AM
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా ఆయన ప్రభుత్వంలో చాలమంది మంత్రులు ఓటుకు నోటు కేసు పట్ల తమకు ఎటువంటి ఆసక్తి, తీరికా లేవని ఒకపక్క చెపుతూనే మరోపక్క ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు...ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఇరుక్కోబోతున్నారు......ఆధారాలు చాలా ఉన్నాయి... ముందుంది ముసళ్ళ పండగ...అంటూ మాట్లాడటం గమనిస్తే వారి ఉద్దేశ్యం ఏమిటో స్పష్టమవుతోంది. కనుక ఒకవేళ ఈవిషయంలో కేంద్రం జోక్యం చేసుకొనకపోతే తెలంగాణా ప్రభుత్వం తన పధకం ప్రకారమే ముందుకు సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ కేసులో రేవంత్ రెడ్డితో సహా మిగిలిన ఇద్దరినీ కూడా ఎసిబి ప్రశ్నించడం పూర్తయింది. రేవంత్ రెడ్డిపై పిర్యాదు చేసిన నామినేటడ్ యంయల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ వాగ్మూలం తీసుకొని తదుపరి చర్యలకు ఎసిబి ఉపక్రమించవచ్చును. అదే జరిగితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేయవచ్చును. అప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య మరింత ఘర్షణ జరిగి అది వాంచనీయమయిన సంఘటనలకు లేదా రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. కనుక ఇంతవరకు జరిగిన పరిణామాలన్నీ ఒక ఎత్తయితే ఇక ముందు జరుగబోయే పరిణామాలు మరొక ఎత్తుగా భావించవచ్చును.
ఈ వ్యవహారం గురించి చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులను పిర్యాదు చేసారు. గవర్నర్ కూడా దీనిపై తన నివేదిక కేంద్రానికి సమర్పించారు. ఈ వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన కూడా చాలా హడావుడిగా డిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పిర్యాదు చేయడం తెదేపా చేస్తున్న ఆరోపణలను నిజమని రుజువు చేస్తున్నట్లుంది. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రినే అరెస్ట్ చేయాలని భావిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఇంతవరకు ఆ విషయం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనుకోలేదు. హైదరాబాద్ పై సర్వాధికారాలు ఉన్న గవర్నర్ కి కూడా ఆ విషయం తెలియకుండా మొత్తం వ్యవహారం చాలా గుట్టుగా నడిపించారు. ఒకవేళ ఆ విషయం ముందుగా గవర్నర్ కి తెలిపి ఆయన అనుమతి తీసుకొని ఉండి ఉంటే, ఆ సంగతి ఆయనైనా కేంద్రానికి తెలియజేసి ఉండాలి. కానీ టీవీలలో ఈ సంచలన వార్త బయటపడేవరకు గవర్నర్ కి కూడా ఆ విషయం గురించి తెలియదంటే చాలా ఆశ్చర్యమే!
ఇంత జరిగిన తరువాతయినా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి తదుపరి చర్యలకు ఉపక్రమించి ఉండి ఉంటే అప్పుడు ఎవరూ అనుమానించేవారు కాదు. కానీ ఇంత జరిగినా, ఇంకా చాలా జరుగబోతున్నా కూడా కేసీఆర్ నేటికీ కేంద్రానికి తెలియజేసి దాని అనుమతి తీసుకోవాలనుకాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రప్రభుత్వానికి తెలియజేయకుండా పొరుగు రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేందుకు దోహదపడే ప్రమాదకరమయిన నిర్ణయాలు తీసుకొనేందుకు కేసీఆర్ సిద్దపడటం చూస్తుంటే ఆయన కేంద్రాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను కూడా ఖాతరు చేస్తున్నట్లు లేదు. ఇటువంటి ఆలోచనలు, పోకడలు అన్నీ కేవలం రాజరికవ్యవస్థలలో మాత్రమే కనబడతాయి తప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలలో తావు లేదు. బహుశః ఆ సంగతి ఆయన అనుభవపూర్వకంగానే తెలుసుకొంటారేమో?
ఇంతవరకు జరిగిన సంఘటనల గురించి గవర్నర్ తెలుసుకో(లే)కపోవడం తప్పేనని చెప్పవచ్చును. కానీ ఇకపై జరుగబోయే సంఘటనల గురించయినా తెలంగాణా ప్రభుత్వం నుండి పూర్తి సమాచారం రప్పించుకొని, వాటి గురించి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, ఎటువంటి విపరీత పరిణామాలు ఏర్పడకుండా గవర్నర్ తగు చర్యలు చేప్పట్టవలసి ఉంటుంది. లేకుంటే అది ఆయన వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది. ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో నిన్న సమావేశం కావడం గమనిస్తే, తెలంగాణా ప్రభుత్వం తన పధకం ప్రకారం ముందుకే సాగేందుకు నిశ్చయించుకొన్నందున, హైదరాబాద్ జంట నగరాలలో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు అనుమానం కలుగుతోంది.
ఈ వ్యవహారం ఆ రెండు పార్టీలకు, వ్యక్తులకు మధ్య ఉన్న రాజకీయ వైషమ్యాల కారణంగా జరుగుతున్నదే అయినా తెలంగాణా ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల వలన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజల మధ్య ఎన్నటికీ పూడ్చలేని ఒక అగాదం సృష్టించడం తధ్యం. తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్నంత కాలమే తెలంగాణాలో తెరాస ఎదురులేకుండా నిలబడగలుగుతుంది. అది పోయిన మరుక్షణం తెదేపాతో సహా అన్ని ఇతర పార్టీలకు సమాన అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ తెలంగాణా సెంటిమెంటును మళ్ళీ బలపరిచేందుకే దోహదపదేవిగా ఉన్నాయని చెప్పవచ్చును. ఈ వ్యవహారంలో తెదేపా నేతలు తమ తెరాస ప్రభుత్వంపై ఎంతగా ఎదురు దాడిచేస్తే దాని వలన వారిపట్ల తెలంగాణా ప్రజలలో మరింత వ్యతిరేకత పెరుగుతుందనే ఆలోచన ఇందులో ఇమిడి ఉన్నట్లు కనబడుతోంది. బహుశః అందుకే కేసీఆర్ ఇంత రిస్క్ తీసుకొంటున్నారేమోననే అనుమానాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ పార్టీలు, వాటి నేతలు అందరూ కూడా అద్దాల మేడలో కూర్చొన్నట్టి వాళ్ళే! ఈ చిన్న సంగతి గ్రహించకుండా అవకాశం దొరికింది కదాని ఇతరుల మీద రాళ్ళు విసిరి ఆనందిద్దామనుకొంటే ఆ ఆనందం తాత్కాలికమే అవుతుంది. ఏదో ఒకనాడు తమ అద్దాలమేడ మీది ఎదుటవాళ్ళు కూడా రాళ్ళు విసిరే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తే ఇటువంటి సాహసాలు చేయబోరు.