తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు పండగ
posted on Feb 6, 2015 7:39AM
తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక బోనస్, ఇంక్రిమెంట్లు, హెల్త్ కార్డులు, వేతన సవరణ అన్నీ ఇస్తానని ఆనాడు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. వారికి ఇచ్చిన మాటను నిలుపుకొంటూ ఆయన ఒక్కొకటి వరుసగా అమలుచేసి చూపిస్తున్నారు. నిన్న సాయంత్రం సచివాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఏకంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించి వారినందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు.
సాధారణంగా వేతన సవరణ అనగానే ఉద్యోగ సంఘాలకి, ప్రభుత్వానికి మధ్య పీచుబేరాలు, అలకలు, బుజ్జగింపులు వంటివి తప్పవు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఉద్యోగులు ఊహించిన, ఆశించిన దానికంటే ఎక్కువగా 43 శాతం ఫిట్‌మెంట్ మంజూరు చేయడంతో ఉద్యోగుల ఆనందానికి అంతులేదు. ఈ వేతన సవరణ తెలంగాణా రాష్ట్ర ఆవిర్భవించిన నాటి నుండి అంటే 2014 జూన్ 2వ తేదీ నుండే అమలు చేయబోతున్నట్లు ప్రకటించి కేసీఆర్ ఉద్యోగులకు మరింత సంతోషం కలిగించారు. ఇంతవరకు 9 పీఆర్సీలు అమలు చేసినా వాటిలో ఏ ఒక్కటికీ కూడా ఇంత సంతృప్తికరంగా లేదని కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఈ పదవ పీఆర్సీ తమకు చాలా ఆనందం కలిగించిందని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు.
ఫిబ్రవరి వరకు ఉన్న బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేసి, ఈ నెల జీతం నుండి పెంచిన జీతాలు తెలంగాణా ప్రభుత్వం చెల్లించబోతోంది. ఈ పెంపు వలన ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.6500 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని కేసీఆర్ తెలిపారు. కానీ ప్రభుత్వం ఆ మాత్రం భారం భరించగల పరిస్తితిలోనే ఉందని తెలిపారు. తెలంగాణా ప్రభుత్వానికి ఆర్ధికంగా కొంత వెసులుబాటు ఉంది కనుక ఇది పెద్ద భారం కాబోదు. అటువంటప్పుడు వారిని నిరాశపరిచి వారి ఆగ్రహానికి గురయ్యే కంటే, ఈవిధంగా వారికి సంతృప్తి కలిగించే ఒక మంచి వేతన సవరణ ఇవ్వడం ద్వారా తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి చేసేందుకు వారి సహకారం కూడా పొందవచ్చునని కేసీఆర్ భావించిఉండవచ్చును. ఆయన ఊహించినట్లే వేతన సవరణ విషయం ప్రకటించగానే ఇకపై ఉద్యోగులు అందరూ రోజు ఒక గంట ఎక్కువసేపు పనిచేసి తెలంగాణా అభివృద్ధిలో పాలుపంచుకొంటామని ఉద్యోగసంఘాల నేతలు అక్కడికక్కడే ప్రకటించేరు.
అయితే ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లుగా ఆర్ధికంగా బలంగా ఉన్న తెలంగాణా ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రకటించిన 43 శాతం ఫిట్‌మెంట్ ప్రభావం తప్పకుండా ఆంధ్రా ఉద్యోగులపై కూడా పడవచ్చును. ఒకవేళ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు తమకు కూడా అటువంటి వేతన సవరణ ఇవ్వాలని పట్టుబట్టినట్లయితే, ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి వారిని సముదాయించడం చాలా కష్టం కావచ్చును.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 సం.ల నుండి 60 సం.లకి పెంచినప్పుడు కేసీఆర్ కూడా తెలంగాణా ఉద్యోగుల నుండి ఈవిధంగానే ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఆయన కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను క్రమబద్దీకరించినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన వేతన సవరణ వలన చంద్రబాబు నాయుడు తన ఉద్యోగుల నుండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవలసి రాచ్చును. ఒకవేళ అదే పరిస్థితి ఎదురయితే ఆయన వారిని ఏవిధంగా సముదాయిస్తారో వేచి చూడాలి.