రైతులకు ఆకర్షణగా మారుతున్న చంద్రబాబు?
posted on Oct 31, 2012 8:05AM
ఇప్పటి దాకా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీ కోసం వస్తున్నా పాదయాత్రలో చేసిన అన్ని ప్రసంగాల్లో ఒక్కోసారి ఒక్కొక్క వర్గాన్ని ఆకర్షించేలా ఉన్నాయని తేలింది. అయితే ఆయన తాజాగా చేసిన ప్రసంగం మాత్రం రైతుల మనస్సు గెలుచుకునేలా ఉందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు చంద్రబాబు రైతుల కోసం తాను చేసే తొలిసంతకం రుణమాఫీ అని ప్రకటించారు. ఇటీవల పరిణామాలను పరిశీలిస్తే ఈ రుణమాఫీ వల్లే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుబాంధవునిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన తరువాత రైతుల గురించి మాట్లాడిన నేతగా చంద్రబాబును గుర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మామూలు వరాలు గుప్పించటం సహజమే. కానీ, ప్రతిపక్షనేతగా ఉంటూ రైతులకు అవసరమైన రుణమాఫీ గురించి చంద్రబాబు ప్రస్తావించటం చెప్పుకోదగిన అంశమైంది. ఎందుకంటే రాష్ట్రప్రభుత్వం ఇటీవల కౌలుదారులకు రుణాలు ఇప్పిస్తామని ప్రకటించి బ్యాంకర్లు సహకరించకపోవటంతో కంగుతింటోంది. ఆశించిన స్థాయిలో రుణాల మంజూరు లేదు. ఇటువంటి దశలో చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే తొలిసంతకం రైతుల బ్యాంకు రుణాల మాఫీపైనే ఉంటుందన్నారు. దీని వల్ల పెట్టుబడి లేక అల్లాడుతున్న రైతులకు బాబు మాట ఊరటనిస్తోంది. పైగా, ఇప్పటి నుంచే రుణాలు కట్టొద్దని కూడా బాబు నొక్కి చెప్పారు.