చంద్రబాబు వరంగల్ పర్యటనతో తెరాసకి టెన్షన్ ఎందుకు?
posted on Feb 12, 2015 @ 11:25AM
తెలంగాణా రాష్ట్రంలో మరే ఇతర పార్టీ తనకు పోటీగా ఉండకూడదని, రాష్ట్రాన్ని ఏకచత్రాధిపత్యంగా తానే పరిపాలించుకోవాలనే తెరాస కోరిక పెద్ద రహస్యమేమీ కాదు. అందుకోసం ఒక్కో రాజకీయ పార్టీపై ఒక్కో ముద్ర లేదా ఏదో ఒక ఆరోపణ చేస్తూ ఆకారణంగా అవేవి తెలంగాణాలో అడుగుపెట్టే అర్హత కోల్పోయాని వాదిస్తుంటారు తెరాస నేతలు. వారు మాట్లాడుతున్న మాటలు వింటుంటే తెలంగాణా రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కాక రాజరిక పరిపాలన సాగుతోందా? అనే అనుమానం కలగడం సహజం.
ఈరోజు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లాలో తన పార్టీ నేతలతో కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు బయలుదేరుతుండటంతో, ఆయన ముందుగా తెలంగాణా రాష్ట్రానికి నీళ్ళు, విద్యుత్ పంపకాలపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేసిన తరువాతనే తెలంగాణాలో అడుగుపెట్టాలని తెరాస నేతలు వాదిస్తున్నారు. ఒకవేళ ఆయన నిజంగా నీళ్ళు విద్యుత్ విషయంలో తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని తెరాస నేతలు భావిస్తున్నట్లయితే, అదే విషయాన్నీ వారు తమ ప్రజలకు చెప్పుకొని ప్రజాస్వామ్యబద్దంగా తెదేపాను ఎన్నికలలో ఎదుర్కొని ఓడించవచ్చును. లేదా తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి వారిని తమవైపుకు త్రిప్పుకోవచ్చును. ఈవిధంగా ఆయనను నిలదీయడం ద్వారా తెదేపా, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలలో విముఖత కల్పించవచ్చనే అపోహలో తెరాస నేతలున్నట్లున్నారు. కానీ ఒకవిధంగా తెరాస నేతలే చంద్రబాబు నాయుడు పర్యటనకి తాము చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని చాటి చెప్పుకొంటున్నట్లుంది తప్ప తెదేపాను రాజకీయంగా ఎదుర్కొంటున్నట్లు లేదు.
చంద్రబాబు నాయుడు తెలంగాణా రాష్ట్రంలో పర్యటిస్తే ఏదో ఉపద్రవం వస్తున్నట్లుగా ఇంతగా భయపడిపోయి తెరాస నేతలు మూకుమ్మడిగా ఆయనపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన పర్యటనను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే, దాని వలన తెరాస నేతలు చాలా అభద్రతాభావంతో ఉన్నట్లుగా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి తప్ప వారు ఆశించిన ప్రయోజనం నెరవేరదు. వైకాపా నేత షర్మిల తెలంగాణాలో తమ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొనేందుకు పరామర్శయాత్రలు చేస్తుంటే అసలు పట్టించుకోని తెరాస నేతలు, చంద్రబాబు నాయుడు తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి వస్తుంటే ఇంత తీవ్రంగా స్పందించడం చూస్తుంటే అదే భావం కలుగుతోంది.
ప్రస్తుతం తెరాస పార్టీయే తెలంగాణాలో అధికారంలో ఉంది. మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో తెలంగాణా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపించినట్లయితే అప్పుడు ప్రజలు మళ్ళీ తెరాసకే పట్టం కడతారు. ఒకవేళ అది సాధ్యం కాదనుకొంటే తెరాస పార్టీని గ్రామస్థాయి నుండి పటిష్టపరుచుకోగలిగినా ఈవిధంగా ఇతర పార్టీలను చూసి అభద్రతాభావానికిలోను కావలసిన అవసరం ఉండదు. కానీ ఇతర రాజకీయ పార్టీలు ఏవీ తనకు పోటీ ఉండకపోతే తను అధికారం నిలుపుకోవచ్చనే భ్రమలో తెరాస ఉంటే అదే నష్టపోతుంది. ఎందుకంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదు కనుక.