బాబు మాట సిఎంకు మిర్చి మంట?
posted on Nov 2, 2012 9:02AM
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మాటలు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మిర్చి తిన్నంత మంటగా ఉంటున్నాయని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు. తాను చేస్తున్నది మీ కోసం వస్తున్నా పాదయాత్ర మాత్రమే కాదని అవినీతి వ్యతిరేక పోరాటమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. రాష్ట్రప్రభుత్వంపై ఆయన ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. తాను ధర్మపరిరక్షణ పోరాటం చేస్తున్నానని బాబు తెలిపారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్నీ భ్రష్టుపట్టించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి తిరోగమనంలో ఉందని విమర్శించారు. నగదుబదిలీ పేరిట పేదల పొట్టలు కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దపడిరదన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఎవరి ఆదాయం పెరగలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో లాలూచీ పడ్డ పార్టీలు తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. తనపై సిబిఐ దర్యాప్తు చేయించినా ఏమీ నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు.
అడ్డుగోలు ఆస్తులు సంపాదించుకునే వారికి జగన్ ఆదర్శం అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తక్కువ ఆదాయంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ కొనసాగిస్తోందన్నారు. ప్రజలు కష్టాలు పడుతుంటే హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడటం బాగోదనే తాను ఈ పాదయాత్ర చేపట్టానన్నారు. నగరాలతో సమానంగా గ్రామాల్లోనూ పరిశ్రమలను తేవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెస్ విస్మరించిందన్నారు.