ఆస్తులు కాపాడుకోడం కోసం బీజేపీలో చేరబోతున్నారా?

మొన్నటి వరకు సంచలనం సృష్టించిన విషయం కరకట్ట నిర్మాణాల తొలగింపు చర్యలు .కృష్ణా కరకట్ట నిర్మాణాల తొలగింపు విషయంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చ జరుగుతోంది. కరకట్ట మీద చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా వివిధ నిర్మాణాలకు గెస్ట్ హౌస్ లకు సీఆర్డీయే నోటీసులిచ్చింది. అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేశారని, వాటిని స్వచ్ఛంధంగా తొలగించాలని లేకుంటే తామే కూల్చివేతకు దిగాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఆ మేరకు డెడ్ లైన్ లతో గోడలకు నోటిస్ లను అంటించి హడావుడి చేసింది. ఓ నిర్మాణంలో నది లోపలికి చొచ్చుకుని వెళ్లి నిర్మించిన ర్యాంపును కూడా సీఆర్డీయే అధికారులు తొలగించారు.

దాంతో చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా మిగిలిన అక్రమ నిర్మాణాలను కూడా తొలగించేస్తారనే చర్చ జోరుగా సాగింది. ప్రభుత్వం సీఆర్డీఏ అధికారులు కూడా అదే ఊపులో ఉన్నట్టు కనిపించారు. అయితే తనను వేధిస్తున్నారని తన గెస్ట్ హౌస్ నిర్మాణం అంతా పద్ధతి గానే జరిగిందని అన్ని నిబంధనలు ఉన్నాయంటు లింగమనేని రమేష్ కోర్టుకెక్కారు. ఇది కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామం అయితే రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న పరిస్థితులను  ఏపీలో కరకట్ట కట్టడాల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం బీజేపీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు చేరారు. వీరిలో చెప్పుకోదగ్గ ముఖ్యులు ఉన్న వారి సంఖ్య తక్కువే అయినా ఇటీవల కాలంలో బీజేపీలో చేరిన వారి మీద శ్రద్ధ కొద్దిగా ఎక్కువ గానే వచ్చిందని చెప్పాలి.

దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ టిడిపి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ తెలుగుదేశాన్ని వీడి బీజేపీలో చేరారు. అలాగే ఏపీ నుంచి శనక్కాయల అరుణ కూడా పార్టీలో చేరారు. శనక్కాయల అరుణ కొంతకాలంగా టిడిపిలో యాక్టివ్ గా లేకున్నా సెడన్ గా బీజేపీలో చేరి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేశారు. వారితో పాటే ఇంకొంతమంది కూడా చేరి పోయారు. సందట్లో సడేమియా అన్నట్టుగా కరకట్టు మీదున్న నివాసాలకు చెందిన ఇద్దరు పెద్దలు బీజేపీలో చేరి పోయారు. పాతూరి నాగభూషణం అలాగే ఎస్ఆర్ఐ రామినేని బీజేపీ తీర్థం పుచ్చుకున్న బరిలో ఉన్నారు. ఇపుడిదే ఏపీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. కరకట్ట విఐపిలకు బిజెపి షెల్టర్ జోన్ గా మారినా, తమ నిర్మాణాలు కాపాడుకునేందుకు కర్కట్ట విఐపిలూ బిజెపిని ఆశ్రయిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. కరకట్టపై ఉన్న నివాసాలులో మాజీ ఎంపి బిజెపి సీనియర్ నేత గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ ఉంది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం కూడా అక్రమమేనని సీఆర్డీయే బాధిస్తోంది.

దీనికి సంబంధించిన చర్చ ఓవైౖపు జరుగుతూనే ఉండగా మరో ఇద్దరు కరకట్ట విఐపిలూ బీజేపీ పంచన చేరడం హాట్ టాపిగ్గా మారింది. దీంతో సదరు కరకట్ట పెద్దలు తమ తమ నిర్మాణాలను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. మొన్నటి వరకూ కరకట్టపై సింగిల్ స్థానానికి పరిమితమైన బిజెపి వీఐపీల సంఖ్య ఇప్పుడు మూడుకు చేరడం పై ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో వీరి నిర్మాణాల విషయంలో కానీ, మిగిలిన కరకట్ట నిర్మాణాల విషయంలో కానీ సర్కార్ వైఖరి ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. కరకట్ట నిర్మాణ విషయంలో మొన్నటి వరకు చూపిన దూకుడు ఇక పై కూడా చూపుతారా లేక ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సైలెంట్ అయిపోతారా అనేది ఆసక్తిగా మారింది. బీజేపీ విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం లేదు. కనీసం రాజకీయ పరమైన అవసరాల వల్ల కూడా కాకుండా ఇలా తమ ఆస్తులను కాపాడుకోవడానికి కమలం బాట పట్టడం చూసి ఆ సొంత పార్టీ నేతలకు ఎనలేని కోపంతో మండిపడుతున్నారు.

కేసీఆర్ భోజనాలు.. జగన్ గాలి తిరుగుళ్లు.. ప్రజాధనం దుబారాలో ఇద్దరూ ఇద్దరే!

ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే. ముందుగా తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు విషయానికి వస్తే.. ఆయన అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో అంటే 2014 నుంచి 2023 వరకూ  ప్రగతి భవన్ లో భోజనాలు, తినుబండారాల కోసం చేసిన ఖర్చు వెయ్యి కోట్లు. ఔను అక్షరాలా వెయ్యి కోట్లు. ఇది ఏదో కాకిలెక్క కాదు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ లో నిత్య సంతర్పణ అన్నట్లుగా ఉండేది పరిస్థితి అని దీని ద్వారా తెలుస్తోంది. నిత్యం మటన్, చికెన్, కౌజు పిట్టలు, కుందేలు మాంసం కూరలతో పాటు కోడి గుడ్లతో వైరైటీ వంటలతో విందులు చేసుకున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక  విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్న ఖరీదైన స్కాచ్ విస్కీ బాటిళ్లు కూడా ఇందులోకే వస్తాయి. విషయానికి వస్తే ప్రగతి భవన్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నిత్యం దాదాపు 50 మంది నిత్యం ఈ విందు భోజనాలకు హాజరయ్యేవారట. పెట్టేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఇబ్బంది లేదన్నట్లు ఇక్కడ వంట, వడ్డన సాగేదట.   ఏ ఫైవ్ స్టార్ హోట‌ల్ కీ తీసి పోని విధంగా ఇక్క‌డి  వంట‌లు ఎంతో రుచిక‌రంగా ఉండేవ‌ట‌.కేసీఆర్ తనతో ఉన్న అందరికీ ప్రతి రోజూ, ప్రతిపూటా రకరకాల నాన్ వెజ్ లతో ఇచ్చే ఈ విందు పెళ్లి దావత్ ను మించి ఉండేదంట. అంటే జనం సొమ్ముతో కేసీఆర్ తన, తన కుటుంబ సభ్యుల జిహ్వచాపల్యాన్ని తీర్చడమే కాకుండా, తనతో ఉన్న వారికీ విందు భోజనాలు పెట్టేవారన్న మాట. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమేంటంటే.. ఈ గ్రాండ్ విందు భోజనం కొందరికే.. ఇక సీఎం భద్రతా సింబ్బంది, పనివాళ్లకు మాత్రం శాఖాహార వంటలే వడ్డించేవారట. ఇది కూడా పెద్ద సారు ఆర్డర్ ప్రకారమేజరిగేదంట.  కేసీఆర్ కుటుంబసభ్యులతో పాటు బంధువులందరికి ప్రతిరోజు మాంసాహారం వంటలు తప్పనిసరి అన్న  ఆదేశాలుండేవ‌ట‌. కేవలం భోజనాల కోసమే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక‌ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టించారంటున్నారు పరిశీలకులు. మరో విషయం ఇప్పుడు చెప్పిన వెయ్యి కోట్ల లెక్క కేవలం ప్రగతి భవన్ విందు భోజనాలకిసంబంధించినది మాత్రమే. ఇది కాకుండా   ఎర్రవల్లి ఫాంహౌజ్ లెక్కలు ఇంకా బయటకు రావాల్సి ఉందని అంటున్నారు. ఇప్పుడు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో కేవలం ప్రయాణాలకే 222.85 కోట్ల ప్రజాధనం వెచ్చించారని ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. జ‌గ‌న్హయాంలో  విమాన ప్రయాణాల కోసం పెట్టిన ఖర్చు సైతం చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్- ఏపీఏసీఎల్  ద్వారా ఏకంగా రూ.222.85 కోట్లు వెచ్చించారని తాజాగా వెల్లడైన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలోనూ ఈ వ్యయం తగ్గకపోవడం గమనార్హం.జగన్ విమానయానం ఖర్చులు 2019-20- రూ.31.43 కోట్లుకాగా.. 2020-21- రూ.44 కోట్లు, 2021-22- రూ.49.45 కోట్లు, 2022-23- రూ.47.18 కోట్లు, 2023-24- రూ.50.81 కోట్లుగా చెబుతున్నాయి లెక్క‌లు. ఈ ఐదేళ్లలో జగన్ విమానాల చార్జీలు రూ.112.50 కోట్లు, హెలికాప్టర్ చార్జీలకు రూ.87.02 కోట్లు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద రూ.23.31 కోట్లు చెల్లించిన‌ట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హెలికాప్టర్ చార్జీల మొత్తాన్ని జీఎంఆర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెల్లించినట్లు వెల్ల‌డిస్తున్నాయి రికార్డులు. జ‌గ‌న్ ఐదేళ్ల కాలంలో గాలి మోటారు ఖ‌ర్చుల‌ను ఏకంగా 220 కోట్ల మేర పెట్ట‌గా ఈ ప‌ద్దెనిమిది  నెల‌ల కాలంలో లోకేష్ పెట్టిన ఖ‌ర్చు జీరో అంటూ తెలుగుదేశం  సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది.   అంతే కాదు.. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా మంత్రి నారా లోకేష్ 77 సార్లు హైద‌రాబాద్ ప్ర‌యా ణించ‌గా.. ఆ విమాన ఖ‌ర్చులు పూర్తి సొంతంగానే పెట్టార‌ని ప్ర‌భుత్వ ఖ‌జానాపై ఎలాంటి భారం ప‌డ‌లే ద‌ని తేలింది.ఇటు తెలంగాణ‌లో కేసీఆర్, అటు ఏపీలో జ‌గ‌న్ ఇరువురూ వారి వారి హ‌యాంలో ప్ర‌జ‌ల సొమ్ము ఎంత‌గా వృధా ఖ‌ర్చు రూపంలో వెచ్చిస్తున్నారో ఇవి మ‌చ్చుకు కొన్ని మాత్ర‌మేనంటున్నారు ఆర్టీఐ కార్య‌క‌ర్త‌లు. కేసీఆర్, జగన్ లు ప్రజాధనాన్ని దుబారా చేసిన తీరు చూస్తుంటే, తన సొమ్ము సోమవారం ముప్పొద్దుల తింటారు, మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అంటూ ఏదో సినిమాలో ఆరుద్ర రాసిన పాటలో పంక్తులు గుర్తుకు వస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. 

చెక్కు చెదరని స్నేహ బంధం!

పదవిలో ఉన్నవాళ్లు, మరీ ముఖ్యంగా దేశాధిపతులు ఏదైనా చేయగలరన డానికి తాజా ఉదాహరణ శుక్రవారం (డిసెంబర్ 5) భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన. సాక్షాత్తు రష్యా అధినేత బయలుదేరాడంటే "రాజు వెడలె,రవితేజములరరగా" అన్నట్లు వందిమాగధులు, రక్షకసముదాయం బయలుదేరుతారు ఆయన రక్షణకు ఐదంచల వ్యవస్థ ఉంటుంది.ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది  తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు. ఆయన పండ్ల రసాలు,మాంసాహారం తీసుకుంటారు. భద్రతకు సంబంధించి ఇంతటి జాగ్రత్తలు అగ్రరాజ్యాధినేత తరువాత రష్యా అధ్యక్షుడి విషయంలోనే ఉంటాయి.   రష్యా నుంచి భారత్  చమురు  కొనుగోలు చేస్తున్నందున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశంపై టారిఫ్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  .భారత్ వచ్చిన పుతిన్ భారత్,రష్యా మధ్య చమురు ఒప్పందానికి ఎలాంటి విఘాతం కలగదని హామీ ఇచ్చారు.అలాగే మరో ఐదేళ్లపాటు అమలులో ఉండే ఆర్ధిక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. పుతిన్ పర్యటన సందర్భంగా 11 ఒప్పందాలు జరిగాయి.  అలాగే రష్యా,భారత్ ఒప్పందాలపై చైనా హర్షం వ్యక్తం చేసింది. ఏకధృవ ప్రపంచంలో భారత్, రష్యా,చైనాల మైత్రి నిస్పందేహంగా అమెరికాకు కంటగింపే. .భారత్, చైనా,రష్యా ఒకటిగా ఉంటే అమెరికా జీరో అంటూ ఇప్పటికే చైనా వ్యాఖ్యానించింది కూడా.  .గతంలో కూడా ఈ మూడు దేశాలు ఇదే మాట ట్రంప్ కు పరోక్షంగా ఎరుకపరిచిన విషయం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి.  1992 లో సోవియట్ యూనియన్ పతనం అయ్యేవరకూ అమెరికాకు దీటుగా అన్ని విషయాల్లో రష్యా పోటీగా ఉండేది.  ప్రచ్ఛన్న యుద్ద కాలంలో  భారత్, రష్యాల మధ్య సహకారం తెలిసిందే.  సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత కూడా భారత్, రష్యాల మధ్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి.  ప్రధానంగా యుద్ధ పరికరాల సరఫరా  విషయంలో ఇరు దేశాల మధ్యా బంధం చెక్కు చెదరలేదు. . ఇటీవలి ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పీచమణచడంలో రష్యా ఆయుధాలు కీలక పాత్రపోషించాయి. రష్యా అధినేతగా  వాద్లిమిర్ పుతిన్ పాతికేళ్లకు పైగా అప్రతిహతంగా కొనసా గుతున్నారు. సోవియట్ పతనం తదననంతరం..  ప్రపంచ దేశాలలో రష్యా ప్రాధాన్యత, ప్రాముఖ్యతను  కొనసాగించడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు.   అన్ని రంగాల్లో అమెరికాకు దీటుగా రష్యాను నిలపడంలో కీలకంగా వ్యవహరించారు. దౌత్య వ్యవహారాలలో కూడా   కీలకంగా వ్యవహరిస్తున్నారు.  భారత్ కు చిరకాల,సాంప్రదాయ మిత్రుడు గా దాదాపు ఏడు దశాబ్దాలుగా రష్యా ఉంది.  పుతిన్,మోదీ భేటీ ఇదే తొలిసారి కాదు.   వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న   మోదీ అప్పట్లో పుతిన్ తో భేటీ అయ్యారు.అప్పటి నుంచి వారి మైత్రి కొనసాగుతునే ఉంది.  భారత్, రష్యాల స్నేహ బంధం కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. 

మోడీ దౌత్య రీతి.. ట్రంప్ ఉక్కిరి బిక్కిరి!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన నిస్సందేహంగా మోడీ దౌత్య విజయంలో ఒకటిగా చెప్పవచ్చు. రష్యా అధ్యక్షుడి భారత పర్యటన అనగానే ఉక్రోషంతోనో, ఆందోళన వల్లో తెలియదు కానీ.. అమెరికా అధ్యక్షుడు కంగారు పడుతున్నారు.  పుతిన్ భారత పర్యటన ఈ సమయంలో అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  రష్యా నుంచి భారత్‌  తన అభీష్ఠానికీ, ఆదేశాలకూ విరుద్ధంగా చమురు దిగుమతి చేసుకుంటున్నదన్న ఒకే ఒక్క కారణంతో ట్రంప్ భారత్ పై టాక్స్ వార్.. సుంకాల యుద్ధానికి దిగారు. అయితే అది బూమరాంగ్ అయ్యింది.   భారతీయులను అమెరికాకు రాకుండా చేసేందుకు వీసా నిబంధనలు కఠినతరం చేశారు. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని కంపెనీలను ఆదేశించారు. వీసా ఫీజును భారీగా పెంచారు. ఇవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా.. అమెరికా పెద్దన్న పాత్రకే ఎసరు పెట్టేలా మారాయి. రష్యా, చైనాలతో భారత దోస్తీ గట్టిపడింది.     పుతిన్‌ భారత పర్యటనలో భాగంగా  కుదిరే అవకాశం ఉన్న ఒప్పందాల కారణంగా అమెరికా మరిన్ని ఆర్థిక చిక్కుల్లో పడే అవాకశం ఉంది.   ట్రంప్‌ రష్యా చమురు దిగుమతిని ఆపమని భారత్ ను ఆదేశిస్తే.. అది కొనసాగిస్తూనే ఇప్పుడు తాజాగా రష్యాతో  ఆయుధ కొనుగోళ్లఒప్పందానికి రెడీ అయ్యింది.   ఇది కచ్చితంగా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడంగానే భావించాల్సి ఉంటుంది. దీనికి ప్రతిగా మళ్లీ సుంకాలతో, విసాలపై మరిన్ని కఠిన ఆంక్షలతో ట్రంప్ విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే వాటిని లెక్కచేయడానికీ, అమెరికా హెచ్చరికలు, ఆంక్షలకుభయపడే పరిస్థితి నుంచి భారత్ ఎప్పుడో బయటపడింది. ఇదంతా మోడీ దౌత్య  విధానాల కారణంగానే సాధ్యమైందన్నది అంతర్జాతీయ సమాజం చెబుతున్నమాట.  మొత్తంగా ట్రంప్ అరాచక, అహేతుక విధానాలనుంచి భారత్ ను బయటపడేయడమే కాకుండా.. ఏక ధృవ ప్రపంచం అన్న భ్రాంతి నుంచి ట్రంప్ బయటపడక తప్పని పరిస్థితిని క్రియోట్ చేసే దిశగా ప్రధాని మోడీ దౌత్యపరంగా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

దేవతలారా దీవించండి!

ఈ మధ్య కాలంలో   దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా?  అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో   చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.  బేసిగ్గా రేవంత్ రెడ్డికి ఆంజనేయస్వామివారంటే చాలాచాలా భక్తి. ఆయన సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఒక పురాతన ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో పూజ చేసి మరీ తన నామినేషన్  వేయడం ఆయనకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు, ఆచారం.  ఇప్పటికీ ఆ సెంటిమెంటు కొనసాగుతూనే ఉంది. అలాంటి రేవంత్ రెడ్డి పొరబాటున వివిధ విభాగాల అధిదేవతలైన హిందూ దేవతలకూ, కాంగ్రెస్ లోని మల్టిపుల్ లీడర్షిప్ కి  పోలిక తెస్తూ వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మచారులకు, పెళ్లయిన వారికి, ఇద్దరు భార్యలు కలవారికీ.. ఇలా హిందూ సంప్రదాయంలో  దేవుళ్లు ఉన్నారని రేవంత్ అన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెరలేపాయి. ముఖ్యంగా హిందూ వాదులు బీజేపీ లీడర్లు రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు.   ఇలా ఈ ఒక్క అంశం మాత్రమే కాదు పలు అంశాల్లో  కాషాయవాదులు, కమలనాథులు  పెద్ద ఎత్తున తీవ్ర నిరసనలు, అభ్యంతరాలు తెలియ చేస్తున్నారు. ఇంతకు ముందు శివజ్యోతి అనే  యాంకర్ వెంకన్న సన్నిథిలో తాము రిచ్చెస్ట్ బిచ్చగాళ్లమంటూ చేసిన వ్యాఖ్యలతో భారీ స్థాయిలో ట్రోలింగ్ కి గురయ్యారామె. ఇక ఒక స్వామి మాల వేసిన ఎస్సై వివాదం సంగతి సరే సరి. ఈ విషయంపై బీజేవైఎం నాయకులు ఏకంగా డీజీపీ ఆఫీసునే ముట్టడించి నానా యాగీ చేశారు. డిపార్టుమెంటుగానీ ఆయనకిచ్చిన మెమో వెనక్కు తీస్కోకుంటే మా తడాఖా చూస్తారంటూ హెచ్చరికలు జారీ చేశారు.  అలాగే దర్శక ధీరుడు రాజమౌళి  తనకు దేవుడిపై నమ్మకాలు లేవని అనడం కూడా పెద్ద రాద్ధాంతమై  కూర్చుకుంది. మాధవీ లత, చికోటి ప్రవీణ్ తో సహా అందరూ రాజమౌళిపై విరుచుకుపడిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. రాజమౌళిపై విరుచుకు పడ్డ వారి లిస్టు కొండవీటి చాంతాడంత. దీన్ని బట్టి చూస్తుంటే.. ఈ దేవీ దేవతలకు మరీ ఇంత సెక్యూరిటీయా? ఈగ వాలనీయడం లేదెవరూ? అనిపించకమానదు. సీఎం రేవంత్  హిందూ. గతంలో ఆయన ఏబీవీపీ కార్యకర్త. ఆర్ఎస్ఎస్ భావజాలం తెలియని వారు కాదు. అలాంటి రేవంత్ ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండి సీఎం అయ్యారని చెప్పి ఆయనేమీ హిందూ కాకుండా పోరు. ఒక ఇన్ స్పిరేషన్ కోసం పోలిక తెచ్చి జనానికి అవగాహన పెంచడానికి అన్నమాటలను పట్టుకుని దానిని వివాదాస్పదం చేయడం ఎంత వరకూ సమంజసం అని పరిశీలకులు అంటున్నారు.  అదే విధంగా దేవుడిపై నమ్మకం ఉండటం, ఉండకపోవడం అన్నది ఎవరికి వారికి వ్యక్తిగత విషయం. దూషణ లేనంత వరకూ అటువంటి విషయాలను వివాదం చేయడం తగదంటున్నారు. ఇలా వివాదాలు సృష్టిస్తున్నవారు హేతు వాదాన్ని, హేతువాదులనూ బతకనిచ్చేలా లేరన్న మాట కూడా వినిపిస్తుంది. తెలుగువారు గర్వించదగ్గ నటులలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు పలు సందర్భాలలో తనకు దేవుడిపై భక్తి లేదని ప్రకటించారు. అటువంటి ఆయన అద్భుతమైన భక్తిరస చిత్రాలలో అత్యద్భుతంగా నటించి మెప్పించారు. అందుకే రేవంత్ కానీ, రాజమౌళి కానీ చేసిన వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేయడం సమజసం కాదంటున్నారు పరిశీలకులు. 

పవన్ పై కాంగ్రెస్ విమర్శల దాడి.. ఏ ప్రయోజనం కోసం?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇందుకు కారణం కోనసీమలో కొబ్బరి దిగుబడి తగ్గిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందనే అర్ధం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు. అయితే జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జనం సీరియస్ గా తీసుకోలేదు. మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు. పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది. ఆ విమర్శల తీవ్రత గత రెండు రోజులుగా పెచ్చరిల్లింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే పవన్ సినిమాలను తెలంగాణ థియోటర్లలో ఆడనివ్వం అంటూ తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పుడు పరిశీలకులు వ్యక్తం చేస్తున్న సందేహాలు ఏమిటంటే.. కాంగ్రెస్ ఇప్పుడు, ఈ సమయంలో ఈ స్థాయి విమర్శలకు దిగడం పూర్తిగా నిరర్ధకం. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకూ పవన్ కల్యాణ్ కానీ, ఆయన జనసేన పార్టీ కానీ పూర్తిగా ఇర్రెలవెంట్. అయితే ఈ విమర్శల వల్ల తెలంగాణలో ఏమైనా జరగడమంటూ జరిగితే.. అది తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి రావడమే. అలా తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి వస్తే కాంగ్రెస్ కు రాజకీయంగా ఇసుమంతైనా ఉపయోగం ఉండదు. ఆ సెంటిమెంట్  వల్ల ప్రయోజనం అంటూ ఉంటే.. అది బీఆర్ఎస్ కు మాత్రమే. అంటే కాంగ్రెస్ నేతలు, మంత్రులు పవన్ కల్యాణ్ లక్ష్యంగా చేస్తున్న విమర్శల వల్ల బీఆర్ఎస్ మాత్రమే లబ్ధిపొందుతుంది. ఆ పని కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నదంటూ రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం  వ్యక్తం చేస్తున్నారు.  అన్నిటికీ మించి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. త్వరలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లబోతోంది. అలాగే తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఓ వైపు ఇంత సందడి, హడావుడీ పెట్టుకుని కూడా కాంగ్రెస్ నేతలూ, మంత్రులూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండిచడం, ఆయనపై విమర్శలు గుప్పించడం వినా తమకు వేరే పనేంలేదనేలా చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కాంగ్రెస్ పొలిటికల్ స్టాండర్డ్స్ పై అనుమానాలు వ్యక్తం అయ్యేందుకు దోహదపడుతున్నాయి.   మీడియా పెద్దగా పట్టిచుకోవడం మానేసిన నేతలు, మంత్రులే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారనీ, కనీసం ఆ రకంగానైనా మీడియా దృష్టిలో పడి ఎంతో కొంత పాపులారిటీ వస్తుందని భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అసెంబ్లీకి డుమ్మా.. పార్లమెంటుకు హాజరు.. జగన్ ద్వంద్వ నీతి

ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. కాదు కాదు దిశా నిర్దేశం చేశారు. దీంతో రాష్ట్ర సమస్యలపై గళమెత్తడానికి బోలెడంత అవకాశం ఉన్న అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టి పార్లమెంటులో ఎంపీలను నోరెత్తి ప్రశ్నించాలని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ ప్రారంభమైంది. కేవలం తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం రాష్ట్ర సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఉన్న అవకాశాలను తోసిపుచ్చి, తానే కాకుండా, తన పార్టీ ఎమ్మెల్యేల చేత సైతం శాసనసభను భహిష్కరింప చేస్తున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలంటూ ఎలా చెప్పగలరని పరిశీలకులు సైతం విస్తుపోతున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ పోషిస్తున్న పాత్ర గురించి ఆ పార్టీ నేతలకు సైతం ఎలాంటి క్లారిటీ లేదని భావించాల్సి వస్తున్నదని విశ్లేషిస్తున్నారు.   2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు,   కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.   ప్రజలివ్వని హోదా కోసం మంకు పట్టు పడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైసీసీ అధినేత జగన్ తనతో సహా తన పార్టీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీని బహిష్కరిస్తున్నారు.   తమకు ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా అసెంబ్లీని బాయ్ కాట్ చేశామని చెబుతున్న వైసీపీ అధినేత జగన్..   ప్రజా సమస్యల పై గళమెత్తడానికి అసెంబ్లీకే వెళ్లాలా? అన్న వితండ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ప్రెస్ మీట్లలోనే ప్రభుత్వ విధానాలను ఎండగడతానంటున్నారు.  మరి ఇప్పుడు  పార్లమెంట్ సమావేశాలలో రాష్ట్ర హక్కులు, సమస్యలపై గళమెత్తాలని  ఎంపీలను ఎలా ఆదేశిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర, హక్కులు, సమస్యలపై గళమెత్తడానికి అసెంబ్లీ కంటే, పార్లమెంటు ఎలా మెరుగైన వేదిక అవుతుందో జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడాన్ని ఇక్కడ ఎవరూ తప్పుపట్టరు కానీ, ఆయన అసెంబ్లీ ని బాయ్ కాట్ చేయడాన్ని మాత్రం తప్పుపడుతున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోతే జగన్ కు ఆయన పార్టీకీ రాష్ట్ర సమస్యలు పట్టవా? అని నిలదీస్తున్నారు. పొలిటికల్ గా ఆయన అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను దుయ్యబడుతున్నారు. గత ఎన్నికలలో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా, తమకు 40శాతం ఓట్లు వచ్చాయంటున్న జగన్.. మరి వైసీపీకి ఓటు వేసిన 40శాతం మంది ప్రజల కోసమైనా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వ విధానాలను నిలదీయాల్సి ఉంది కదా? ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా పోరాడాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి జగన్ ఏం జవాబు చెబుతారో చూడాల్సింది. 

‘వేలం’ వెర్రి తలలు!?

ఉత్త‌ర ప్ర‌దేశ్ లో రెండు ల‌క్ష‌ల రూపాయ‌లను ఎన్నిక‌ల ప్ర‌చార ఖ‌ర్చుకు తీస్కెళ్లిన అభ్య‌ర్ధి ఇర‌వై వేల రూపాయ‌ల‌ను ఇంటికి తెచ్చారంటే నమ్మశక్యంగా లేదు కదూ!  కానీ అది నిజం. లాలాగే..   ఓ అభ్య‌ర్ధి    ఎన్నార్సీ కేసుల‌పైన పోరాటం చేసి జైలుకు వెడితే.. ఆయ‌న త‌రఫున ఆయన భార్య‌, త‌ల్లి ఎలాంటి  ఖ‌ర్చు లేకుండా  ప్ర‌చారం  చేశారు. ఆ ఎన్నికలో ఆయన విజయం సాధించారు.   ఇక ఇటీవల ఇటీవల బీహార్ ఎన్నిక‌ల్లో అలీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం  నుంచి గాయిని మైథిలీ ఠాగూర్ విజయం  కూడా దాదాపు ఇలాంటిదే.   ఉత్త‌రాదిలో ఎన్నిక‌లంటే ఎమంత ఆస‌క్తిక‌రం కాదు. ఆపై అదేమంత కాస్ట్లీ  ఇష్యూ కూడా కాదు. ఖ‌ర్చు అస‌లే  ఉండ‌ద‌ని అంటాయి అక్కడి వారు.  అయితే దక్షిణాదిలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి పరిస్థితులు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి  కూడా భారీ ఎత్తున  ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక  పంచయతీలో  స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.  ఔను  మహబూబ్​నగర్​ జిల్లా, హన్వాడ మండలం, టంకర గ్రామంలో సర్పంచి పదవి కోసం  కోటి వెచ్చిస్తానని ఒక వ్యక్తి ప్రకటించినట్లు ప్రచారం జరిగింది.  కోటి రూపాయ‌ల‌కు స‌ర్పంచ్ ప‌ద‌వి అంటూ సోష‌ల్ మీడియాలో ఈ ఊరి  పేరు తెగ  మార్మోగిపోయింది.  అయితే వాస్తవమేంటంటే.. ఎన్నిక‌ల్లో వృధా ఖ‌ర్చు పెట్ట‌డం బ‌దులు ఊళ్లోని ఆంజేయస్వామి వారి ఆల‌యాన్ని  ఎవ‌రైతే పూర్తి చేస్తారో వారినే గ్రామ  స‌ర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.  ఆ ఒక్క ఆల‌యానికే సుమారు 60, డెబ్బై ల‌క్ష‌ల మేర ఖ‌ర్చు అవుతుంద‌ని తేలడంతో.. ఆల‌య ఖ‌ర్చుల‌తో పాటు ఊరిలోని ఇత‌ర‌త్రా ప‌నుల లెక్క కూడా వేసి కోటి రూపాయ‌ల ని తేల్చారు.  అది పక్కన పెడితే సర్పంచ్ పదవుల వేలం తెలంగాణలో ఒక వెర్రిలా మారిపోయింది.  జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, మిట్టదొడ్డి సర్పంచి పదవిని ఓ సీడ్​ ఆర్గనైజర్​  రూ.90 లక్షలకు, ఇదే మండలం గోర్లాఖాన్​దొడ్డిలో రూ.57 లక్షలకు,  లింగాపురం గ్రామంలో రూ.34 లక్షలకు వేలంలో సర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకున్నారు.  ఇంకా  గద్వాల మండలం, కొండపల్లిలో రూ.60 లక్షలకు నల్లదేవునిపల్లిలో.. రూ.45 లక్షలకు వేలం పాట ద్వారా సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.  అదే విధంగా మల్దకల్​ మండలం సద్దలోనిపల్లి సర్పంచి పదవి వేలంలో  రూ.42 లక్షలు పలికిందంటున్నారు. వీరాపురంలో రూ.50 లక్షలు,   ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, జోగ్గూడెం రూ.20 లక్షలకు సర్పంచ్ పదవులను వేలంపాటలో దక్కించుకున్నారు.  పదవుల మోజే ఈ ‘వేలం వెర్రి’కి కారణమంటున్నారు. అంత వరకూ కష్టపడి సంపాదించుకున్నది మొత్తం ధారపోసి మరీ పదవులు దక్కించుకోవడానికి పడుతున్న పోటీ విస్మయం గొలపక మనదు. వాస్తవంగా చూస్తే సర్పంచ్ పదవి పెద్ద పవర్ ఉన్న పదవి కూడా కాదు. అయితే దాని కోసం ఇంత హంగామా, తాపత్రేయం, పోటీ ఎందుకు అని ప్రశ్నించే వారూ ఉన్నారు.   స‌ర్పంచ్ ప‌ద‌వుల విష‌యంలోనే  ఇంత వేలం వెర్రి ఉంటే.. ఇక కార్పొరేటర్, ఎమ్మెల్యే పదవులకు ఎంతెంత ఖర్చు పెట్టాల్సి వస్తుందోఅన్న చర్చ జరుగుతోంది.  ఈ వేలం ‘వెర్రి’ చూస్తుంటే రాజకీయాలు అవినీతి మయంగా మారడానికి కారణమేమిటో ఇట్టే అవగతమౌతుందంటున్నారు పరిశీలకులు.  

కాళేశ్వరంతో కాంట్రాక్టర్లే బాగుపడ్డారు.. కవిత నోట కాంగ్రెస్ మాట

తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై తన విమర్శల స్వరం పెంచింది. ఇప్పటి వరకూ కేవలం హరీష్ రావు, సంతోష్ లన టార్గెట్ చేసుకుంటూ తన విమర్శల వాణి వినిపించిన కవిత.. ఇప్పుడు తండ్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరంపైనా తన విమర్శలను సంధించారు. నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు. ఇప్పటి వరకూ కాళేశ్వరం నిరుపయోగం అనీ, అవినీతి సొమ్మలు వెనకేయడానికి మాత్రమే బీఆర్ఎస్ ఆ ప్రాజెక్టు చేపట్టి అంచనాలు పెంచుకుంటూ పోయి సొమ్ములు దండుకుందన్న విమర్శలు కాంగ్రెస్ నుంచే వచ్చాయి. ఇప్పుడు కవిత కూడా అదే వాణి, అదే బాణితో తన విమర్శలకు పదును పెట్టారు.   తాజాగా శుక్రవారం కామారెడ్డిలో మాట్లాడిన కవిత కాళేశ్వరంతో కామారెడ్డి, నిజామాబాద్, బాన్సువాడలకు చుక్కనీరు వచ్చిన దాఖలాలు లేవన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాంట్రాక్టర్లు బాగుపడటానికే తప్ప రైతులకు, రాష్ట్ర వ్యవసాయానికీ దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని కుండబద్దలు కొట్టేశారు.    కాళేశ్వరం ప్రాజెక్టు కంటే జ‌మానాలో క‌ట్టించిన నిజాం సాగ‌రే ఎంతో నయమన్నారు. అయితే ఇప్పుడు అది మట్టి కూరుకుకోయి ఉందనీ, దానిని పూడిక తీయించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.  గ‌తంలో నిజాంసాగ‌ర్ ప‌ర్యాట‌కంగానూ ఎంతోబాగుండేద‌ని ఆ దిశగా కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. తానిప్పుడు కాళేశ్వ‌రంపై చేసిన ఈ వ్యాఖ్యలపై ఇక బీఆర్ఎస్ నేతలు  నోరేసుకుని ప‌డిపోతార‌న్న కవిత.. చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ సినిమాలోని ఓ పంచ్ డైలాగ్ తో చురక వేశారు.  ఇప్పుడు తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలకూ, ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన కవిత కాంగ్రెస్ రంగుల చీరకట్టడానికీ ముడి పెడుతూ పరిశీలకులు విశ్లేషణలకు పని చేప్పారు. ఆమె కాంగ్రెస్ కు చేరువ అవుతున్నారనడానికి కవిత తాజా వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు.  కాళేశ్వరంపై కాంగ్రెస్  విమర్శలనే బాజాప్తుగా తాజాగా కవిత కూడా చేశారు.   ఇక ఇప్పుడు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై విమర్శలు చేయాల్సిన అవసరం లేని పరిస్థితిని కవిత తన వ్యాఖ్యలతో కల్పిస్తున్నారంటున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇక కవిత విమర్శలకు సమాధానం చెప్పాలంటూ కేటీఆర్, హరీష్, కేసీఆర్ లను నిలదీస్తే పరిపోతుందంటున్నారు.  పరిస్థితి చూస్తుంటే.. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ గూటికి చేరడానికి అట్టే సమయంపట్టేలా లేదని కూడా చెబుతున్నారు.  

లోకం మెచ్చిన లోకేష్.. పెంపకం అంటే ఇదీ!

లోకేష్ ఎంత సంస్కార వంతుడో,  వ్యక్తిత్వ ఔన్నత్యం ఎంతటిదో ఇటీవలి కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు ప్రస్ఫుటం చేస్తున్నాయి.  విద్యా మంత్రిగా నారా లోకేష్ ఆ శాఖను సుసంపన్నం చేస్తూ వినూత్న కార్యక్రమాలతో విద్యార్థులలో విద్య పట్ల ఆసక్తిని, అనుకర్తినీ పెంచుతూనే.. తల్లిదండ్రులు తనకు నేర్పిన   స‌భ్య‌త సంస్కారాల‌ు మరింత ఇనుమడింప చేసే లాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.  అపకారికి ఉపకారం అన్నట్లుగా.. లోకేష్ జ‌గ‌న్ వంటి ప్ర‌త్య‌ర్ధుల ప‌ట్ల కూడా స‌హృద‌య‌త చాటుకుంటుంటూ జనం మన్ననలు పొందుతున్నారు. దీంతో లోకేష్ ద లీడ‌ర్ ఆఫ్ మాసెస్ గా జనహృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంటున్నారు.  బేసిగ్గా లోకేష్   త‌ల్లిచాటు బిడ్డ‌గా  ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా  చాలా  చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు  భువ‌నేశ్వ‌రి  అని చెప్ప‌డానికి  ఎన్నో నిద‌ర్శ‌నాలు. ఆయ‌న ఇటీవ‌ల చేస్తున్న మంచి ప‌నులు  అంద‌రినీ విశేషంగా ఆక‌ర్షిస్తున్నాయ్. త‌న పెద్ద‌మ్మ పురంధేశ్వ‌రి  కాళ్ల‌కు దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకున్న దృశ్యానికి తెలుగు త‌మ్ముళ్లు పులకించి పోయారు. అలాగే  ప్రవచన కారుడు చాగంటి కోటేశ్వ‌ర‌రావు కు ఇటీవల లోకేష్ పాదాభివంద‌నం చేయ‌డం కూడా ప్రజలను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఆపై పిల్ల‌ల్ని ఫ్లైట్ లో ఢిల్లీ వ‌ర‌కూ తీసుకెళ్లిన ఘ‌న‌త లోకేష్ దే. ఇటీవ‌ల రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా  ఏపీలో విద్యార్ధుల‌తో జ‌రిగిన మాక్ అసెంబ్లీపై కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఒక విద్యా మంత్రిగా  లోకేష్ ఈ ప్రతిపాదనను అసెంబ్లీలో నే చేసి అనుమతి పొందారు. ఇక విద్యార్థులతో అసెంబ్లీ ఆవరణలో మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న 45 వేల స్కూళ్ల  నుంచి మెరిక‌ల్లాంటి  విద్యార్ధుల‌ను ఎంపిక చేసి వారి ద్వారా జూనియ‌ర్స్ అసెంబ్లీని  అత్యద్భుతంగా నిర్వహించి భళా అనిపించింది.  ఈ విష‌యంలోనూ లోకేష్ కి మంచి మార్కులు ప‌డ్డాయి. సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా  తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్టు ఒకరు   అత్యుత్సాహం కొద్దీ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష హోదా కోసం బాబు, లోకేష్‌, ప‌వ‌న్ కాళ్ల వేళ్లా  ప‌డి బ‌తిమిలాడుతున్నట్లుగా ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వెంటనే వైరల్ అయ్యింది.  అయితే ఆ వీడియోను వెంటనే తీసేయాలనీ,  జ‌గ‌న్ మ‌న‌కు ఎంత  ప్ర‌త్య‌ర్ధి అయినా స‌రే వ్య‌క్తిగ‌తంగా   కించ ప‌రచడం సరికాదనీ పార్టీ సోషల్ మీడియా వింగ్ కు హితవు చెప్పారు.  దీంతో  ఇంతటి సంస్కారం, ఔన్నత్యం, ఉదాత్త గుణాలను పెంపొందేలా లోకేష్ పేరెంట్స్ ఆయనను పెంచిన విధానం ఎంత గొప్పదో కదా అంటూ పలువురు చంద్రబాబు, భువనేశ్వరిలను అభినందనలతో ముంచెత్తుతున్నారు.  గ‌తంలో బాబు కూడా.. జగన్ కు అర్హత లేకపోకయినా అసెంబ్లీలోకి నేరుగా కారులో రావడానికి అనుమతి ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   వైసీపీకి చెందిన వంశీ, కొడాలి వంటి నేతలు అసెంబ్లీలో లోకేష్ త‌ల్లి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు జగన్ క‌నీసం ఖండించలేదు సరికదా..  మ‌రింత నవ్వుతూ , వారిని మరింత ప్రోత్సహించి, రెచ్చ‌గొట్టే ధోర‌ణితో వ్యవహరించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. లోకేష్ కీ జ‌గ‌న్ కీ  ఇంత తేడా ఉండటానికి వారి వారి పెంపకాలలో ఉన్న తేడాయే కారణమని పరిశీలకులు సోదాహ రణంగా విశ్లేషిస్తున్నారు.  

హేతురహిత వ్యాఖ్యలతో పిచ్చెక్కిస్తున్న పవన్ కల్యాణ్?!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌లి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ట్రోల్ అవుతున్నాయి. హేతు రహితంగా  చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతున్నారు.  మొన్నా మ‌ధ్య ఎర్ర‌చంద‌నం చెట్ల విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్యలు వివాదానికి సైతం తావిచ్చాయి.  ఎర్ర‌చంద‌నం  చెట్ల‌కూ వెంక‌టేశ్వ‌ర‌స్వామికి అయిన గాయానికీ సంబంధం లేదు. వెంక‌న్న ర‌క్తంతో త‌డవ‌డం వ‌ల్లనే  ఎర్ర‌చంద‌నం చెట్ల‌కు ఆ ఎర్ర‌ద‌నం వచ్చిందన్నట్లుగా చేసిన ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ శాస్త్రీయ కరాణాలను వివరించారు కొందరు హేతువాదులు. ఇక తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.    ఉప ముఖ్య‌మంత్రి  స్థానంలో ఉండి  హేతురహితంగా ఆయన వ్యాఖ్యలు చేయడం సరికాదన్న మాట జనసైనికుల నుంచే వస్తున్నది. పవన్ కల్యాణ్ ఇటువంటి కామెంట్లు చేయడమేంటన్న విస్మయం రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది.  అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజా మన్ననలు అందుకునేలా వ్యవహరిస్తున్న ఆయన.. ఎర్రచందనానికి వేంకటేశ్వరస్వామి గాయానికీ ముడిపెట్టడం.. అలాగే కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి పొరుగురాష్ట్రం దిష్టి తగలడమే కారణమని అర్ధం వచ్చేలా మాట్లాడటం ఆయన స్థాయికి తగినట్లుగా లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.