టిడిపికి దాడి షాక్
posted on May 2, 2013 @ 9:35PM
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మరియు శాసన మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు గురువారం నాడు పార్టీకి రాజీనామా చేసారు. ఈరోజుతో ఆయన శాసనమండలి పదవీ కాలం పూర్తవుతుంది. తనకు మళ్ళీ రెండవ సారి శాసనమండలి పదవికి అవకాశం ఈయకపోగా ఆ పదవి వద్దంటున్న ఎనమల రామకృష్ణుడికి బలవంతంగా కట్టబెట్టినందుకు ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ కారణంతోనే ఆయన పార్టీ అధిష్టానంపై అలిగి గత కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా మసులుతున్నారు. ఆయన ఇటీవల విశాఖలోపార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు కూడా హాజరు కాలేదు.
దాడి వీరభద్ర రావు తన రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకి ఈ మెయిల్ ద్వారా పంపారు. ఆ లేఖను చంద్రబాబుకి పంపినప్పటికీ, తనకు 30 సం.ల క్రితం పార్టీలోకి ఆహ్వానించి గొప్ప అవకాశం ఇచ్చినందుకు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి కృతజ్ఞతలు తెలపడం విశేషం. తానూ భారమయిన హృదయంతో పార్టీని వీడుతున్నానని, పార్టీలో కొన్ని శక్తులు తనను పార్టీలో నిలవనీయకుండా పొగ పెడుతున్నందునే పార్టీని వీడవలసి వస్తోందని ఆయన పేర్కొన్నారు. దాడి వీరభద్ర రావు వంటి సీనియర్ నాయకుడిని ఎన్నికల ముందు కోల్పోవడం తెదేపాకి చాలా నష్టం కలిగించవచ్చు.
తనను శాసనమండలికి రెండవ సారి నామినేట్ చేయలేదనే చిన్నసాకుతో పార్టీని వీడుతున్న ఆయనకు వేరే ఉద్దేశ్యాలు ఉండవచ్చును. ఆయన రాబోయే ఎన్నికలలో తనకు లోక్ సభకి టికెట్టు తన కుమారుడికి తుని నియోజక వర్గం నుండి శాసన సభకి టికెట్టు ఆయన ఆశిస్తున్నట్లు సమాచారం. బహుశః చoద్రబాబు నాయుడు ఆయన షరతులకు అంగీకరించనందునే ఆయన పార్టీ వీడుతున్నారని భావించవలసి ఉంటుంది.
ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ వీడే వారి తరువాత గమ్యం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయే గనుక ఆయన కూడా ఆపార్టీతో ముందుగానే బేరం మాట్లాడుకొన్నాకనే పార్టీనుండి బయటపడేందుకు ఈ కధంతా నడిపి ఉండవచ్చును. కానీ, తెలుగుదేశం పార్టీ ద్వారా పేరు ప్రతిష్టలు, పదవులు, డబ్బు, అధికారం అన్నీసంపాదించుకొన్న దాడి వీరభద్ర రావు, రేపు జగన్ పార్టీలో జేరినా ఆపార్టీకి మాత్రం విదేయుడిగా ఉంటారని భావించలేము.
ఇక, విశాఖజిల్లా పార్టీ గ్రామీణ అధ్యక్షుడిగా ఉన్నఆయన కుమారుడు దాడి రత్నాకర్, మరియు వారి అనుచరులు కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.బహుశః వీరిరువురు ఈరోజు చంచల్ గూడా జైలుబాట పట్టే అవకాశంఉంది.