తెదేపా ప్రభుత్వ ఏడాది పాలనపై ఓ చిన్న సమీక్ష
posted on Jun 8, 2015 8:35AM
తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొంది. కనుక ఈ ఏడాది పాలనపై సమీక్ష జరపవలసిన సమయం ఇది. రాష్ట్ర విభజన కారణంగా అస్తవ్యస్తంగా తయారయిన పరిపాలనను, ప్రభుత్వ వ్యవస్థలను గాడిలో పెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలించింది. ఆ కారణంగానే ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకపోయినా బలమయిన ప్రభుత్వం ఒకటి ఉందనే భావన ప్రజలలో నెలకొని ఉంది.
కానీ ఏడాది గడుస్తున్నా హైదరాబాద్ నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాష్ట్రానికి తరలిరాలేకపోయింది. కారణాలు అందరికీ తెలిసినవే. కానీ విజయవాడలో ఏర్పాటు చేసుకొన్న ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుండి పరిపాలన సాగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి కనుక క్రమంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు కూడా విజయవాడకు తరలిరాక తప్పదు.
ఇక రాష్ట్ర విభజన కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలతో బాటు, విద్యుత్, ఆర్ధిక, రాజకీయ, పరిపాలనాపరమయిన అనేక సమస్యలను, సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తోంది. ముఖ్యంగా వివిధ అంశాలలో తెలంగాణా ప్రభుత్వంతో ఏర్పడుతున్న గొడవల కారణంగా రాష్ట్రాభివృద్ధికి కేటాయించవలసిన విలువయిన సమయం హరించుకుపోతోంది. అవికాకుండా రాష్ట్రంలో తెలంగాణా ప్రభుత్వానికి, తెరాసకు అనధికార ప్రతినిధిలా వ్యవహరిస్తూ, అడుగడుగునా సమస్యలు సృష్టిస్తున్న వైకాపాను కూడా ఎదుర్కొంటూ ముందుకు సాగవలసి వస్తోంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన మూడు నాలుగు నెలలలోనే రాష్ట్రంలో కరెంట్ కోతలనేవీ లేకుండా చేయగలిగారు.
అదే విధంగా రాజధాని నిర్మాణం విషయంలో కూడా ఎన్ని అవరోధాలు ఎదురవుతున్నా వాటినన్నిటినీ ఎదుర్కొంటూ దృడంగా ముందుకే సాగుతున్నారు. ఎన్నికల హామీల అమలు విషయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల కారణంగా కొంత వెనుకబడినట్లే ఉన్నారు. కానీ రాష్ట్రంలో క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి కనుక ఇచ్చిన హామీలన్నిటినీ ఒకటొకటిగా అమలుచేయవచ్చును. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే రాష్ట్రంలో ఐదు ఐఐటి. ఐఐఐటి, ఐఐయం, నిట్ వంటి ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకి శ్రీకారం చుట్టింది. వాటికి శాశ్విత భవనాలు ఏర్పాటు చేసేవరకు వేచి చూడాలను కోకుండా తాత్కాలికంగా వేరే ఉన్నత విద్యాసంస్థలకు చెందిన భవనాలలో ఈ విద్యాసంవత్సరం నుండే తరగతులు మొదలుపెట్టాలనుకోవడం చాలా మంచి నిర్ణయమే. వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం, రాష్ట్రంలో పలు భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న కృషి చాలా ప్రశంశనీయం. రాష్ట్ర ప్రభుత్వం తలపెడుతున్న ఈ పనులన్నిటికీ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుండటం చాలా హర్షణీయం. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో జరుగుతున్నా ఆలస్యం, కొనసాగుతున్న సందిగ్ధత వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఇబ్బందిపడవలసి వస్తోంది. త్వరలోనే రైల్వే జోన్ మరియు ప్రత్యేక హోదాపై కేంద్రం ఒక కీలక ప్రకటన చేయబోతోంది.
రాష్ట్రంలో పరిపాలన కూడా పూర్తిగా గాడిన పడినట్లే కనబడుతోంది. కాకపోతే మంత్రులలో కొంతమంది మాత్రమే మీడియా ముందుకు వస్తుంటే మిగిలిన వారు పనిచేయడం లేదనే ఒక అపోహ ప్రజలలో నెలకొని ఉంది. కనుక మంత్రులు అందరూ కూడా విధిగా నెలకి ఒక్కసారయినా మీడియా ముందుకు వచ్చి తమ తమ శాఖలలో జరుగుతున్న ముఖ్యమయిన పనులు గురించి, రాష్ట్రాభివృద్ధి కోసం తాము చేస్తున్న కృషి గురించి ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడం మంచిది.
రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర పరిస్థితి చూసి ప్రజలు కూడా చాలా ఆందోళన చెందిన మాట వాస్తవం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనబరుస్తున్న మంచి పనితీరు, పట్టుదల కారణంగా కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రజలలో ఇపుడు ఆ నిరాశ నిస్పృహలు దూరమవడమే కాకుండా, వేగంగా సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. బహుశా రానున్న నాలుగేళ్లలో రాష్ట్ర పరిస్థితి మరింత మెరుగపడవచ్చును. అయితే అందుకు ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ సహకారం, ప్రభుత్వంపై నమ్మకం కూడా చాలా అవసరం. అప్పుడే ప్రభుత్వం దైర్యంగా, పూర్తి ఆత్మ విశ్వాసంతో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ రాష్ట్రాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించగలుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఒక అవగాహన, అంచనా ఏర్పడింది. ఇక మిగిలిన నాలుగేళ్ళలో రాష్ట్రాభివృద్ధి చేసి చూపించ గలిగితే చంద్రబాబు నాయుడు సమర్ధత, కార్యదీక్షపై అపార నమ్మకంతో ఆయనకు ఓటేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలు కూడా తాము సరయిన నిర్ణయమే తీసుకొన్నందుకు చాలా సంతోషిస్తారు.