రాజధాని భూసేకరణ పూర్తి చేయగలిగితే చాలు
posted on Feb 13, 2015 @ 10:03AM
రాజధాని భూసేకరణకు ఈనెల 14వ తేదీతో గడువు ముగుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 30, 000 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొంటే, ఇంతవరకు 19,000 ఎకరాలు సేకరణకు రైతుల నుండి అంగీకర పత్రాలు పొందగలిగింది. కనుక మిగిలిన భూసేకరణకు మరొక రెండు వారాలు గడువు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. తుళ్ళూరు మండలంలో దాదాపు తొమ్మిది గ్రామాలలో రైతులు తమ భూములు ఇచ్చేందుకు అయిష్టత చూపుతున్నందున భూసేకరణ ఆలశ్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం బలవంతంగా వారి భూములు స్వాధీనం చేసుకొనే ఆలోచనలో లేదు. వారికి ఏదో విధంగా నచ్చజెప్పి భూసేకరణ ప్రక్రియ సజావుగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ అప్పుడు కూడా వారు అంగీకరించకపోయినట్లయితే తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవలసి రావచ్చును. కానీ ఒకవేళ ప్రభుత్వం అందుకు పూనుకొంటే తుళ్ళూరు గ్రామాల ప్రజలకు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ అండగా నిలబడి న్యాయపోరాటం చేస్తామని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెపుతున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో చాలా ఆచితూచి అడుగుముందుకు వేయవలసి ఉంటుంది. లేకుంటే రాజధాని నిర్మాణం సంగతి అటుంచి కోర్టు కేసులతోనే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోవచ్చును.
ఒకవేళ ప్రభుత్వం అందుకూ సిద్దపడినా, మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే చాలా కాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్, వైకాపాలు రెండూ కూడా ఈ వ్యవహారానికి రాజకీయ రంగులద్ది చంద్రబాబుపై రైతు వ్యతిరేకి ముద్ర వేసే ప్రయత్నాలు చేయవచ్చును. దానివలన ఆయనకు ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏమీ ఉండబోదు కానీ ఎన్నికల సమయంలో ఆ ప్రభావం తప్పక ఉంటుంది.
రాజధాని నిర్మాణానికి అన్నీ ఏర్పాట్లు చేసుకొన్నాక ఇప్పుడు వెనక్కి తగ్గడం కూడా సాధ్యం కాదు. గనుక తప్పనిసరిగా రైతుల నుండి మిగిలిన 11, 000 ఎకరాల భూమిని కూడా సేకరించవలసి ఉంటుంది. అప్పుడే రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. తొమ్మిది గ్రామాలలో రైతులు తమ భూములను ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్నారు కనుక, ఇంతవరకు సేకరించిన 19,000 ఎకరాలలోనే రాజధాని ప్రధాన ప్రాంతం నిర్మించే విధంగా ప్రణాళికలు మార్చుకొనేందుకు ప్రభుత్వం సిద్దపడినా, అప్పుడు భూములు ఇచ్చిన రైతులు కూడా మొరాయించే అవకాశాలుంటాయి. కనుక ఏవిధంగా చూసినా మిగిలిన భూసేకరణలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పక పోవచ్చును.
ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని అందరూ ముందే ఊహించారు. కానీ వాటిని చంద్రబాబు ఏవిధంగా పరిష్కరించుకొంటారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను ఒప్పించి వారితో ఎటువంటి ఘర్షణ లేకుండా ఈ భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయగలిగితే చంద్రబాబు నాయుడు మరిక వెనుతిరిగి చూసుకొనే పనే ఉండదని చెప్పవచ్చును.
రాజధాని ప్రధాన ప్రాంతం అభివృద్ధికి, అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, మంత్రులు, అధికారుల కార్యాలయాలు, గృహసముదాయాల నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని కేంద్రం ఇప్పటికే హామీ ఇచ్చింది. సింగపూర్ మరియు జపాన్ దేశాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ శరవేగంగా అత్యాధునిక రాజధాని నిర్మాణం చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క సమస్యను నేర్పుగా అధిగమించవలసి ఉంటుంది.
వచ్చే ఎన్నికల నాటికి రాజధాని ప్రధాన నగర నిర్మాణం, వైజాగ్, విజయవాడ నగరాలలో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ఉపయోగించుకొని వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాలలో పారిశ్రామిక అభివృద్ధి చేయగలిగినట్లయితే తెదేపా నిర్భయంగా ప్రజలను ఓట్లు అడగి మళ్ళీ అధికారంలోకి రావచ్చును.