ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు....
posted on Jun 9, 2015 @ 12:02PM
రాష్ట్ర విభజన అనంతరం ఇంతవరకు ఆంద్రా, తెలంగాణా ప్రభుత్వాలు మధ్య నిత్యం ఏదో ఒక అంశం మీద యుద్ధం జరుగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి వ్యవహారంతో అది కాస్తా ముదిరి పాకాన పడినట్లయింది. అది ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రత్యక్ష యుద్ధంగా మారడంతో చివరికి ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. ఇంతవరకు ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగానే జరుగుతున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరి పరిధులలో వారే ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిన్న గవర్నర్ మరియు లక్షలాది ప్రజల సమక్షంలోనే ప్రకటించినందున, కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో కలుగజేసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా చంద్రబాబు నాయుడుని రక్షించడం ఆ బ్రహ్మతరం కూడా కాదని ప్రకటించిన కేసీఆర్ ఒకవేళ ఆయనపై కేసు నమోదు చేసి విచారించాలని పట్టుబడితే గవర్నర్ దానిని కాదనలేని పరిస్థితి ఏర్పడవచ్చును. అదే జరిగితే ఇరు రాష్ట్రాల మధ్య ఊహించని అనేక సమస్యలు తలెత్తకమానవు. కనుక ఈ సమస్యను ఎవరికీ ఇబ్బంది కలిగించని విధంగా ఆయన పరిష్కరించవలసి ఉంటుంది.
పదేళ్ళ పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే హైదరాబాద్ నగరంలో ఇటువంటి సమస్యలు, ఘర్షణలు చెలరేగకుండా చూడవలసిన బాధ్యత గవర్నర్ దే. కనుక కేంద్ర ప్రభుత్వం ముందుగా ఆయననే ఇందుకు సంజాయిషీ కోరవచ్చును. కానీ అంతిమంగా కేంద్ర ప్రభుత్వమే దీనిని పరిష్కరించవలసి ఉంటుంది. లేకుంటే ఆ ప్రభావం నేరుగా బీజేపీ పడే అవకాశం ఉంటుంది. ఎన్డీయే ప్రభుత్వంలో తెదేపా కూడా భాగస్వామిగా ఉన్నందున ఈవిషయంలో కేంద్రం చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అలాగని తెదేపాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొంటే అది తెరాసకు ఆయుధంగా మారుతుంది. దానిని ఉపయోగించుకొని తెలంగాణాలో బీజేపీని దెబ్బ తీసే ప్రమాదం ఉంది.
ఒకవేళ తెరసాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నట్లయితే, ఇప్పటికే ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం వంటి అనేక హామీలను అమలు చేయనందుకు మోడీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ప్రజలు, బీజేపీపై ఆగ్రహించే ప్రమాదం ఉంది. కనుక తెదేపా, తెరాస ప్రభుత్వాలమధ్య, ముఖ్యమంత్రుల మధ్య మొదలయిన ఈ గొడవ ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు బీజేపీ పీకకి చుట్టుకొన్నట్లయింది. ఒకవేళ బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చెప్పినట్లు “చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని కేంద్రం ఊరుకొంటే ఇది ఇరు రాష్ట్రాల మధ్య చాలా తీవ్రమయిన సమస్యలని సృష్టించే ప్రమాదం ఉంది. కనుక కేంద్ర ప్రభుత్వం ఏదో విధంగా వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తుందేమో?