టీఆర్ఎస్ పై టీడీపీ ప్లాన్
posted on Sep 21, 2015 @ 1:25PM
తెలంగాణ టీడీపీ ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఢీకొనేందుకు వ్యూహత్మకంగా వ్యవహరించనుందా?.. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఎలాంటి చర్యలు కార్యాచరణలో పెట్టాలి అనే విషయాలపై కసరత్తు చేస్తుందా? అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వపై పోరాడటానికి సిద్దమవుతోందా? అంటే అవుననే అనుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లా కాకుండా ఈసారి మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి సమాయత్తమవుతోంది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష బలం బానే ఉన్నా అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఎవరూ నోరు మెదపకుండా ఉండటం.. టీఆర్ఎస్ కూడా ఇదే అదను చూసుకొని రెచ్చిపోవడం జరిగింది. టీడీపీ నుండి మాట్లాడగలిగే రేవంత్ రెడ్డిని కూడా అకారణంగా సభ నుండి వెలివేసి సమావేశాలు ముగిసే వరకూ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అలా కాకుండా తామ ఒక్కపార్టీనే సింగిల్ కూడా పోరాటానికి వెళ్లకూడదని.. ఇతర పార్టీలను కూడా కలుపుకొని కలిసికట్టుగా వెళ్లాలని.. ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్న్టట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతుల ఆత్మహత్యలు - తెలుగుదేశం - కాంగ్రెస్ - వైఎస్సార్ సీపీ పార్టీల నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపులు నష్టపరిహారం వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే నిర్ణయాలపై ఏకాభిప్రాయం వస్తే కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని చూస్తున్నారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ నెరవేరుస్తానన్న హమీలపై.. ముఖ్యంగా రైతుల కుటుంబాలకు నష్టపరిహారం.. మొదలగు అంశాలపై మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏడాది కాలంపాటు మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకూడా ఇప్పుడు బాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఎదురుదాడికి దిగింది. ఎదో విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూనే ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా దూకుడుగా ముందుకెళ్లాలని సూచించడంతో నేతలు ఎవరికి నచ్చిన తీరులో వారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తునే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ టీడీపీ తో చేతులు కలుపుతుందనే వార్తలే వినిపిస్తున్నాయి. మొత్తానికి పార్టీలన్నీ కలిసి టీఆర్ఎస్ పై యుద్దానికి దిగుతున్న నేపథ్యంలో మరి టీఆర్ఎస్ ఎలా అడ్డుకోగలదో చూడాలి.