కావూరి, రాయపాటి వైసిపి లోకి
posted on Oct 27, 2012 @ 11:44AM
రాష్ట్రంలో సీనియర్ యంపిలుగా సేవలందిస్తున్న కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావులకు ఈ సారి కూడా కేంద్ర క్యాబినెట్ విస్తరణలో చుక్కెదురయ్యింది. పుట్టిన దగ్గరనుండి కాంగ్రెస్ కు సేవ చేస్తూ ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ వర్గానికి చెందిన నాయకుడు తమను పిలిచినా విశ్వాసంగా కాంగ్రెస్ కు పని చేస్తే తమకు మిగిలిందేమిటని వారు వాపోతున్నారు. తమకన్నా వెనుక వచ్చిన వారు కేంద్ర మంత్రులుగా నియమితులవుతుంటే తాము మాత్రం ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోతున్నామని వారు చెబుతున్నారు. చివరిసారిగా అధిష్టానికి వారు తమ వాదన వినిపించడానికి కిరణ్ కుమార్ దగ్గర మంతనాలు జరిపటానికి కావూరి ముఖ్యమంత్రిని కలిసారు. అయితే వారిరువురూ తొందరపడి నిర్ణయాలు తీసుకునే వారు కాదు గనుక ఆచి తూచి అడుగులేస్తున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ కు విధేయతగా ఉన్నా, సోనియాగాంధీ దగ్గర ఎంత పలుకుబడి ఉన్నా తమకు ఏ మాత్రం న్యాయం జరగటం లేదని మాత్రం వారు గ్రహించారు. దాంతో వారిద్దరూ కార్యకర్తలతో చర్చించి వైసిపి లోకి మారితే తమ భవష్యత్తుకు ఏంతవరకు భరోసా వుంటుందని ఆలోచిస్తున్నారు. కచ్చితమైన హామీ ఆపార్టీ నుండి వెలువడితే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పటానికి రడీగా వున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ వీరిద్దరూ పార్టీ నుండి బయటకు వస్తే ఏలూరుకు అలాగే గుంటూరు కాంగ్రెస్ కు పెద్ద దెబ్బేనని పార్టీ వర్గాలు కలవర పడుతున్నాయి.