మీడియాతో జాగ్రత్తలు తీసుకుంటున్న సబిత?
posted on Nov 2, 2012 8:56AM
గత కొంతకాలంగా రాష్ట్ర హోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎందుకంటే మీడియాతో ఎక్కువగా టచ్‌లో ఉంటే వార్తల్లో వ్యక్తి కావచ్చని అనిపించినప్పటికీ అవసరమైనప్పుడు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. మీడియాతో ఆచితూచి వ్యవహరించాలని ఆమె నిశ్చయించుకున్నట్లు కనబడుతున్నారు.
ఇటీవల ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణా మార్చ్ సందర్భంగానూ మీడియాతో సఖ్యతగా ఉన్నట్లు కనిపిస్తూనే సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నారన్నట్లు చూపారు. దీంతో తెలంగాణావాదులు తనను తప్పు పట్టకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు. అలానే సిబిఐ పిలుపు వచ్చినప్పుడు సిఎంను కలిశాక ఇతర మంత్రులైనా మాట్లాడారు కానీ, ఆమె తక్కువగా మాట్లాడటం తన శైలి అన్నట్లు వ్యవహారించారు.
అలానే తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న ఈమె ఆ జిల్లా ఎస్పీ, ఎఎస్పీల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కూడా హూందాగా హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ప్రొఫెసర్ కోదండరామ్ గృహనిర్బంధంపై ఆయన సబితకు ఫోను చేశారు. సబిత ఏమి హామీ ఇచ్చారు? అసలేమి మాట్లాడారో తెలియలేదు. అంటే సబితకు ఫోను చేశారన్న వార్తే తప్పించి మీడియాకు ఆమె మాట్లాడిన మాటలు బయటకు రాలేదంటే సబిత చాలా సీరియస్‌గా జాగ్రత్తలు పాటిస్తున్నట్లే కదా!