Read more!

మూఢ భక్తి పాడుగానూ.. పామును వెక్కిరిస్తే ఊరుకుంటుందా?

మూఢనమ్మకాలు ఒక్కోసారి ప్రాణం మీదకు తీసుకువస్తాయి. నిద్రలో పీడకలలు వస్తున్నాయని జ్యోతిష్యుడిని ఆశ్రయించిన ఓ వ్యక్తి ఆ జ్యోతిషుడు ఇచ్చిన సలహాను పాటించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అదృష్టం బాగుండి బతికి బయటపడడమైతే పడ్డాడు కానీ.. మూఢనమ్మకమే ప్రాణం మీదకు తెచ్చిందని తెలుసుకున్నాడో లేదో. కలలను కూడా శాస్త్రీయంగా విశ్లేషించి పీడకలల బారి నుంచి విముక్తి కలిగించేందుకు కౌన్సెలింగ్  ఇచ్చే కేంద్రాలున్నాయి.

కానీ ఈ కాలంలో కూడా పీడకలలు చేటు చేస్తాయని నమ్మే వ్యక్తులు ఉన్నారనడానికి తమిళనాడుకు చెందిన రాజాయే నిదర్శనం.    గోపిచెట్టిపాళయంకు చెందిన రాజా ఒక రైతు  రాజాకు ఇటీవల తరచూ..  పాము కాటు కల వస్తుండటంతో భయపడి ఓ జ్యోతిష్యుడిని ఆశ్రయించాడు. అతడి సలహా మేరకు రాజా పాములపుట్ట ఉన్న ఓ అలయానికి వెళ్లి పుట్టకు పూజలు చేసి పాములా మూడు సార్లు నాలుక బయటకు చాపాడు. అంత వరకూ బానే ఉంది.. కానీ ఆ పుట్టలో ఉన్న పాము రాజా నాలుకపై కాటేసింది. వెంటనే ఆలయ పూజారి, రాజా కుటుంబ సభ్యులు పాము కాటువేసిన ప్రాంతంలో నాలుకను కోసివేసి.. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు.  

ఆస్పత్రిలో వైద్యులు సగం తెగిపోయిన నాలుకకు చికిత్స చేసి.. పాము విషానికి విరుగుడు  ఇంజెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు.  మూఢ నమ్మకాలు ఎంత ప్రమాదమో ఇప్పుడు రాజుకు తెలిసి వచ్చి ఉంటుంది.