విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాల చోరీ.. మండిపడ్డ టీడీపీ
posted on Sep 16, 2020 @ 11:16AM
ఏపీలోని వివిధ హిందూ ప్రార్థన స్థలాలలో వరుసగా జరుగుతన్న ఘటనలు రాష్ర ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం అంతర్వేది రథం దగ్ధం ఘటన మరవక ముందే తాజాగా విజయవాడలోని కనకదుర్గ ఆలయంలోని రథంపై దుమారం రేగుతోంది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉత్సవ వెండి రథంపై ఉండాల్సిన మూడు వెండి సింహాలు మాయమవడం సంచలనం గా మారింది. ఈ రథంపై మొత్తం నాలుగు వెండి సింహాలు ఉండేవి. అయితే ప్రస్తుతం మూడు సింహాలు మాయమయ్యాయి. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రథంపై మూండు సింహాలు మాయం కావడంతో దుర్గమ్మ భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. అంతేకాకుండా ఈ విషయం పై ఆలయ ఈవో నీళ్లు నమలడం దొంగలకు వత్తాసు పలకడమేననని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఈ చోరీ వెనుక ఎవరి హస్తం ఉంది.. ఎవరిని రక్షించడానికి మీరు దీనిని కప్పిపెట్టాలని చూస్తున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. వెండి సింహాల మాయం ఘటనపై వెంటనే నిజానిజాలు బయటపెట్టాలని అయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో "వైసిపి అధికారంలోకి వచ్చాక ఏ గుడికి భద్రత లేకుండా పోయింది. వైసిపి నాయకులు ఏకంగా గుడిని, గుడిలో లింగాన్ని మింగేసేలా ఉన్నారు. దేవాదాయ భూముల ఆక్రమణల దగ్గర నుండి, రథాలకు నిప్పు, విగ్రహాల ధ్వంసం, వెండి తాపడాల మాయం, ఇలా రోజుకో నేరం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగలు, దగాకోర్లు ఆలయాల్లో తిష్టవేసి అరాచకాలు చేస్తున్నా సీఎం చోద్యం చూస్తున్నారు. ఆలయాల్లో చోరీలు, విధ్వంసాలు, అరాచకాలు చేస్తున్న నేరగాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలి. భక్తుల మనోభావాలను గౌరవించాలి. అంతేకాకుండా 15నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో జరిగిన అరాచకాలపై సిబిఐ విచారణ జరిపించాలి.'' అని బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అంతర్వేది రథం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం దుర్గగుడి ఈవో సురేష్ బాబు, విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్‌తో సమావేశమై దుర్గగుడిలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చలు జరిపారు. తరువాత ఆలయ ఈవో, ఇతర సిబ్బంది కలిసి ఉత్సవ రథాలను పరిశీలించారు. అప్పుడు వెండి రథంపై ఉండాల్సిన మూడు వెండి సింహాలు మాయమైన విషయాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా నాలుగో సింహాన్ని కూడా పెకలించి ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. వీటిలో ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండి వినియోగించారని.. ఈ లెక్కన మొత్తం రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి అదృశ్యమైనట్లు సమాచారం. ఐతే ఆలయ అధికారులు మాత్రం దీన్ని ధృవీకరించడం లేదు. దీని పై దుర్గ గుడి ఈవో సురేశ్ స్పందిస్తూ రథంపై ఉన్న సింహాలు మాయమయ్యాయని తాను అనుకోవడం లేదని అన్నారు. ఆలయ రికార్డులను పరిశీలించి సింహాలు గతంలో ఉన్నాయో లేవో తేల్చడానికి 3 రోజుల సమయం పడుతుందని ఆయన తెలిపారు.