మీలోనూ సిగ్గు బిడియం ఉన్నాయా..ఇవే కారణాలు.. పరిష్కారాలు..
posted on Jul 23, 2025 @ 9:30AM
చాలామందిలో భయం సిగ్గు అనేవి లక్షణాలుగా ఉంటాయి. ఇవి చాలామంది సహజమే అనుకుంటారు. మరికొందరు అయితే వారి స్వభావమే అంత అనుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల్లో ఇలాంటి లక్షణాల గురించి నలుగురిలో ఉన్నప్పుడు మావాడికి భలే బిడియమండీ.. తనకు తాను ఏదైనా చేయాలంటే తడబడతాడు, మా అమ్మాయి చాలా మొహమాటస్తురాలు ఎవరితోనూ తొందరగా మాట్లాడదు, ఎవరితోనూ కలవదు అని చెబుతుండటం గమనిస్తూనే ఉంటాం. అయితే ఈ లక్షణాలు పిల్లల్లో ఉండటం వల్ల అదేదో బుద్దిమంతుల లక్షణం అన్నట్టు ఫీలైపోతారు చాలామంది తల్లిదండ్రులు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే.. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఈ లక్షణాలు మనిషిని ఎదగనీయకుండా చేస్తాయి.
బిడియపడే వ్యక్తి తనని తనే విభజించుకుంటాడు. ఆ వ్యక్తిలో ఆత్మస్థైర్యం బలహీనంగా ఉంటుంది. ఇలా బిడియపడేవారికి కూడా సమాజంతో అందరితో పరిచయం పెంచుకోవాలని అనిపిస్తుంది. పేరు తెచ్చుకోవాలని అనిపిస్తుంది. కానీ.. ఇవేమీ సాధించలేరు. ఎందుకంటే బిడియపడే వ్యక్తి అంతరాత్మ ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటుంది. వీరిలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయి.
ఒకటి.. ఇతరులతో స్నేహం చేయడంలో ప్రమాదాన్ని ఊహించడం. రెండు.. తన స్నేహన్ని ఇతరులు తక్కువగా చూస్తారని జంకడం. ఇలాంటి వ్యక్తులు అంగవైకల్యంతో బాధపడే రోగిలాగా ప్రవర్తిస్తారు. కేవలం ఈ ఒక్క లక్షణం వల్ల ఆ వ్యక్తి మొత్తం జీవితమే గందరగోళంగా తయారౌతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఏది చేయాలన్నా సిగ్గు బిడియాలు అవరోధకాలుగా మారతాయి.
ఇకపోతే… ఈ సిగ్గు, బిడియం వల్ల కలిగే సమస్యల గురించి చెప్పుకుంటే...మితిమీరిన సిగ్గువల్ల మాటలు తడబడతాయి. కాళ్ళు వణుకుతాయి. అ వ్యక్తి అసంపూర్ణమైన వ్యక్తిత్వంతో మిగిలిపోతాడు అందరూ తనని తృణీకార భావంతో చూస్తున్నట్లుగా బాధపడతాడు. అతను తన అస్థిత్వాన్ని తాను ఋజువు పర్చుకోలేడు. సంఘ జీవితం అసంతృప్తిగా వుంటుంది. ఆఖరుకి అతని క్రింద ఉద్యోగస్థులు కూడా తనని ఏదో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద గౌరవిస్తున్నారని భావిస్తాడు. అంటే వ్యక్తి తనని తాను అల్పుడిగా భావించుకోవడం తనను అందరికంటే తక్కువగా చూసుకోవడం జరుగుతుంది.
వ్యక్తిలో ఎంతో ప్రతిభ ఉంటుంది కానీ..తన ప్రతిజ్ఞా పాటవాలని ఎలా ప్రదర్శించాలో, తవ క్రింద ఉద్యోగస్థుల యొక్క విస్వాశాన్ని ఎలా పొందాలో తెలియదు. బిడియం వల్ల అందరూ తక్కువ ధరకు కొనే వస్తువును బేరం ఆడలేక, అలా బేరం చేయడం చేతకాక, బేరం చేస్తే ఎవసరు ఏమనుకుంటారో అనే భావంతో ఎక్కువధర చెల్లించి కొంటారు. ఇతరులు తనని చూసి నవ్వితే హేళనగా నవ్వుకుంటున్నారని భావిస్తారు. ఎవరన్నా అభినందనలు తెలియచేస్తే అయోమయములో సరిపోతారు. ఇతరులు చెప్పేదానిని ప్రతిఘటించడానికి భయపడిపోతారు.
మనుషుల్లో ఈ సిగ్గు, బిడియం అనేవి ఎందుకు చోటుచేసుకుంటాయి అంటే..
ఓ మనిషిలో సిగ్గు బిడియాలు చాలా కారణాల వల్ల కలుగుతాయి.
మొట్టమొదటి కారణం..
ప్రకృతి సహజమైన మనస్తత్వం. వ్యక్తిలో ఉన్న ప్రకృతి సహజంగా గుణం ఆ వ్యక్తిని సిగ్గుకు, భయానికి గురి చేస్తుంది. ఫలితంగా సున్నిత మనస్కులుగాను స్తబ్దులుగాను భయస్తులుగా, రూపొందుతారు.
రెండవ కారణం..
పరిసరాల ప్రభావం. వ్యక్తి మీద పరిసరాల ప్రభావం చాలా తీవ్రంగా చూపిస్తుంది. బాల్యంలో ఒంటరి జీవితం గడిపినా లేదా తల్లిదండ్రులు అతిగా గారాబం చేయడం వల్ల కానీ, లేదా చిన్నతనం నుండి బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు మొదలైనవారికి దూరంగా ఉండటం వల్ల కానీ.. (చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవాలి. చదువుకునే పిల్లలు తిరగకూడదు, బయటకు వెళ్లకూడదు, ఆడుకోకూడదు వంటి నమ్మకాలతో పిల్లలను ఎక్కడికీ పంపరు, బంధువుల దగ్గరకు, స్నేహితులతో, బయట సరదాగా గడపడానికి ఇలా అన్నిటికీ దూరం ఉంచుతారు) చిన్నవయసులో తల్లిదండ్రులచేత విపరీతమైన ఆంక్షలు, కట్టుదిట్టమైన జాగ్రతలు విధింపబడటం వల్లగాని, లేదా ఇవేమీ కాకపోయినా, బాల్యం నుంచీ యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలోనైనా తెలియకుండానే ఒకానొక బిడియం, సిగ్గు అలవాటైపోతాయి. కొందరిలో వయసు పెరిగేకొద్దీ ఈ బిడియం, సిగ్గు అనేవి తగ్గుతాయి. కానీ మరికొందరిలో ఇవి కూడా క్రమంగా పెరిగి జీవితంలో ఎదుగుదలకు అడ్డంకిగా మారతాయి.
కారణమేదైనా, ఇటువంటి అనవసరమైన సిగ్గు బిడియాలు జీవితం తాలూకు సంతోషాలను ఆస్వాదించకుండా, అమభవించనీయకుండా చేస్తాయి. కేవలం మనకి మనమే సృష్టించుకుంటున్న ఈ పూర్తి మానసిక అవలక్షణం వల్ల జీవితమే దుర్భరమైపోతుంది.
అయితే.. ఇలా సిగ్గుపడే వ్యక్తులు తమని తామే కొన్ని ప్రశ్నలు వేసుకుంటే వారిలో మార్పు సాధ్యమవుతుంది.
ఎందుకు ? సిగ్గుకు, బిడియానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
ఎలా? సిగ్గును ఎలా ప్రకటిస్తారు?? తడబాటుతోనా లేదా భయపడుతూనా.. ఎర్రబడ్డ మొహంతోనా లేదా మనుషులకు దూరంగా వెళ్లడం ద్వారానా..
ఎప్పుడు? ఎటువంటి పరిస్థితుల్లో లేదా ఎవరి సమక్షంలో అధికంగా సిగ్గుపడతారు. అది ఎందుకు అలా జరుగుతోంది.
ఎక్కడ? ఎక్కడ అంటే ఎలాంటి సందర్భాలలో ఈ లక్షణం అధికంగా బయటపడుతుంది?
ఈ ప్రశ్నలు వేసుకుని వాటికి సమాధానాలు వెతుక్కుంటే.. ఈ సిగ్గు, బిడియం అనే సమస్యలను సులువుగా అధిగమించవచ్చు.
◆నిశ్శబ్ద.