అమ్మపాలు తాగి రొమ్ము గుద్దిందెవరు? సంబరాలు కాదని విద్రోహదినమా?
posted on Oct 31, 2012 7:56AM
యావత్తు దేశం భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించబడిరదని పాఠ్యపుస్తకాల్లో అందరూ చదువుకున్న వారమే. ఈ విభజనను తప్పుపట్టడానికి ఎటువంటి అవకాశమూ లేదు. దీన్ని మొత్తం దేశం అంగీకరించింది. దేశాన్ని పాలించిన నేతలు ఎప్పుడూ కలిసి ఉండాలనే కోరుకున్న చరిత్ర మనది. ఇంతటి ఘనమైన చరిత్రకు తెలంగాణాప్రాంతంలో వక్రభాష్యం చెప్పారు. తమ స్వార్థం కోసం అమాయక తెలంగాణా బీద ప్రజలను నేతలే తప్పుదోవ పట్టించారు. పట్టిస్తున్నారు కూడా. ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న కేసిఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి, పదవి నుంచి బయటకు వచ్చి తాను బతికేందుకు తెలంగాణాఉద్యమం భుజాన్న మోశారు. తమ కోసమే పుట్టిన నేతగా అక్కడి వారు అమాయకంగా ఆయన్ని నమ్మి తెలంగాణారాష్ట్రసమితి(టిఆర్‌ఎస్) ఆవిర్భావానికి సహకరించారు. ఆ తరువాత అప్పటి దాకా పెద్దగా ఆస్తులు లేని కేసిఆర్ కోట్లకు పడగలెత్తారు. ఉద్యమం పేరిట కూలీ పనిపై ఆధారపడ్డ పేదలు కడుపులు మాడ్చుకున్నారు. రాష్ట్రాన్ని అమ్మగా అనుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుతల్లికి అభివాదం చేసిన చేతులతోనే ఆయన పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శలున్నాయి. తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడు కూడా తెలంగాణా ప్రాంతంలో అందరూ కూడా ఒకేరాష్ట్రంలో కలిసి ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు విడిపోవాలని కొందరి స్వార్ధప్రకటనలకు కూలీలు మాత్రమే బలవుతున్నారు. వారి రోజువారీ వేతనాలను వదులుకుని తెలంగాణాఉద్యమంలో పాల్గొంటున్నారు. వారి కడుపుకోతను మిగుల్చుకోవటమే కాకుండా కేసిఆర్ యావత్తు రాష్ట్రం జరుపుకునే రాష్ట్రఅవతరణ పండుగను విద్రోహదినంగా మార్చేశారు. సంబరాలు జరుపుకునే సమయంలో నల్లబాడ్జీలతో నిరసన చేయటం రొమ్ము గుద్దటం కాదా? అప్పటి పోరాటం పొట్టిశ్రీరాములు అశువులు బాస్తే తెలంగాణా శోకసంద్రంలో మునగలేదా? ఎందుకు ఆయన ఈ విద్రోహదినం జరుపుతున్నారు? తన ఉనికి కోసమే కదా! తన మాయమాటలకు లొంగలేదు కాబట్టి ప్రత్యేక తెలంగాణా అవసరమని ఆ ప్రాంతీయులను అభివృద్థిలో ఇంకా వెనక్కి నెట్టేయటం లేదా? అసలు ప్రభుత్వాలు విడుదల చేసే నిధులపై తెరాస ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఉద్యమాలకే పరిమితమవటం వాస్తవం కాదా? రంగారెడ్డి జిల్లాలో అనారోగ్యం ప్రబలటానికి ఆ నిధుల వినియోగం జరగకపోవటమే కారణం కాదా? ఇలా ప్రతీ జిల్లాలోనూ ఎమ్మెల్యేలను ఉద్యమాల బాట పట్టించి తెలంగాణాలో అనారోగ్యం ప్రబలి బలహీనుల సంఖ్య పెంచేపని కేసిఆర్ తన భుజం మీద వేసుకున్నారా? వంటి ఎన్నో సందేహాలు నాటి పోరాట యోధులను, మేధావులను బాధిస్తున్నాయి.